వాటికన్ పునీతత్వం (సెయింట్‌హుడ్) యిస్తున్నట్లు ప్రకటించిన మదర్ థెరిసా గురించి రాయమని చాలామంది పాఠకులు కోరుతున్నారు. ఈ ప్రకటన సందర్భంగా చాలా పత్రికలు చాలా వివరాలు యిచ్చినా నన్నూ రాయమంటూ కోరారు. 1997 సెప్టెంబరులో ఆమె మరణించినప్పుడు ''అమ్మ'' పేరుతో ఒక పెద్ద వ్యాసం రాశాను. అప్పట్లో ఖదీర్‌బాబు (తర్వాత రచయితగా ఎదిగి, యిప్పుడు ''సాక్షి''లో సీనియర్ పొజిషన్‌లో వున్నారు) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సెక్షన్‌లో వుండేవారు. దానికి యిన్‌చార్జిగా ఉమా మహేశ్వరరావు వుండేవారు. నేను వారికి తరచుగా ముఖపత్ర కథనాలు (కవర్ స్టోరీస్) రాసేవాణ్ని. నెహ్రూ, జిన్నా, అట్లీ, గాంధీ, విన్నీ మండేలా, పటేల్.. అన్నీ అలా రాసినవే. మదర్ థెరిసా పోయినపుడు ఉమా లీవులో వున్నారు. ఖదీర్ నా దగ్గరకు వచ్చి ''అమ్మ అనే పేరుతో కవర్‌స్టోరీ రాసిపెట్టండి. మీరు సాధారణంగా వివాదాలు కూడా ప్రస్తావిస్తారు కదా. ఇది నివాళిగా, పాజిటివ్‌గా వుండాలి. వివాదాలు వద్దు'' అన్నాడు. ''ఒక వ్యక్తి గురించి పూర్తి అవగాహన రావాలంటే వారిపై జరిగిన చర్చలు కూడా రాయాలి కదా. నేను కలకత్తాలో మూడున్నరేళ్లు వున్నాను. ఆవిడ సంస్థ కూడా చూశాను. నా అభిప్రాయాలు నిర్మొగమాటంగానే రాస్తాను. మీకేమీ మాట రాదు.'' అని హామీ యిచ్చి, నా దగ్గరున్న పుస్తకాలు, వ్యాసాలలో వున్న మెటీరియలంతా (అప్పట్లో యింటర్‌నెట్ లేదు) వుపయోగించి రాశాను. ఆ వ్యాసాన్ని కింద యథాతథంగా యిస్తున్నాను.
అప్పటికీ, యిప్పటికీ నా అభిప్రాయాల్లో మార్పు రాలేదు. ఒక వ్యక్తి స్థాపించిన సంస్థ వారి తదనంతరం కూడా చక్కగా నడిస్తే, అప్పుడు పునాదులు బాగా పడ్డాయని అర్థం. ఆవిడ పోయి 19 ఏళ్లయినా ఆ సంస్థ బాగానే నడుస్తోంది. వివాదాలతో రచ్చ కెక్కలేదు. ప్రతీదాన్నీ వ్యతిరేకించే బెంగాలీలు కూడా ఆ సంస్థను ఆదరించారు. ఆమె క్రైస్తవ భాషే మాట్లాడేదనే ఫిర్యాదు వుంది. కానీ ఆమె పెరిగిన, నమ్మిన వాతావరణమే అది. మనం కాగితంపై ఓనమాలు రాస్తాం, అవతలివాడికి శ్రీరామరక్ష వుండాలని ఆశీర్వదిస్తాం. అంతమాత్రం చేత వాళ్లని మనం మతంలోకి మార్చేశామని అర్థం కాదు. ఆవిడలో మూర్ఖత్వం వుంది, చాదస్తం వుంది, మతఛాందసం వుంది. ఇలాటివి ఎన్ని వున్నా ఆవిడ సేవాతత్పరత ఎవరూ కాదనలేనిది. ఇక ఆవిడకు సెయింటుహుడ్ యివ్వడం అనేది వాటికన్‌కు సంబంధించిన వ్యవహారం. దానికై రెండు మహిమలు (మిరకిల్స్) చేశారని ధృవీకరించాలట. ఆవిడ పేరు తలచుకుంటే ఒకామెకు కాన్సర్ తగ్గిపోయిందని, మరో అతనికి మెదడులో కణతులు నయమయ్యాయని యిద్దరు చెప్పారు. వాటికన్ నమ్మింది. మనకు కూడా యిలాటి స్వామీజీ మహత్యాలు చాలా చెప్తారు. నమ్మినవాళ్లు నమ్ముతారు. ఆవిడకు 'పునీత' స్థాయి వుందా లేదా అని గతంలో యిచ్చినవారితో పోల్చి చూసే పని నేను పెట్టుకోలేదు. అది వారి మతానికి సంబంధించిన విషయం. మనకు సంబంధించినంత వరకు ఆవిడ ఒక సాధారణ ప్రజలను ప్రేమించి, సేవించిన మహానుభావురాలు. ఇక ఆంధ్రజ్యోతి సౌజన్యంతో పునః వెలువరిస్తున్న 1997 సెప్టెంబరు 14 నాటి వ్యాసం చదవండి –
– మనలో ప్రతి వొక్కరికి తల్లి వుంటుంది. కానీ మనందరికీ ఉమ్మడిగా ఒక తల్లి వుంది – భూమాత. మృత్యువు మనని కబళించిన వేళ యెలాంటి అసహ్యమూ లేకుండా మన మృతశరీరానిన తన వొడిలోకి తీసుకుంటుంది. తనలో కలుపుకుంటుంది. భూమాత లాటిదే మదర్ థెరిసా కూడా. మృత్యుముఖంలో వున్న అనాథలను చేరదీసి, సేదదీర్చే అమ్మ ఆమె. వారి మలినాన్ని, రక్తాన్ని, చీమునీ తీసివేసి చావుకోసం నిరీక్షించేవారి బాధను కాస్తయినా దూరం చేయగల అమృతమూర్తి ఆమె. దయామయి. అలాంటి అమ్మ యిక లేదంటే ఎందరో నిర్భాగ్యులూ, ఆమె ఆప్తవచనంతో వూరడిల్లే ప్రతి ఒక్కరూ అనాథలైనట్లే. కానీ క్షమామయిగా, కరుణామయిగా, అమ్మగా ఆమె లోకానికి చేరువైన క్రమంలో ఎన్ని అడ్డంకులు? ఎన్ని యిబ్బందులు? ఒక్కోసారి ఎన్ని విమర్శలు…
'అసలు మదర్ థెరిసాకు మృత్యుముఖంలో వున్నవారి గురించి ఆలోచన ఎందుకు వచ్చింది?' అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో అనేక సేవాసంస్థ లున్నాయి – ప్రజారోగ్యానికి కృషి చేసేవి, విద్యాబుద్ధులు నేర్పేవి, పరలోకసౌఖ్యానికి దారి చూపేవి..యిలా. కానీ నిర్మల్ హృదయ్ – హోమ్ ఫర్ డైయింగ్ డెస్టిట్యూట్స్ (మృత్యుముఖంలో వున్న నిరాశ్రయుల నివాసం) వంటి సంస్థ ఈమె మాత్రమే ఆరంభించారు. దానికి కారణం ఏమిటో 1950లో ఆమె యింటి యజమానిగా వున్న మైకేల్ గోమ్స్ వివరించారు – 'ఒకసారి నేనూ, ఆమె కలిసి హౌరా(డా)కు వెళ్లడానికి ట్రామ్ కోసం వేచి వున్నాం. కాంప్‌బెల్ హాస్పటల్ (ప్రస్తుతం దాని పేరు నీల్‌రతన్ సర్కార్ ఆసుపత్రి) గేటు వద్ద చావు దగ్గరపడ్డ ఒక అనాథ కనబడ్డాడు. ''అతను పోతాడేమో'' అందామె. మేం తిరిగి వచ్చేటప్పటికి అతను మరణించాడు కూడా. ''ఏం జరిగిందో చూశావా మైకేల్, యిటువంటి వారి కోసం నేనేదైనా నివాసం ఏర్పాటు చేయలి. చావు దగ్గర పడినపుడు వారికి ఊరట కలిగించాలి. చావును ఎలాగూ తప్పించలేం కానీ మనం దగ్గరుండి నాలుగు స్వాంతన వచనాలు చెప్పవచ్చునే, కాసిన్ని నీళ్లడిగితే యివ్వవచ్చునే, అతనేదైనా చెప్పబోతే వినవచ్చునే. ప్రతీ ప్రాణీ సునాయాసంగా తక్కినవారికి బరువు కాకుండా మరణించాలని కోరకుంటాడు, గౌరవంగా పోవాలనుకుంటాడు. మనం వారికా పాటి భాగ్యం కూడా కలగచేయలేమా?'' అందామె.
బిబిసి కోసం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెప్పింది – ''1952లో మేము నిర్మల్ హృదయ్ మొదలు పెట్టినప్పుడు చేరిన తొలి వ్యక్తి ఎవరో తెలుసా? నిస్సహాయంగా పడివున్న రోగగ్రస్తురాలైన ఒక అనాథ స్త్రీ. ఎవరూ పట్టించుకోకపోవడం వలన ఎలుకలు, చీమలు ఆమె శరీరాన్ని అప్పటికే సగం స్వాహా చేశాయి. జీవితం చరమఘడియలలోనైనా ఆమెకు ఒక తృప్తి కలిగించాము. తనంటే అభిమానాన్ని ప్రదర్శించే మనుషులున్నారనీ, తనకోసం వగచేవారున్నారనీ, పట్టించుకునే వారున్నారనీ అనుకుంటా ఆమె మృత్యువు రాకకు సిద్ధపడింది.''
అయితే చావుబతుకుల మధ్య వున్నవారిని చేరదీయడానికి ప్రారంభించిన ఆమె ప్రయత్నాలు అంత సజావుగా సాగలేదు. కలకత్తా కాళీఘాట్ దగ్గరలో పాడుబడిన సత్రంలో ఆమె తన నిర్మల్ హృదయ్‌ను ఆరంభించిన కొద్దిరోజులకే ఆ ఏరియాలో వున్న కుర్రాళ్లు గొడవ మొదలుపెట్టారు – 'ఎవరో ఫారిన్ లేడీ వచ్చి మనవాళ్లందరినీ మతం మార్చేస్తోందని. ఆమె, ఆమె వెంటనున్న నన్స్ వీధుల్లో దిక్కూమొక్కూ లేకుండా పడివున్న వాళ్లందరినీ తీసుకొచ్చి చచ్చేముందు క్రిస్టియన్స్‌ను చేసేసి హిందూమతానికి ద్రోహం చేస్తున్నారని వెళ్లి పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనొచ్చి స్వయంగా అంతా చూశాడు. బయటకు వచ్చి కుర్రాళ్లకు ఒకటే చెప్పాడు – ''మీరు అడిగినట్లే ఆవిడను బయటకు తోసిపారేస్తాను. కానీ ఒకటే షరతు, మీ యింటి నుండి మీ మీ అమ్మలను, అక్కలను తీసుకొచ్చి ఆవిడ చేసే చాకిరీ చేయమనండి. సరేనా?'' అని. కుర్రాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు.
ఏదో ఆశ్రమం పెట్టిన కొత్తరోజుల్లో తెలిసీ తెలియని వయసులో రికామీగా తిరిగే కుర్రాళ్లు అన్నారంటే పోనీలే అనుకుంటాం, కానీ ఆవిడ ప్రముఖ వ్యక్తి అయిన తర్వాత కూడా యిలాటి ఆరోపణ చేశాడు క్రిస్టఫర్ హిచెన్స్ అనే పెద్దమనిషి. వాషింగ్టన్‌లో పత్రికా రచయిత అయిన హిచెన్స్ 1994లో వెలువరించిన 'ది మిషనరీ పొజిషన్ – మదర్ థెరిసా యిన్ థియరీ అండ్ ప్రాక్టీస్' అనే పుస్తకంలో అనేక ఆరోపణలు చేశాడు. వాటిల్లో ఒకటి – 'ఆమె ఆశ్రమంలో మరణశయ్య మీద వున్న రోగులకు స్వస్థత చేకూర్చే మిషతో తడి తువ్వాలుతో నుదుటిమీద రాసి బాప్టయిజ్ చేసేసి క్రైస్తవులుగా మార్చేస్తున్నారు' అని. ఎవరిమీదనైనా సరే బురద చల్లడానికి రెడీగా వుండే ఖుశ్వంత్ సింగ్‌కి కూడా యీ విషయం హాస్యాస్పదంగా కనిపించింది. ''రోమన్ కాథలిక్ విధానాల్లో జరిగే బాప్టిజం గురించి ఏ మాత్రం అవగాహన వునాన్న యిలా మాట్లాడకూడదు. దేవుడి కరుణ ప్రాప్తించుగాక అని ఆశీర్వదించే పద్ధతిలో మదర్ రోగుల నుదుటిమీద తట్టే అలవాటుని యిలా వక్రీకరించడం తప్పు' అన్నారాయన.
తన జీవిత చరిత్ర రాసిన డెస్మాంగ్ డాయిగ్‌తో మదర్ యిలా అన్నారు – 'నేను మనుషులను మార్చాలని చూస్తున్నాను, మతాన్ని కాదు. ఒక వ్యక్తి తనంతట తాను కోరుకుంటే తప్ప భగవంతుడు కూడా అతని మతాన్ని మార్చలేడు. మన కర్మ ద్వారా మనం దేవుడికి చేరువైతే చాలు, మనం ఉత్తమమైన హిందువులుగా, ఉత్తమమైన ముస్లిములుగా, ఉత్తమమైన క్రైస్తవులుగా రూపుదిద్దుకుంటాం.' మదర్‌మీద తొలి రోజుల్లో వచ్చిన నిందలు చూస్తే 'అసలావిడ దేశం కాని దేశంలో కలకత్తా ఎందుకు రావాలి? ఎక్కడే ఏ క్రైస్తవదేశంలోనే ప్రజాసేవ చేసుకుంటే కనీసం యీ నింద తప్పేది కదూ పాపం' అనిపిస్తుంది. భారతదేశం అంటే ఆమెకి ఆసక్తి కలిగించింది – ఆంథోనీ అనే ఆయన రాసిన వ్యాసాలు. ఆ రోజుల్లో, అంటే 1920లలో మదర్ స్వదేశమైన యుగోస్లావియా నుండి కొంతమంది క్రైస్తవ మిషనరీలు వచ్చి గంగాతీరంలో, బెంగాల్‌లో మతప్రచారకులుగా పనిచేస్తూండేవారు. వారిలో ఆంథోనీ ఒకరు. ఆయన ఇండియా గురించి రాసిన వ్యాసాలు చదివి స్కూల్లో చదువుకుంటున్న మదర్ భారతదేశం అంటే ఉత్సుకత చూపించింది. 1928లో 18 వ యేట భగవంతుని సేవలో నన్‌గా మారాలని నిశ్చయించుకుని ఐర్లండ్‌లో డబ్లిన్ వెళ్లి 'సిస్టర్స్ ఆఫ్ లోరెటో (17వ శతాబ్దంలో స్థాపించిన సంస్థ)లో చేరి కొన్ని నెలలపాటు శిక్షణ పొంది, డార్జిలింగ్‌లోని లోరెటో కాన్వెంట్‌కు వచ్చి టీచరుగా చేరింది మదర్.
ఆమె సన్యాసిని కావడానికి ఆర్థిక కారణాలేమీ లేవు. ఆమె తండ్రి రైతు కుటుంబానికి చెందినా కనస్ట్రక్షన్ కంపెనీలో భాగస్వామి. కలిగిన కుటుంబమే. తలిదండ్రులు (నికోలా, డ్రోండా బొజాక్సూ) అల్బేనియాకు చెందినవారు. యుగోస్లావియా (యిప్పటి మాసిడోనియా)కు చెందిన స్కోప్జీలో స్థిరపడ్డారు. 1910 ఆగస్టు 27న పుట్టిన తమ కూతురికి ఏగ్నెస్ గోంక్షా అని పేరు పెట్టుకున్నారు. 1931 మేలో ఏగ్నెస్ తన పేరు థెరిసాగా మార్చుకుంది. సెయింట్ థెరిసా (ఆని ఎవిలా) 16 వ శతాబ్దికి చెందిన స్పానిష్ నన్. ఆమె పట్ల గౌరవం చేతనే ఏగ్నెస్ తన పేరు మార్చుకుంది. థెరిసా పేరుకే వన్నె తెచ్చింది.
1929లో డార్జిలింగ్‌లో నన్ శిక్షణలో చేరి 1931లో నన్‌గా స్వీకరింపబడింది. ఆరేళ్లపాటు ఆమె భగవత్సేవలో గడిపింది. 1937లో కలకత్తాలో వున్న ఎంటాలీ ప్రాంతంలోని లోరెటో కాన్వెంటులో జాగ్రఫీ టీచరుగా చేరినిది. తరువాత ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేసింది. ఆ స్కూలు చుట్టూ వున్న బీదసాదలను చూసి ఆమె చలించిపోయింది. వారికోసం ఏదో చేయాలని తపించింది. చర్చిలోనే భగవద్ధ్యానం చేస్తే చాలదని అనిపించిందామెకు. భారతదేశ విభజన సమయంలో మతకల్లోలాలు అనేకమందిని అనాథలుగా చేశాయి. బెంగాల్ రెండుగా చీలింది. హిందువులు పశ్చిమ బెంగాల్‌కి, ముస్లిములు తూర్పు బెంగాల్‌కి తరలి వెళ్లసాగారు. తూర్పు పాకిస్తాన్ నుండి లక్షోపలక్షలుగా హిందూ శరణార్థులు తరలి రాసాగేరు. వారికి యిల్లు, వాకిలి ఏమీ లేవు. కలకత్తా పేవ్‌మెంట్ల మీదనే నివసించసాగారు. పారిశుధ్యం అనేది కలికంలోకి లేకుండా పోయింది. రోగాలు చుట్టుముట్టాయి. అంటువ్యాధులు ప్రబలాయి. ఎటూచూసినా దరిద్రం, అనారోగ్యం తాండవిస్తున్నాయి. శరణార్థులుగా ప్రాణాలు అరచేతబట్టి పారిపోయి వచ్చిన వారిలో సొంతవారిని పోగొట్టుకున్న వారెందరో. వారికి రోగం, రొష్టూ వస్తే చూసేవారెవరు?
ఇలాటి పరిస్థితుల్లోనే మదర్ ప్రజాజీవితంలోకి వద్దామనుకుంది. కానీ చర్చికి అంకితమై సన్యాసినిగా మారినవారు లౌకిక ప్రపంచంలో రావడమంటే అంత తేలిక కాదు. పోప్ అనుమతి కావాలి. మదర్ చిత్తశుద్ధిని అర్థం చేసుకున్న పోప్ పయస్ 12 1948లో స్వచ్ఛంద సన్యాసినిగా జీవించడానికి ఆమెకు అనుమతి ప్రసాదించారు. అప్పటి నుండి ఆమె నీలం అంచుగల తెల్లచీర (భుజంపై చిన్న శిలువతో సహా) ధరించడం మొదలుపెట్టారు. తరువాత ఆమె ఆశ్రమంలో పనిచేసే సేవికలందరూ అదే విధమైన దుస్తులు వేసుకోవడం ఆనవాయితీ అయింది. రోగపీడితులకు సేవ చేయాలంటే నర్సింగ్ తెలిసి వుండాలి. అందువలన మదర్ పట్నాకు వెళ్లి అమెరికన్ మిషనరీ స్కూలులో మూడు నెలలపాటు నర్సింగ్ అభ్యసించింది. కలకత్తాకు తిరిగి వచ్చి 'లిటిల్ సిస్టర్స్ ఆఫ్ పూర్'తో బాటు వుంది. కానీ కొన్ని రోజులకి విడిగా వుంటే మంచిదనిపించిం దామెకు. ఫాదర్ వాన్ ఎగ్జెమ్ అనే బెల్జియం మిషనరీ సెంట్రల్ కలక్తాలోని చర్చ్ ఆఫ్ అవర్ లేడీ డాలర్స్‌లో పనిచేస్తున్నారు. ఆయనను కలిసి తన ఉద్దేశం వివరించిందామె. ఆయన మైకేల్ గోమ్స్‌తో చెప్పి వాళ్లింట్లో ఒక గది యిప్పించారు. లోరెటో వారు ఆమెకు ఐదు రూపాయలు ఫండ్‌గా యిచ్చారు, నిరక్షరాస్యులైన ఒక స్త్రీ (చరూర్ మాఁ అనేవారు)ని సహాయకురాలిగా యిచ్చారు. నాలుగైదు రోజులు పోయాక మదర్ చదువు చెప్పిన స్కూలులో విద్యార్థిని సుహాసిని (తరువాత సిస్టర్ ఏగ్నెస్‌గా పేరుకెక్కింది) వచ్చి చేరింది. తరువాతి రోజుల్లో ఆమె పాత విద్యార్థినులెందరో మదర్‌తో చేయి కలిపారు.
అలా ఐదు రూపాయలతో ఆరంభించిన ఆమె సంస్థ పెరిగి, పెరిగి యీ రోజు వటవృక్షమైంది. ఆ సంస్థ శాఖోపశాఖలు 87 దేశాలలో విస్తరించాయి. 160 నగరాలలో వారి కార్యకలాపాలు సాగుతున్నాయి. సుమారు 30 వేల మంది పిల్లలు, వృద్ధులు వారి ఆదరణకు నోచుకుంటునాన్నరు. 3 వేల మంది క్రైస్తవ సన్యాసినులున్నారు. 1955 ప్రాంతాల్లో మదర్ కుష్ఠు రోగులకు ఆశ్రమాన్ని ఆరంభించారు. అసన్‌సోల్ వద్ద 34 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆమెకు సమకూర్చింది. ఆ ఆశ్రమం పేరు శాంతినగర్. మరణోన్ముఖులైన నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసినది – నిర్మల్ హృదయ్. అనాథ శిశువుల ఆదరణకు నెలకొల్పినది – నిర్మల్ శిశు సదన్. సేవానిలయాల పేరు – 'మిషనరీస్ ఆఫ్ చారిటీ'. 1955లో 'మిషనరీస్ ఆఫ్ చారిటీ విశిష్టతను గుర్తించి పోప్ పాల్ 6 దాన్ని వాటికన్ అధీనంలోకి చేర్చుకున్నారు. సిస్టర్స్ ఆఫ్ చారిటీకి అనుబంధంగా మగ సభ్యులతో బ్రదర్స్ ఆఫ్ చారిటీ 1965 ప్రాంతాల్లో ఏర్పడింది. 1969లో ఇంటర్నేషనల్ కో-వర్కర్స్ ఆఫ్ మదర్ థెరిసా ఏర్పడింది.
ఈ సంస్థ యింత యిదిగా పెరగడానికి నిధులు అవసరం కదా, అవన్నీ ఎవరిస్తారన్న ప్రశ్న రావడం సహజం. ఆమె నిస్సంకోచంగా విరాళాలు సేకరించారు. మాధవుని సేవకై, అంటే మానవుని సేవకై ఉపయోగపడే ప్రతీ పైసా సద్వినియోగపడినట్లేనని భావించారామె. జోలె కట్టుకుని దేశదేశాలూ పర్యటించారు. అది అంత సులభమైన పని కాదు. వారిని ఒప్పించడం ఒక కష్టమైతే చందా యిచ్చినవారి గుణగణాలను బట్టి నిందపడడం మరో కష్టం. చందా యిచ్చినవారెవరైనా సరే, భగవత్కార్యం కదాని స్వీకరించడం వలన ఆమె పలు విమర్శలకు గురయ్యింది. సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అయ్యేవారిలో ఎవరు ఎటువంటివారో తెలుసుకోవడం సాధ్యమా? దొరికేవరకూ అందరూ దొరలే. మీరు చేసే మంచిపనిలో సహాయపడతానంటూ వచ్చినవారు సహృదయంతోనే వచ్చి వుంటారని అనుకోవడంలో వింతేముంది? తరువాత వాళ్లు దొరలు కాదని, దొంగలని తేలితే చేయగలిగేదేముంది? క్రైస్తవమతంలో 'క్షమించడం' అనేది అతి ప్రాచుర్యంలో వున్న పదం. ఒక నిజమైన క్రిస్టియన్‌గా మదర్ ఆ పదాన్ని ఎన్నోసార్లు ఉపయోగించారు. అవతలివాడు ఎటువంటివాడైనా సరే క్షమించాలన్నది క్రైస్తవం నేర్పే పాఠం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు, బాధితులను పరామర్శిస్తూ యూనియన్ కార్బయిడ్ వారిని క్షమించమని సలహా నిచ్చింది మదర్. అది 'బహుళజాతి సంస్థలపై ఆమెకు గల పక్షపాతం' అంటూ విపరీతార్థాలు తీశారు కొందరు.
తమ్ముడితో పోట్లాడి, అమ్మ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఏమంటుంది? 'పోన్లేరా, చిన్నవాడు కదా, సర్దుకో, యీసారికి వదిలేయ్' అంటుంది. అది మనకు నచ్చదు, అమ్మ పక్షపాతం చూపిస్తోంది అనుకుంటాం. రేపు మన పిల్లవీ పోట్లాడినప్పుడు మనమూ అదే సలహా చెప్తాం, ఆ పాటికే మనకు వివేకం వస్తుంది కాబట్టి, మనిషికి కావలసినది బలాబలాలు తేల్చుకోవడం కాదని, ప్రేమాభిమానాలే ముఖ్యమని తెలిసివస్తుంది కాబట్టి. మదర్ థెరిసా అందరికీ అమ్మే. కాబట్టి అందర్నీ క్షమించమంటుంది. ఆ క్షమాగుణాన్ని చాలామంది తప్పుబట్టారు. సాల్వడార్‌లో హత్యలు చేయిస్తున్న రోనాల్డ్ రీగన్ హస్తాల మీదుగా 'మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' స్వీకరించడాన్ని, అల్బేనియాను ప్రపంచంలో ప్రప్రథమ నాస్తికదేశంగా ప్రకటించిన స్టాలినిస్టు ఎన్నవర్ హోఝూ సమాధిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచడాన్ని, హైతీ నియంత బేబీ డాక్ డ్యూవాలియర్స్ ఆతిథ్యాన్ని స్వీకరించి అతన్ని ప్రస్తుతించడాన్ని వాళ్లు విమర్శించారు. వారి రాజకీయాలకు సంజాయిషీ చెప్పమని మదర్‌ని నిలదీస్తే ఆమేం చెపుతుంది? ఆమెకు వారి రాజకీయాలతో పనేముంటుంది? వారు పిలిచారు, ఆమె చేసే పనిని మెచ్చి, ఆమెకు సహాయపడతానన్నారు, పడ్డారు. అది ప్రచారం కోసం చేసుకున్నారో, మరే ఉద్దేశంతో చేసుకున్నారో వారికే తెలియాలి. మదర్‌కు తెలిసినంతవరకు తాను చేసేది దైవకార్యం. అందుకు ఎవరు సహాయపడినా స్వీకరించడమే మంచిది.
ఈ విషయంపై మదర్ తర్కం గురించి ప్రఖ్యాత జర్నలిస్టు జగ్ సూరియా ఒక సంఘటన రాశారు. పోప్ ఇండియాకు వచ్చినపుడు ఆయనకు ఒక పెద్ద కారు బహుమతిగా లభించింది. ఆయన దాన్ని మదర్‌కు బహూకరించారు. ఆమె దానిని సరిగా చూడను కూడా చూడలేదు. ఒక లాటరీ ఏర్పాటు చేసి ఆ కారుని బహుమతిగా యిస్తాననీ, లాటరీలో వచ్చిన సొమ్మును నిర్మల్ హృదయ్‌నకు యిస్తానని ప్రకటించారు. ఆ సందర్భంలో జగ్ సూరియా అడిగారట – 'లాటరీ అంటే జూదమే కదా, ఆశనూ, అసూయనూ పెంచుతుంది కదా, మీరిలా చేయడం భావ్యమా?'' అని. మదర్ చమత్కారంగా చిరునవ్వు నవ్విందట – 'వాళ్లు జూదం ఆడుతున్నామనుకుంటున్నారు. కానీ తెలియకుండానే భగవంతునికి సేవ చేస్తున్నారు. తమాషాగా లేదూ?' అందిట. వాషింగ్టన్ పోస్టు కూడా ఓ సారి ఓ రాయి వేసి చూసింది – 'ఆమె సంస్థకు 50 మిలియన్ల డాలర్లున్నాయి. అయినా లెక్కాడొక్కా సరిగ్గా వుంచరు' అని. 'సన్యాసులు ఆడిట్లకు అతీతులు కాబోలు' అంటూ వ్యాఖ్యానించింది కూడా.
సంగతేమిటంటే మదర్‌కి యివన్నీ తలకాయనొప్పి పనులు. రోగులకు సేవ చేయడం ముఖ్యం కానీ, యీ పద్దులు రాసుకుంటూ కూచోడం ఏమటని ఆవిడ బాధ. ఆవిడ కట్టుకుపోయేదేమీ లేదు, సన్యాసిని. వారసులే లేరు. ఆవిడ వెనకేసినా ఎవరికోసం వెనకేయాలి? అందువల్ల ఆడిట్లకు భయపడవలసిన అగత్యం ఆమెకు లేదు. ఆలెక్కల ఆరాలంటే తలనొప్పి వలననే ఆమె ప్రభుత్వం యిచ్చే గ్రాంట్లు తీసుకోదు. ఈ విషయమై మాల్కొమ్ మగరిడ్జ్ 'సమ్‌థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్'లో రాశారు – 'నేనొకసారి మదర్‌ని అడిగేను కూడా – ప్రభుత్వం యిస్తానంటున్న గ్రాంట్లు తీసుకోవచ్చు కదా'ని. 'వాటికి జమాఖర్చులన్నీ చూపించాలి. అదో పెద్ద పని. మేం మిగతా పనులు మానేసి యివే పట్టుక్కూచోవాల్సి వస్తుంది' అందామె. నిజమే, వారి సంస్థ మొత్తం అజమాయిషీ చేస్తున్నది యిద్దరు నన్స్. వారికి తోడున్నది వంకర పోయిన ఓ పాత టైపు మిషన్. మదర్ తన రాతకోతలు తనే చేసుకుంటుంది. అందరూ పడుకున్నాక తన ఉత్తరాలు స్వహస్తాలతో తనే రాసుకుంటుంది. ఇక యీ గ్రాంట్లు తీసుకుంటే దీనికోసం ఏ పెద్ద ఆఫీసే నడపాల్సి వస్తుంది'' అని రాశారు మాల్కోమ్.
ఇన్ని కోట్ల రూపాయలు సమకూర్చిన సంస్థల్లో ఆమె అనుభవించిన సుఖాలూ లేవు, సౌకర్యాలూ లేవు. ఆమె తత్వమే అంత. తన వద్దకు చేరిన అనాథలకు ఏర్పాటు చేయలేనిది తనూ అనుభవించకూడదని ఆమె సిద్ధాంతం. జగ్ సూరియా రాసినదాని ప్రకారం – 'నేను మదర్‌ను మొదటిసారి కలిసినది – బంగ్లాదేశ్ యుద్ధసమయంలో. ప్రభుత్వ అధికారులతో, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ఒక హైలెవెల్ మీటింగు జరుగుతోంది. చర్చలు సాగి, సాగి గణాంకాల వూబిలో కూరుకుపోయాయి. ఏ సహాయం ఎవరు, ఎలా, ఎందుకు చేయాలి, అసలు చేయగలమా లేదా అన్న వాదనలు ఎడాపెడా సాగిపోతున్నాయి. ఇంతలో మదర్ చల్లగా, సద్దు చేయకుండా వచ్చింది. ఆమెకీ లెక్కలు పట్టలేదు. 'అవతల మనుషులు చచ్చిపోతున్నారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని సాయం చేసేయడమే. ఎంత, ఎలాగ దాన్ని సమకూర్చుకోవడం అన్న విషయాలు అవతల చూసుకోవచ్చు. ముందు కార్యరంగంలోకి దూకేయడమే' అంది. తల్లితో వాదించగల ఘనుడెవడున్నాడు? అందరూ సరే అనేశాం.'
దారిద్య్రాన్ని గ్లోరిఫై చేస్తోందని మదర్‌ను చాలామంది తప్పుపట్టారు. తమ సంస్థ కొచ్చిన డబ్బంతా పెట్టి కలకత్తాలోనే పెద్ద హాస్పటల్ కట్టి పడేయకుండా 87 దేశాల్లో అరకొరగా, చాలీచాలని సౌకర్యాలతో అన్ని ఆశ్రమాలు నెలకొల్పడం ఎందుకు? అని విమర్శించారు. ఆమె ఆశ్రమాల్లో వున్న వాళ్లకు సేవాభావం వున్న విషయం కరక్టే కానీ చికిత్సా విధానం తెలియదని, ఖరీదైన వైద్యం చేయించకుండా వూరికే ప్రార్థన చేయమంటే సరిపోదనీ అన్నారు. ఆమె వద్ద పనిచేసిన ఒక సహాయకురాలు నొప్పితో బాధపడుతున్న రోగులకు పెయిన్ కిల్లర్స్ యిస్తానంటే మదర్ వారించారట. ప్రయోజనం ఏముంది? అన్నారట. అలా అని ఆ సహాయకురాలు టీవీ ఫిల్మ్‌లో చెప్పారు. నిజమే కావచ్చు, పెద్దవాళ్లవుతున్న కొద్దీ వేదాంత ధోరణి అలవడుతుంది. మనం పరిణతి చెందిన కొద్దీ మానవప్రయత్నాల నిష్ప్రయోజకత్వం తెలిసి వస్తుంది. పెయిన్ కిల్లర్స్ యిచ్చే తాత్కాలిక ఉపశమనంతో రోగులను ఊరుకోబెట్టడం కంటె బాధను భరించి, మృత్యువును ఆహ్వానించే మానసిక శక్తిని వారికి కలగజేయడం మంచినదనిపించే ఆలోచన వస్తుంది. మరణ శయ్య మీద వృద్ధులనేకమంది 'ఎలాగూ చావు దగ్గర పడింది. ఇంజక్షన్లచ్చి బాధపెట్టకండి, పోయా ప్రాణాన్ని సుఖంగా పోనీయండి. ఆసుపత్రిలోంచి డిస్చార్జి చేసి యింటికి పంపేయండి' అని బతిమాలుకుంటూ వుంటారు. కానీ మన బాధ్యతగా మనం వారి ఆక్రందనలు పట్టించుకోకుండా ఐసియులో పెట్టి పొడిపించేస్తూ వుంటాం. కానీ జీవితసారం వంటబట్టినవారు వారి ఆవేదనను అర్థం చేసుకుంటారు.
దరిద్రులను చేరదీయడం కంటె దారిద్య్రానికి మూలకారణాన్ని వెతికి పట్టుకుని దాన్ని రూపుమాపి రేపటి దరిద్రుల సంగతి చూడమని మదర్‌కు సలహాలు యిచ్చిన మేధావులూ వున్నారు. లాటిన్ అమెరికాలో ప్రీస్టులు కూడా యీ సలహా యిచ్చినవారిలో వున్నారు ''మీరంతా రేపటి పేదల గురించి పట్టించుకోండి, నేను యివాళ్టి పేదల బాగోగులు చూసుకుంటాను'' అని జవాబిచ్చింది మదర్. అదీ సంగతి! మదర్‌ను యీ పని చేయమని ఎవరూ పురమాయించలేదు. తన దగ్గరకు రమ్మనమని ఆమె ఎవరినీ బలవంతపెట్టలేదు. ఆమెకు తోచిన రీతిలో, తనకు చేతనైనంత వరకు ఆమె సేవ చేసుకుంటూ పోయింది. ఆ పని నచ్చినవారికి నచ్చుతుంది. అందరికీ నచ్చితీరాలని ఆమె అనుకోదు. కానీ కొన్ని కొన్ని విషయాలలో ఆమె వాదన మనకు మింగుడు పడదు. ముఖ్యంగా గర్భస్రావాల విషయంలో – ప్రపంచంలో అన్నిటికంటె పెద్ద సమస్య స్వచ్ఛంద గర్భస్రావాలంటుందామె. గర్భనిరోధకాలు కూడా వాడవద్దంటుంది. యునైటెడ్ నేషన్స్ సభలో కూడా ఆమె 'ఈ రోజు శాంతిని నాశనం చేసేవాటిలో ముందుగా చెప్పాల్సింది అబార్షన్‌లే. తన డుపులో వున్న బిడ్డను కన్నతల్లే నిర్దయగా నిర్మూలింప చూస్తూంటే, మీరూ నేనూ ఒకరినొకరు సంహరించడానికి సమకడితే అర్థమేముంది?'' అని వాదించిందామె. శక్తి లేకపోయినా పిల్లన్ని పుట్టించి వదిలేస్తే మాత్రం పాపం కాదా, వారినేం చేయాలిట? అని అడిగితే ''నా కిచ్చేయండి, నేను పెంచుతాను' అంటుందామె. ఇలా ఎంతమందిని పెంచగలుగుతుందట? ఇవన్నీ ఆమె ఆలోచించే మాట్లాడుతోందా? అనిపిస్తుంది మనలా చదువుకున్నవారికి. ఒకసారి ఆమె చెప్పింది – 'అసాంప్రదాయకమైన శృంగార జీవితానికి భగవంతుడు విధించే శిక్షే ఎయిడ్స్' అని. ఇంకోసారి 'చర్చికి, గెలీలియోకి జరిగిన సంఘర్షణ సమయంలో తాను వుండి వుంటే చర్చినే సమర్థించేదాన్ని' అంది.
అంతుపట్టని ఆమె ఆలోచనా విధానానికి మాల్కమ్ మగరిడ్జ్ చక్కటి కారణం చెప్తారు – 'మదర్ ఒక పల్లెటూరి రైతు కుటుంబం నుంచి వచ్చింది. పల్లెటూరి వారికి తర్కం గట్రా తెలియవు. హృదయంతోనే ఆలోచిస్తారు. ప్రపంచ రాజకీయాల లుకలుకలు, భవిష్యత్ ప్రణాళికల తికమకలు అవన్నీ ఆమె లోకంలో కనబడవు. ఆవిడకు తోచినది, విశ్వసించినదీ ఆమె చెపుతుంది. దానిలో నిజాయితీ మాత్రం కనబడుతుంది.' అందుకనే మదర్ విషయంలో మనం కన్నతల్లి చాదస్తాన్ని విసుక్కున్నట్టే ఆమెనూ సుతారంగా మనసులో మందలిస్తాం – రేపు మన పిల్లలకు మన ఆలోచనలు ఛాందసంగా కనబడవచ్చుననే విషయం మనసులో మెదలుతుంది కాబట్టి. ఎంతైనా అమ్మ అమ్మే కదా. మదర్‌కు ప్రచారం అంటే ప్రీతి అనే మాటా వుంది. జగ్ సూరియా ఒక చోట రాశారు – ''ఒకసారి ఆమె వద్దకు వెళితే ఒక రోగికి బాండేజి కట్టడంలో సాయపడమని ఆమె కోరింది. 'బాండేజి కట్టడం నాకు రాదు. నాకు వచ్చిన విద్య పత్రికల్లో రాయడం. మీరు తీరిక చేసుకుని మీ సేవ గురించి నాతో ముచ్చటిస్తే వ్యాసం రాసి పత్రికలలో వేస్తాను. పదిమందీ చదువుతారు. ఓపికున్న కొందరు వచ్చి చేయి కలుపుతారు, అది చేయలేనివారు ధనసహాయం చేస్తారు. మీ కృషి పదిమందికి తెలియడం మంచిది కదా' అన్నాను. ఆమె నేను చెప్పిన అంశం గ్రహించారు. బాండేజి కట్టమనకుండా నాకు ఇంటర్వ్యూ యిచ్చారు.'' ట్రెవర్ ఫిష్‌లాక్ కూడా ఒకసారి అన్నారు – 'కలకత్తాలో ఒకసారి ఆమెను యింటర్వ్యూ చేసిన తరువాత ఆమె విలువైన సమయాన్ని హరించినందుకు క్షమాపణలు చెప్పాను. ఆమె చిరునవ్వు నవ్వుతూ 'పాత్రికేయులు కూడా భగవంతుని సేవ చేసి పెడుతున్నారుగా' అంది. నిజానికి బిబిసిలో ప్రసారం చేసిన ఆమె యింటర్వ్యూ ఎంతోమందిని ఆకట్టుకుంది. దాన్ని పునః ప్రసారం చేయమని ఎన్నోసార్లు అభ్యర్థనలు వచ్చాయి. అది ప్రసారం కాగానే 20 వేల పౌండ్లు విరాళంగా వచ్చాయి.
ఎవరేమన్నా మదర్ తన కార్యకలాపాల్లో మునిగి వుండేది. దేశాధిపతులకు సైతం ఫోన్ చేసి సహాయం అడగగలిగే స్థాయిలో వుండేది. ఆమె అంత్యక్రియల కారణంగా దేశదేశాల ప్రముఖులు కలకత్తా విచ్చేశారు. సునీల్ గంగోపాధ్యాయ్ చెప్పినట్లు – ''ఆ మహానుభావురాలు తన క్రియాయజ్ఞానికి మా నగరాన్ని ఎంచుకోవడం మాకెంతో గర్వకారణం.'' చిదానంద్ దాస్‌గుప్తా ''ఒక మానవ సముదాయాన్ని గుర్తించడానికి మతం అనేది ఒక గుర్తయితే అది లేకుండా మేం ఉండగలం. కానీ మదర్ లేకుండా వుండలేం.'' అంటే ఖుశ్వంత్ సింగ్ ''నాకు భగవంతుడిలో నమ్మకం లేదు కానీ భగవంతుడిలో నమ్మకం వున్న మదర్‌లో నమ్మకం వుంది. ఆమె మూర్తీభవించిన మంచితనం అని మాత్రం నాకు బాగా తెలుసు'' అన్నాడు.
మనం ఎన్ని చెప్పినా, ఎంత రాసినా అమ్మ ఆప్తవచనాన్ని నిర్వచించే భాష మనకెక్కడిది చెప్పండి?'
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)