ట్యునీసియా, ఈజిప్టులలో నియంతల పాలన అంతమయ్యాక లిబియాలో గడ్డాఫీ వ్యతిరేకులకు ధైర్యం వచ్చింది. 2011లో అతనిపై తిరగబడ్డారు. గడ్డాఫీ సేనలు వాళ్లని అణచివేశాయి కానీ అమెరికా నేతృత్వంలోని నాటో సేనలు విమానదాడులతో తిరుగుబాటుదారులకు సాయం చేశాయి. అక్టోబరు కల్లా గడాఫీని చంపివేశారు కానీ అప్పణ్నుంచి దేశంలో అంతర్యుద్ధం నడుస్తోంది.
యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో కొందరు నాయకులు తమ మధ్య ఒప్పందానికి వచ్చి ''గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ ఎకార్డ్'' (యూనిటీ గవర్నమెంట్) పేరుతో ప్రభుత్వం ఏర్పరచి నడిపిస్తున్నారు. కానీ యీ మార్పును సమ్మతించని మిలటరీ జనరల్ ఖలీఫా హఫ్తార్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తన అధికారం చలాయిస్తున్నాడు. దేశం యీ రెండు ప్రభుత్వాల మధ్య కొట్టుమిట్టులాడుతూంటే సందట్లో సడేమియాలా 2014లో ఐసిస్ దూరింది.
సముద్రతీరంలో వున్న గడ్డాఫీ జన్మస్థలమైన సిర్టి ని 2015 కల్లా తన అధీనంలోకి తీసుకుంది. అక్కడ పని చేసే ఈజిప్టు నుంచి క్రైస్తవ కార్మికులను పట్టుకుని చంపివేసి 2015 ఫిబ్రవరిలో వీడియో ద్వారా లోకానికి చూపి భయభ్రాంతులను చేసింది. అంతర్జాతీయ దేశాల ఒత్తిడి వలన సిరియా, ఇరాక్‌లపై తన పట్టు కోల్పోయినా ఐసిస్ లిబియాలో తిష్ట వేస్తుందని పరిశీలకులు భయపడ్డారు.
ఐసిస్‌ను ఎలాగైనా అదుపు చేయమని యూనిటీ గవర్నమెంటు అమెరికాను కోరింది. ఐసిస్ స్థావరాలపై ఆగస్టు 1 నుంచి అమెరికా ఐదు విమానదాడులు చేసి రెండు ట్యాంకులను, మిలటరీ వాహనాలను ధ్వంసం చేసింది. ఆ ధైర్యంతో సిర్ట్‌కు దగ్గర్లోనే వున్న మిసరాతాలో వున్న యూనిటీ ప్రభుత్వపు సైన్యాలు పది రోజుల తర్వాత ఐసిస్ ఆక్రమణలో వున్న ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ మిసరాతా బ్రిగేడ్‌లలో గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అనుభవజ్ఞులూ వున్నారు, ఏ అనుభవమూ లేని యువకులూ వున్నారు.
అవతల ఐసిస్ వారు యిలాటి యుద్ధాల్లో ఆరితేరిన వారు. తక్కువ సంఖ్యలోనే వున్నా వీరికి అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూ విపరీతంగా ప్రాణనష్టం కలగజేశారు. చాలామందిని పోగొట్టుకున్నా చివరకు మిసరాతా వారు ఐసిస్‌ను ఆ ప్రాంతం నుంచి తరిమివేస్తున్నారు. పోరాటం యింకా సాగుతున్నందున తాజాగా అమెరికా హెలికాప్టర్లు కూడా పంపుతోంది. ఇలాటివి ఎదురుదెబ్బలు తగులుతేనే ఐసిస్ విస్తరణ తాత్కాలికంగానైనా ఆగుతుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టంబర్ 2016)