'వారసుడు' వస్తున్నాడంటే, ఆ వారసుడి తెరంగేట్రం కోసం సినీ ప్రముఖులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. లాంఛింగ్ అదిరిపోయేలా వుండాలి. లేదంటే, తేడా కొట్టేస్తుంది. తమ అనుభవాన్నంతా రంగరించి, తమ వారసుల్ని తయారు చేస్తుంటారు. డాన్సుల్లో, యాక్టింగ్‌లో, స్టైల్‌లో.. ఇలా అన్నిట్లోనూ శిక్షణ ఇప్పించి, ఆ తర్వాత తెరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
అయితే, సినీ రంగంలో సక్సెస్ అంత ఆషామాషీ కాదు. సక్సెస్ కొట్టాలంటే, అన్నిటితోపాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అఖిల్ విషంలో అదే తేడా కొట్టేసింది. తొలి సినిమా 'అఖిల్' తేడా కొట్టేయడంతో, రెండో సినిమా కోసం అఖిల్ పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ సినిమా చేయాలో తెలియని పరిస్థితి. అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్, తెరంగేట్రం చేసేశాడు. అక్కినేని ఫ్యామిలీలోనే సూపర్ డాన్సర్ అనిపించుకున్నాడు. పైగా అందగాడు. కానీ, సక్సెస్ కొట్టలేకపోయాడు.
అక్కినేని వారసుడు ఇలా వుండడంతో, నందమూరి బాలకృష్ణ కాస్త అలర్ట్ అయినట్టున్నాడు. తన కుమారుడు మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ ఛాన్స్ తీసుకోలేకపోతున్నాడట. 'నా వందవ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తాడు..' అని గతంలో ప్రకటించేసిన బాలకృష్ణ, ఆ తర్వాత తన ఆలోచనల్ని మార్చుకోవాల్సి వచ్చింది. బోయపాటి శ్రీను చేతిలో పెట్టాలన్నది బాలకృష్ణ ఆ తర్వాత చేసిన ఆలోచన. ప్రస్తుతానికైతే ఆ ఆలోచనలన్నీ అటకెక్కినట్లేనట.
ప్రస్తుతం పూర్తిస్థాయిలో మొక్షజ్ఞకి శిక్షణ ఇప్పించాలనీ, కాస్త టైమ్ పట్టినా, పెర్‌ఫెక్ట్ లాంఛింగ్ ఇవ్వాలనీ బాలకృష్ణ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలస్యానికి కారణం పరోక్షంగా 'అఖిల్' సినిమాయేనన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే. కానీ, ఆ జాగ్రత్త అతి జాగ్రత్త అయితేనే ఇబ్బంది.