మెగాస్టార్ చిరంజీవికి కృష్ణవంశీ అత్యంత సన్నిహితుడు. ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా చేయాలన్నది కృష్ణవంశీ డ్రీమ్. అప్పట్లో చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నా, కృష్ణవంశీకి చిరంజీవి ఛాన్స్ ఇవ్వలేదు. రాజకీయాల్లోకి వెళ్ళడంతో, చిరంజీవితో సినిమా చెయ్యాలన్న కృష్ణవంశీ కోరిక అలా మిగిలిపోయింది.
చిరంజీవితో సినిమా చెయ్యలేకపోతేనేం, కృష్ణవంశీకి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. కానీ, ఆ ఛాన్స్‌ని కృష్ణవంశీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒకప్పుడు క్రియేటివ్ దర్శకుడే అయినా, ఇప్పుడా క్రియేటివిటీ కృష్ణవంశీలో కన్పించడంలేదన్నది నిర్వివాదాంశం. అలాగని, కృష్ణవంశీలో టాలెంట్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కృష్ణవంశీ టాలెంట్ గురించి అందరికన్నా ఎక్కువగా చిరంజీవికే తెలుసట. అందుకే, చరణ్‌తో మరోసారి ట్రై చెయ్యాల్సిందిగా కృష్ణవంశీకి చిరంజీవి గతంలోనే సూచించినట్లు తెలుస్తోంది.
ఇకనేం, కృష్ణవంశీ మరో కథని రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసే పనిలో పడ్డాడట 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం విడుదలైన కొద్ది నెలల తర్వాత. ఆ కథ విషయంలో చరణ్ కూడా సంతృప్తిగానే వున్నాడని తెలుస్తోంది. కృష్ణవంశీతో ఇంకోసారి సినిమా చేసే ఉద్దేశ్యంతోనే వున్న చరణ్, కృష్ణవంశీ రూపొందిస్తున్న 'నక్షత్రం' సినిమా ప్రమోషన్‌కి తనవంతు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే చరణ్ 'ధృవ' సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత చరణ్, సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తాడు. దాని తర్వాత బోయపాటి డైరెక్షన్‌లో చరణ్ చేసే సినిమా వుంటుంది. మరి, కృష్ణవంశీ సినిమాకి చరణ్ అకామడేట్ చేయగలడా.? ఏమోగానీ, కృష్ణవంశీతో చరణ్ సినిమా అంటే కొంచెం రిస్కేనేమో.! గత అనుభవం అలాంటిది మరి.