కారప్పొడితో ‘కల్లోలం’ తగ్గుతుందా.?

కల్లోల కాశ్మీర్‌పై కారప్పొడి చల్లాలట. తప్పదు మరి, ఇది కాకపోతే ఇంకో ప్రత్యామ్నాయం కన్పించడంలేదని కేంద్రం ఓ అవగాహనకు వచ్చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాశ్మీర్‌లో పెల్లెట్‌ బుల్లెట్స్‌కి బదులు,…

కల్లోల కాశ్మీర్‌పై కారప్పొడి చల్లాలట. తప్పదు మరి, ఇది కాకపోతే ఇంకో ప్రత్యామ్నాయం కన్పించడంలేదని కేంద్రం ఓ అవగాహనకు వచ్చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాశ్మీర్‌లో పెల్లెట్‌ బుల్లెట్స్‌కి బదులు, 'కారప్పొడి' బుల్లెట్లను వాడబోతున్నామని ప్రకటించేశారు. 

అసలేంటీ కారప్పొడి బుల్లెట్లు.? అంటే, ఈ బుల్లెట్లతో ఎవరి మీదకు తుపాకీలు ఎక్కుపెట్టినా, వారికి గాయాలేమీ కావు. జస్ట్‌, ఒళ్ళు మండిపోతుందంతే. అదే పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగిస్తే, మరీ ప్రాణాంతకం కాకపోయినా, అప్పుడప్పుడూ ప్రాణాంతకమే. బుల్లెట్‌ తగిలిందా.? ఇక నరకమే. మొహంలోకి పెల్లెట్లు దూసుకుపోతే, తద్వారా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కళ్ళు పోతాయ్‌.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ్‌. 

కాశ్మీర్‌లో వున్నది కూడా భారత పౌరులే. అక్కడి యువత.. అందునా, 14 నుంచి 20 ఏళ్ళ వయసున్న యువకులే ఎక్కువగా పోలీసులపైకి తిరగబడ్తుంటారు. ప్రాణాలకు తెగించేస్తారు. పాకిస్తాన్‌తోపాటు ఐసిస్‌ జెండాల్నీ ఎగరవేస్తారు. అసలు తమది భారతదేశం కాదంటారు. పాకిస్తాన్‌కి జై కొడుతుంటారు. కానీ, వాళ్ళు మన భారతీయులే. ఏం చేస్తాం.? వారిని చంపుకోలేం కదా.! అందుకే, పోలీసుల్ని.. భద్రతాదళాల్నీ పణంగా పెడ్తున్నాం. 

ఏం చేస్తాం, దేశంలో రాజకీయాలు అలా తగలడ్డాయ్‌. కాశ్మీర్‌లో ఎవరు అధికారంలో వున్నాసరే, వారికి కేంద్రంలోని పాలకులు సాగిలా పడాల్సిందే. అక్కడే వస్తోంది చిక్కు అంతా. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా.? లేదు కదా. చట్టాల్ని సైతం ఎప్పటికప్పుడు మార్చేసుకుంటున్నాం. అయినా, కాశ్మీర్‌లో పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురాలేకపోతున్నాం. అసలు కాశ్మీర్‌ని ప్రత్యేకంగా ఎందుకు చూడాలి.? అలా చూడ్డం వల్లే ఈ సమస్యలేమో.. అన్న ఆవేదన సగటు భారతీయుడిలో కలుగుతోంది. కానీ, ఆ దిశగా పాలకులు ఆలోచనలు చేయలేరు. ఎందుకంటే, ఇది రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్న చాలా సున్నితమైన అంశం. 

కామెడీ కాకపోతే, పెల్లెట్‌ బుల్లెట్స్‌కే భయపడని కాశ్మీరీ యువత.. కారప్పొడి బుల్లెట్లకు భయపడ్తారా.? ఈ మాత్రం చిన్న ఆలోచన కూడా లేకుండా, 'ఎద్దు ఈనింది.. అనగానే దూడని కట్టెయ్‌రా..' అన్న చందాన, కారప్పొడి బుల్లెట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. 'చర్చలతోనే ఏ సమస్యకు అయినా పరిష్కారం..' అంటారు. కానీ, పార్లమెంటుని ప్రత్యేకంగా హాజరు పరిచి, కాశ్మీర్‌పై కీలక నిర్ణయం.. అదీ ఏకాభిప్రాయంతో తీసుకోవచ్చు కదా.! ఆ ఒక్కటీ అడక్కండి.