ప్యాకేజీ.. ప్యాకేజీ.. ప్యాకేజీ.. గడచిన మూడు నాలుగు రోజులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి నోట 'ప్యాకేజీ' తప్ప ఇంకో మాట రావడంలేదు. ప్రత్యేక హోదా లేనట్లే.. అంటూ సంకేతాలు పంపేందుకు సుజనా చౌదరి పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. హోదా రాకపోతేనేం, దాన్ని మించిన ప్యాకేజీ రాబోతోందని సుజనా చౌదరి చెప్పడం, దాన్ని టీడీపీ అనుకూల మీడియా 'బూతద్దంలో' చూపించడం జరుగుతోంది.
అసలు కేంద్ర మంత్రిగా సుజనా చౌదరి విశ్వసనీయత ఏంటి.? అన్న ప్రశ్న దగ్గర కథ మొదలు పెట్టాలి. పేరుకి సుజనా చౌదరి కేంద్ర మంత్రేగానీ, కేంద్రంలో ఏం జరుగుతోందో ఆయనకు తెలియదు. చంద్రబాబు చెబుతారు, సుజనా చౌదరి మాట్లాడతారు. అంతే తప్ప, కేంద్రంలోని పరిణామాలు తెలుసుకునేంత సీన్ ఆయనకు లేనే లేదన్నది నిర్వివాదాంశం. ఎంత చీప్‌గా సుజనా చౌదరి మాటలు వుంటున్నాయో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ ఇది…
పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం 70 : 30 పద్ధతిన (కేంద్రం 70, రాష్ట్రం 30 నిష్పత్తి అన్నమాట) ఇవ్వాలనుకుంటే, తాము వీరయోధుల్లా అడ్డంపడి, 90 : 10 ప్యాకేజీకి ఒప్పించామని చెబుతున్నారు చంద్రబాబు. నాన్సెన్స్ అంటే ఇదే మరి. పోలవరం జాతీయ ప్రాజెక్టు. అంటే, జాతీయ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాలి. ఇక్కడ, సుజనా చౌదరిగానీ, చంద్రబాబుగానీ ఊడబొడిచిందేంటట.?
ప్రత్యేక హోదా ఇస్తే రాయితీలొస్తాయి. కానీ, ఆ హోదా ఇవ్వకుండా అంతకు మించి మేలు జరిగేలా రాయితీలను, నిధుల రూపంలో విడుదల చేస్తారట. రాజ్యసభ సాక్షిగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించాయి. అలాంటప్పుడు ప్రత్యేక హోదాకి ఎవరో అడ్డుపడుతున్నారు గనుక, ఆ పేరు కాకుండా సాయం చేస్తామంటే, అదేమన్నా బిచ్చమా.?
సరే, కేంద్రంలో ఏదో జరుగుతోంది. అసలు జరుగుతుందో లేదో ఎవరికీ తెలియదు. కానీ, ఇక్కడ హైడ్రామా నడుస్తోంది. ఇందులో కన్పిస్తోన్న పాత్రధారి సుజనా చౌదరి. తెరవెనుక నడిపిస్తున్నది చంద్రబాబు. ఎందుకీ తతంగం.? అంటే ఓటుకు నోటు కేసు. అంతకు మించి, ఏదో జరిగిపోతుందని అనుకోవడమే హాస్యాస్పదం. ఒకవేళ జరిగినా, అదీ లక్షల కోట్ల రూపాయలను ప్యాకేజీ రూపంలో ప్రకటించినా.. అది అంకెల గారడీ తప్ప, ఆంధ్రప్రదేశ్‌కి ఉపయోగపడేదేమీ వుండదు.
చివరగా: రెండేళ్ళు కేంద్రంతో ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, రాజధాని కోసం, రైల్వే జోన్ కోసం పోరాడుతూనే వున్నామని సుజనా చౌదరి చెబుతున్నారు. షేమ్ ఆన్ యూ.. కనీసం రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు.