నారాయ‌ణ‌ది కిడ్నాప్ కాదు, అరెస్టే!

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పి.నారాయ‌ణ అరెస్టుపై చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. నారాయ‌ణ భార్య‌ను అరెస్టు చేయ‌లేద‌ని ప్ర‌క‌టించిన ఎస్పీ, ప‌క్కా ఆధారాలు ఉన్నందు వ‌ల్ల‌నే నారాయ‌ణ‌ను అరెస్టు చేసిన‌ట్టుగా…

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పి.నారాయ‌ణ అరెస్టుపై చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. నారాయ‌ణ భార్య‌ను అరెస్టు చేయ‌లేద‌ని ప్ర‌క‌టించిన ఎస్పీ, ప‌క్కా ఆధారాలు ఉన్నందు వ‌ల్ల‌నే నారాయ‌ణ‌ను అరెస్టు చేసిన‌ట్టుగా తెలిపారు. హైద‌రాబాద్ లో నారాయ‌ణ అరెస్టును ధ్రువీక‌రిస్తూ ఎస్పీ మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

నారాయ‌ణ‌ను కిడ్నాప్ చేసిన‌ట్టుగా ఆయన అనుచ‌రులు హైద‌రాబాద్ లో తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని వార్త‌లు కూడా వ‌స్తున్న నేప‌థ్యంలో చిత్తూరు ఎస్పీ స్పంద‌న ఆస‌క్తిదాయ‌కంగా మారింది. 

త‌మ స్కూళ్ల‌లో అడ్మిషన్ల‌ను పెంచుకునేందుకు ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీ కుట్ర జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. పేప‌ర్ లీకేజ్ చైన్ లింకులో ఇప్ప‌టికే అరెస్టు అయిన టీచ‌ర్ల‌తో మొద‌లుకుని, స‌ద‌రు విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ నారాయ‌ణ వ‌ర‌కూ లింకులున్నాయ‌ని ఎస్పీ తెలిపారు. 

త‌మ విద్యార్థులు ఎక్క‌డ ప‌రీక్ష‌లు రాస్తారో తెలుసుకుని… ఈ పేప‌ర్ లీకేజ్ ద్వారా హెడ్ ఆఫీస్ లో కీ ని ప్రిపేర్ చేసి, విద్యార్థులు ప‌రీక్ష‌లు రాసే చోట‌కు స‌మాధానాల‌ను పంపుతార‌ని ఈ మాల్ ప్రాక్టీస్ గురించి ఎస్పీ వివ‌రించారు.

ఈ కేసులో ఇప్ప‌టికే అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ప్ర‌కారం.. సాంకేతిక‌మైన ఆధారాల ప్ర‌కార‌మే నారాయ‌ణ అరెస్టు జ‌రిగింద‌ని, ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్టుగా ఎస్పీ ప్ర‌క‌టించారు.