Advertisement

Advertisement


Home > Politics - Opinion

లీకు భాగోతం: షాక్ కి గురి చేసే సరికొత్త విషయాలు

లీకు భాగోతం: షాక్ కి గురి చేసే సరికొత్త విషయాలు

భారతదేశంలో విద్య వ్యాపారం కాదు. అది సేవ మాత్రమే. మరి బహిరంగంగానే ఫీజులు దండుకుంటున్నారు కదా అంటే, ట్యూషన్ ఫీజ్ వరకు తీసుకోవచ్చు..అది గురుదక్షిణతో సమానం. తక్కినదంతా బిల్డింగ్ డొనేషన్ మొదలైన వాటి రూపంలో తీసుకుంటాయి విద్యాసంస్థలు. 

అందులో కూడా నలుపు, తెలుపు లెక్కలేసి నల్లధనాన్ని గోనెసంచుల్లో మూటకట్టే విద్యావ్యాపార సంస్థలు ఎన్నో తమ జెండా ఎగరేసాయి ఆంధ్రలో. ఇంతా చేసి వీళ్లేమైనా విద్యార్థుల్ని మణిపూసలుగా తీర్చిదిద్దుతున్నారా అంటే ఏమీ కాదు. ఒక ప్రచారం మాత్రం ఊపిరి సలపనీయకుండా విద్యార్థుల్ని యంత్రాల్ని తోమినట్టుగా మాక్ టెస్టులు పెట్టి తోమేస్తారని. కానీ అసలు విషయం ఇప్పుడు బోధపడుతోంది బయటి ప్రజానీకానికి. 

తానేమి రాసాడో తెలియని విద్యార్థికి కూడా కళ్లు తిరిగే మార్కులొచ్చేస్తాయి. అదంతా తన ప్రతిభ కాదని ఎలాగూ బయటికి చెప్పడు. ఏ దేవుడి కరుణవల్లనో ఊహించని మార్కులొచ్చాయని గుడికెళ్లి కొబ్బరికాయలు కొట్టుకుంటాడు పాపం సదరు విద్యార్థి. 

కానీ జరిగేదేంటంటే, ఇన్విజిలేటర్స్ దగ్గర్నుంచి, పేపర్లు దిద్దే బ్యాచ్ నుంచి, మార్కుల్ని మెటా డేటాలో ఎంటర్ చేసే వ్యక్తుల వరకు..అందర్నీ కొనేయడమే చేస్తున్నాయి ఆ విద్యాసంస్థలు. తమ విద్యార్థులకి 100% ఉత్తీర్ణతతో పాటూ రాష్ట్రస్థాయి ర్యాంకులు కూడా వచ్చేస్తే దాంతో మిగిలిన సంస్థలన్నీ చచ్చిపోతాయి, భావి తరాలన్నీ తమ వద్దకే వచ్చి లక్షలు సమర్పించుకుని "విద్యాందేహి" అని అడుక్కుంటాయి అని...ఇదే అలోచన...అదే ఆచరణ. 

లక్షల మంది విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లిస్తే ఎన్ని వేల కోట్లవుతుందో లెక్క తేలడం కష్టం. అందులో ప్రతి ఏడూ గట్టిగా రూ 200 కోట్లు కాదనుకుంటే అనుకున్న పని ఎందుకు జరగదు? పైనుంచి కింద దాకా అందర్నీ కొనేయొచ్చు కదా! 

విద్యార్థుల తల్లిదండ్రులు పాపం అందరికంటే అమాయకులు. తమ పిల్లలకి మంచి మార్కులు, ర్యాంకులు వస్తే వాళ్లు ప్రయోజకులైపోయినట్టే అని అనుకుంటారు. కానీ వెనుక జరిగే తతంగమిది. 

ఎక్కడో కొందరు విద్యార్థులు తప్ప ఈ సంస్థల్లో చదివి పాసైన అధికశాతం మందికి తమకొచ్చినవన్నీ బూటకపు మార్కులే..డబ్బులతో కునుక్కున్నవే. ఆ విషయం వాళ్లకి కూడా తెలియదు. అంతా తావీజు మహిమ అనుకుని మనసులోనే పెట్టుకుంటారు. 

ఇలా విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన ఒకానొక వ్యక్తికి చంద్రబాబు ఏకంగా మంత్రి పదవిచ్చి పోషించాడు. విద్యా మంత్రిత్వ శాఖ మాత్రం కాదు...జనానికి అనుమానం రాకుండా మునిసిపల్ శాఖ కేటాయించి, తన వియ్యంకుడుకి మాత్రం విద్యాశాఖనిచ్చి వ్యవహారం కుటుంబ పరిధిలోనే ఉండేట్టు చూసాడు బాబుగారు. 

ఏది ఏమైనా ఒక్క వ్యవస్థను కాదు... సర్వ వ్యవస్థలకు అవస్థలు పెట్టించిన ఘనత చంద్రబాబుదే. 

ఇప్పుడు వీళ్లందరి బండారం బయటపెట్టి బడితపూజ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. ఇది కచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామమే. ఒకవేళ ఇదంతా కక్ష సాధింపని తెదేపా వాళ్లు అరుస్తున్నా జరుగుతున్నది మాత్రం లోకకళ్యాణమే. 

ఇదంతా చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విద్యాసంస్కరణలు సాధారణమైనవి కావనిపిస్తుంది. 

ప్రభుత్వ పరిధినుంచి విద్యని బయటకి పోనీయకుండా ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్ధరించి అద్భుతమైన విద్యనందించడానికి మార్గాలు వేసాడు. బాగా వైరల్ అయిన బెండపూడి ప్రభుత్వపాఠశాల ఒక ఉదాహరణ. ఆ బడి స్ఫూర్తితో ఇప్పుడు యావత్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎల్.ఐ.పి (లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) ప్రవేశపెట్టే ప్రణాలికలు వేస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని, భావప్రకటనాశక్తిని, ఇంగ్లీష్ ఉచ్చారణని అమెరికన్ పాఠశాలలకు తీసిపోని విధంగా ఈ ప్రోగ్రాం ఉందని కళ్ల ముందు సాక్ష్యమే కనిపిస్తోంది. 

ఇలా విద్యార్థుల్ని భావితరానికి మాణిక్యాలుగా మలిచి అందించాలి గానీ కొనుక్కున్న మార్కుల్ని చూపించుకుని పళ్లికిలించే విద్యార్థుల్ని కాదు కదా!

కొన్ని సంవత్సరాలుగా ఆంధప్రదేశ్ లోని విద్యావ్యవథకు సర్వభ్రష్టత్వం కలుగజేసి, వేలాది కోట్లు కూడ బెట్టిన వారి ఆటలు ఇక సాగకుండా చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. చెప్పుకున్నాంకదా...ఒకవేళ ఇదంతా కక్ష సాధింపే అనుకున్నా జరుగుతున్నది మాత్రం లోకకళ్యాణమే. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?