జూ. ఎన్టీఆర్‌.. తిన్నది సినీ దెబ్బలేనా.?

మామూలుగా అయితే సినీ పరిశ్రమలో ఎవరూ 'ఫ్లాపుల్ని' ఒప్పుకోరు. ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. 'అంచనాల్ని అందుకోలేకపోయాం..' అనే మాటనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఫ్లాపులొచ్చాయి.. అనడానికి బదులు. కానీ, ఏకంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కెరీర్‌లో…

మామూలుగా అయితే సినీ పరిశ్రమలో ఎవరూ 'ఫ్లాపుల్ని' ఒప్పుకోరు. ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. 'అంచనాల్ని అందుకోలేకపోయాం..' అనే మాటనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఫ్లాపులొచ్చాయి.. అనడానికి బదులు. కానీ, ఏకంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కెరీర్‌లో తగిలిన దెబ్బలతోనే తాను చాలా మారానని చెబుతున్నాడు. నిజానికి, 'ఆంధ్రావాలా' సినిమా డిజాస్టర్‌ అయినా, దాన్ని ఫ్లాప్‌గా ఒప్పుకోలేదు ఎన్టీఆర్‌ ఒకప్పుడు. 'నా అల్లుడు' లాంటి సినిమాలొచ్చినా ఎన్టీఆర్‌ మారలేదు. 

కానీ, ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మాటల్లో మార్పు చాలా స్పష్టంగా కన్పిస్తోంది. దెబ్బలు తగిలాయి.. మారాను.. అంటున్నాడు. అయితే అందులో అర్థం చాలానే వుంది. నిజానికి ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్‌ చవిచూసిన ఫ్లాపులు తక్కువే. కొన్ని సినిమాలు అంచనాల్ని అందుకోలేకపోయాయి.. కొన్ని యావరేజ్‌, కొన్ని ఎబౌ యావరేజ్‌.. కొన్ని ఓ మోస్తరు హిట్స్‌. మరిప్పుడు, ఆ పాత 'దెబ్బల గురించి' జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎందుకు మాట్లాడుతున్నట్లు.? 

ఇదిలా వుంటే, ఎన్టీఆర్‌ చెప్పింది సినిమా దెబ్బల గురించి కాదు, 'పొలిటికల్‌ దెబ్బల గురించి' అనే వాదన సినీ, రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా జూనియర్‌ ఎన్టీఆర్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు వాడుకుని వదిలేశారన్నది నిర్వివాదాంశం. లోకేష్‌, పార్టీలో యాక్టివ్‌ అయ్యాక.. పార్టీ శ్రేణులంతా లోకేష్‌ భజన షురూ చేశాక, ఎన్టీఆర్‌ని చంద్రబాబు పక్కన పడేశారు. బాలయ్యకు ఎమ్మెల్యే పదవి ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు ఇంకా స్పష్టంగా కన్పిస్తోంది. 

'వాడుకుని వదిలేసే' చంద్రబాబు నైజాన్ని కాస్త లేటుగా అర్థం చేసుకున్న ఎన్టీఆర్‌, రాజకీయాల పట్ల చాలా అప్రమత్తంగా వుంటున్నాడు. టీడీపీకి దూరంగా వున్నానని మాత్రం చెప్పడంలేదు. కానీ, టీడీపీ – ఎన్టీఆర్‌ని ఎంత దూరం పెడుతోందో, 'జనతా గ్యారేజ్‌' ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్‌ ఏ సినిమా చేసినా 'అది ఫ్లాప్‌' అని ముద్ర వేసేసింది టీడీపీ అనుకూల అభిమానులు మాత్రమే. ఎస్‌ఎంఎస్‌లు, సోషల్‌ మీడియాలో పోస్టింగులతో నందమూరి సినీ అభిమానుల్ని, జూనియర్‌ ఎన్టీఆర్‌కి దూరం చేసే 'పచ్చ' ప్రయత్నాలు నిస్సిగ్గుగా జరిగాయి. సో, సినిమా కోసం ఎన్టీఆర్‌కి టీడీపీ మద్దతు కూడా కావాల్సిందే ఎన్టీఆర్‌కి. అందుకే టీడీపీతో సంబంధాలపై ఎన్టీఆర్‌ ఆచి తూచి స్పందిస్తున్నాడు. అదీ ఎన్టీఆర్‌లో వచ్చిన అసలు సిసలు మార్పు.