ఎమ్బీయస్‌ : YM: దేశాధిపతి పర్యటన- 3/1

ఆఫీసులో చేరి మూడు వారాలయ్యేసరికి పని ఒత్తిడికి జిమ్‌కు కళ్లు తేలేసే పరిస్థితి వచ్చింది. అధికార్లు అతనికి పెట్టెల పెట్టెల కాగితాలు హోమ్‌వర్క్‌కై యిస్తున్నారు. అవి చదివి మతి పోగొట్టుకుని ఆఫీసుకి వస్తే అక్కడ…

ఆఫీసులో చేరి మూడు వారాలయ్యేసరికి పని ఒత్తిడికి జిమ్‌కు కళ్లు తేలేసే పరిస్థితి వచ్చింది. అధికార్లు అతనికి పెట్టెల పెట్టెల కాగితాలు హోమ్‌వర్క్‌కై యిస్తున్నారు. అవి చదివి మతి పోగొట్టుకుని ఆఫీసుకి వస్తే అక్కడ 'ఇన్‌' ట్రేలో గుట్టగుట్టలుగా కాగితాలు. గుంపులుగుంపులుగా తనను చూడడానికి వచ్చే సందర్శకులు, డెలిగేషన్లు, పాల్గొనవలసిన కమిటీ సమావేశాలు, యివన్నీ చాలనట్లు మధ్యమధ్యలో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కి వెళ్లి ఓటు వేసి రావడాలు…! అన్నిటికన్నా ముఖ్యంగా కరస్పాండెన్స్‌ సంగతి ఏం చేయాలో తోచటం లేదు. బెర్నార్డ్‌ని అడిగాడు -''ఇదంతా ఎప్పుడు చూడాలయ్యా బాబూ'' అని.  

''మీరు నిజంగా అవన్నీ చూడక్కరలేదని మీకు తెలుసనుకుంటా'' అన్నాడు. జిమ్‌ కనుబొమలు ఎగరేయడం చూసి వివరించాడు – ''మీరు కావాలనుకుంటే ఆ అఫీషియల్‌ రిప్లయి ఏదో మేమే పంపేస్తాం.''

''..అంటే?''

''..అంటే మీ ఉత్తరానికి ధన్యవాదాలు తెలియచేయమని మంత్రి మమ్మల్ని కోరారు – అని ప్రారంభించి మీరు ప్రస్తావించిన అంశం పరిశీలనలో వుంది అంటాం. పోనీలే పాపం అనిపిస్తే 'చురుగ్గా పరిశీలిస్తున్నాం' అంటాం.''

''తేడా ఏమిటో!?''

''పరిశీలనలో వుంది అంటే దానర్థం ఫైలు పోయింది అని. చురుకైన పరిశీలనలో వుంది అంటే దాని కోసం వెతుకుతున్నాం అని. నా సలహా ఏమిటంటే మీరు రోజూ ఉదయమే ఇన్‌ ట్రేలో వున్న కాగితాలన్నీ తీసి ఔట్‌ ట్రేలో పడేయండి. ఏదైనా అభ్యర్థనకు మా సమాధానం ఎలా వుందో తెలుసుకోవాలని కుతూహలంగా వుంటే మార్జిన్‌లో చిన్న నోట్‌ రాయండి. సమాధానం మీకు చూపిస్తాం.''

అతని మాటల్లో 'నువ్వు వున్నా లేకపోయినా ఒక్కటే' అనే సందేశం ధ్వనించింది జిమ్‌కు. ''మరి నేను యిక్కడ వున్నదెందుకు?'' అన్నాడు కాస్త చికాగ్గా.

''విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి!''

''ఎన్నాళ్లకోసారి ఆ అవసరం పడుతుంది?''

''అప్పుడప్పుడు పడుతుంది.'' అన్నాడు కానీ ఎంత తరచుగా పడుతుందో చెప్పలేదు. 

జిమ్‌కు అలాటి అవసరం యింకో రెండు మూడు రోజుల్లోనే పడింది.

*********
బ్యురాండా అనే చిన్న ఆఫ్రికన్‌ దేశాధ్యక్షుడు ఇంగ్లండు పర్యటనకు రాబోతున్నాడు. అది ఒకప్పుడు బ్రిటన్‌కు వలసదేశంగా వుండింది.  కొన్నేళ్ల క్రితమే స్వాతంత్య్రం పొందింది. ఆ దేశంలో పెట్రోలు నిక్షేపాలు వున్న సంగతి యీ మధ్యే తెలిసింది. వచ్చే రెండేళ్లలో పెట్రోలు వెలికితీత ప్రారంభమవుతుంది. పెట్రోలుపై కన్నేసిన బ్రిటన్‌ యిప్పణ్నుంచి ఆ దేశంతో స్నేహం చేసుకుని, వ్యాపారవాణిజ్యబంధాలు ఏర్పరచుకోవాలనుకుని, ఆ దేశాధ్యక్షుణ్ని ఆహ్వానించింది. అదే సమయంలో కాస్త ఋణసహాయం చేస్తాం, మా దగ్గర ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ రిగ్గులు కొనుక్కోండి అని అమ్మచూపుతోంది.  

ఇవన్నీ చెప్పి చర్చల్లో, ఆంతరంగిక సంభాషణల్లో అలాటి దేశాలను ప్రస్తావించేేటప్పుడు ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో హంఫ్రీ జిమ్‌కు చెప్పాడు. ''అలాటి దేశాలను ఒకప్పుడు అండర్‌ డెవలప్‌డ్‌ (అభివృద్ధి చెందని) దేశాలని అనేవాళ్లం. అయితే వారికి అభ్యంతరకరంగా తోచింది. అందువలన వాటిని డెవలపింగ్‌ (అభివృద్ధి చెందుతున్న) దేశాలని అనసాగాం. కానీ అదేదో ఉద్ధరింపుగా మాట్లాడుతున్నట్లు తోచింది వారికి. అందువలన యిప్పుడు లెస్‌ డెవలప్‌డ్‌ (తక్కువగా అభివృద్ధి చెందిన) కంట్రీస్‌ – ఎల్‌డిసి – అంటున్నాం. ప్రస్తుతానికి దీనికి అభ్యంతరం తెలపటం లేదు. తెలిపిన రోజు మనం వాటిని ఎచ్‌ఆర్‌ఆర్‌సి – హ్యూమన్‌ రిసోర్సెస్‌-రిచ్‌ కంట్రీస్‌ – మానవవనరులు పుష్కలంగా కల దేశాలు – అని పిలుస్తాం. అంటే జనాభా ఎక్కువ, డబ్బు తక్కువ అన్నమాట.''

ఇంతకీ కార్యక్రమం ఏమిటి అని అడిగితే తెలిసినదిది – దేశాధ్యక్షుడు వచ్చినపుడు బ్రిటన్‌ రాణి ఆయన్ను రిసీవ్‌ చేసుకోవాలి. అయితే ఆవిడ తన కుటుంబంతో వేసవి విడిదికి వెళ్లింది. అది లండన్‌కు ఉత్తరాన స్కాట్లండ్‌లో వున్న బాల్మోరల్‌లో వుంది. ఇప్పుడు యీయన కోసం ఆవిడ మళ్లీ లండన్‌ రావాలి. ఇదీ విదేశాంగ శాఖ నిర్ణయించిన కార్యక్రమం. ఇది వినగానే జిమ్‌కు ఒక ఆలోచన వచ్చింది. ప్రస్తుతం స్కాట్లండ్‌లో మూడు ఉపయెన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో నెగ్గిన అభ్యర్థి తన వంటి అవినీతిపరుణ్ని ప్రజలు మళ్లీ ఎలా ఎన్నుకున్నారా అన్న ఆశ్చర్యంతో గుండాగి చచ్చిపోయాడు. అలా ఏర్పడిన ఖాళీలో జరుగుతున్న ఉపయెన్నికతో బాటు, మరో రెండు చోట్ల కూడా జరుగుతోంది. అక్కడ అధికార పార్టీ కచ్చితంగా నెగ్గుతుందన్న పరిస్థితి కనబడటం లేదు. అసలే స్కాట్లండ్‌ వాళ్లకు ఇంగ్లండు వారిపై కోపం. తమను పట్టించుకోవటం లేదని, జాత్యంహకారంతో అణగదొక్కుతున్నారని ఫిర్యాదు. అందువలన యీ సమావేశం అక్కడ ఏర్పరచి వాళ్లను బుజ్జగించి తద్వారా ఉపయెన్నికలు గెలవవచ్చని జిమ్‌ ఊహ. 

అందువలన ''ఈ సమావేశాన్ని లండన్‌లో కాకుండా స్కాట్లండ్‌లోని ఎడింబరాలో వున్న హోలీరూడ్‌ ప్యాలెస్‌లో నిర్వహిద్దాం. అలా అయితే రాణిగారికి యింతదూరం వచ్చి వెళ్లే శ్రమ తప్పుతుంది. పైగా ఆవిడ బ్రిటన్‌కే కాదు స్కాట్లండ్‌కు కూడా రాణి. అక్కడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి.'' అన్నాడు.

జిమ్‌ ఊహలు చదివేసిన హంఫ్రీ ''దేశాధ్యక్షుల పర్యటనలను రాజకీయ ప్రయోజనాలకై వాడుకోలేము'' అని నీతిబోధ చేశాడు. ''విదేశీ ప్రముఖుణ్ని స్కాట్లండ్‌ వంటి మూలప్రదేశానికి వెళ్లమని ఒత్తిడి చేయలేం.'' అని కొత్త ఎత్తు ఎత్తాడు.

అప్పుడు జిమ్‌ కొత్త వాదన తెచ్చాడు. ''మనం అమ్మచూపే ఆయిల్‌ డ్రిల్లింగ్‌ మెషిన్లు వున్నది స్కాట్లండ్‌ సముద్రతీరంలోని అబర్డీన్‌లో! లండన్‌లో కాదు. అవి కొనేముందు వాటి పనితీరు చూడడానికి దేశాధ్యక్షుడు లండన్‌లో కూర్చుంటే ఎలా?'' అని. 

హంఫ్రీ సణుక్కున్నాడు, గొణుక్కున్నాడు. చివరకు దీనిపై ఇంటర్‌డిపార్టుమెంటల్‌ కమిటీ వేస్తానన్నాడు.

అతను వెళ్లిపోయాక జిమ్‌ బెర్నార్డ్‌తో ''ఎవరైనా అధికారి తన కిష్టం లేని పనిచేయవలసి వచ్చినపుడు, అభ్యంతరం చెప్పడానికి పాయింటు ఏదీ దొరకనప్పుడు, ఆ పని జరక్కుండా చేయడానికి ఇంటర్‌డిపార్టుమెంటల్‌ కమిటీ వేస్తారు.'' అన్నాడు.

బెర్నార్డ్‌ తల వూపాడు ''రాజకీయనాయకులు కమిషన్లు వేసినట్లే..'' అన్నాడు.

''ఇంతకీ యీ హంఫ్రీకి అభ్యంతరం ఏమిటయ్యా, పని తగ్గిందని సంతోషించవచ్చు కదా! స్కాట్లండ్‌లో జరిగితే యీయన సొమ్మేం పోయిందిట?'' 

''లండన్‌లో జరిగితే ఈయన ప్రముఖంగా వెలుగుతాడు. ఈయన చేతుల మీదుగా జరుగుతుంది. అందరిలో గుర్తింపు వస్తుంది. స్కాట్లండ్‌లో జరిగితే అది రాజధాని కాదు కాబట్టి యింత హంగామా వుండదు, యిన్ని డిన్నర్లు వుండవు. పైగా అది స్కాట్లండ్‌ పర్మనెంట్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈయన పనిలో గుంపులో గోవిందాగా వుంటుంది.'' వివరించాడు బెర్నార్డ్‌.

''ఈ హంగామా గురించి హంఫ్రీకి యింత వెర్రేమిటి?''

''ఆయన బిరుదుల గురించి చూస్తున్నాడు. ఇప్పటికే నైట్‌హుడ్‌ వచ్చింది, ఆ పైన వుండే నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ బాత్‌ పురస్కారం వచ్చింది. అది సరిపోవటం లేదు. జిసిబి అంటే 'నైట్‌ గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ద బాత్‌' పురస్కారాల జాబితా ఆయన పేరు కూడా వుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ పర్యటన కార్యక్రమంలో ఒక వెలుగు వెలిగితే జాబితాలో పేరుంటుంది, లేకపోతే వేరేవాళ్లు తన్నుకుపోతారు.''

జిమ్‌ హంఫ్రీని తలచుకుని పాపం అని నిట్టూర్చాడు. ఎందుకంటే 'నువ్వు ఏ కమిటీ వేసినా స్కాట్లండ్‌లోనే సమావేశం జరుగుతుంది. ఇది నా విధాన పరమైన నిర్ణయం. ఇలాటివి తీసుకోవడానికే నేనున్నాను' అని అతనికి అప్పటికే స్పష్టం చేసి వున్నాడు. 

***********

ఇది జరిగిన వారానికి బ్యురాండా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆర్మీ చీఫ్‌గా వున్న కల్నల్‌ సెలీమ్‌ మొహమ్మద్‌ అధ్యక్షుణ్ని దింపేసి తనే ఆ పదవి చేపట్టాడు. ఆ వార్త వినగానే హంఫ్రీకి పట్టరాని ఆనందం కలిగింది. కానీ జిమ్‌ ''కొత్త అధ్యక్షుణ్ని కూడా ఆహ్వానిద్దామని అనుకుంటున్నాం'' అనగానే అతని మొహం మాడిపోయింది. ఇక అడ్డగోలు వాదనలు చేయడం మొదలెట్టాడు. ''అలా ఎలా పిలుస్తాం? అతని ప్రభుత్వాన్ని మనం యింకా గుర్తించనేలేదు. ఒకవేళ ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేసినా అతనెటువంటివాడో, సవ్యంగా పెరిగాడో లేడో, గుణగణాలెలాటివో తెలియకుండా మన రాణిగార్ని ఎలా కలవనిస్తాం? కమ్యూనిస్టేమో? ఈడీ అమీన్‌ లాటివాడేమో? రాణిగారితో ఎలా వ్యవహరించాలో ఆ మర్యాదా మప్పితం తెలియనివాడైతే రాణికి ఎంత యిబ్బంది?''

ఇతనిలా అంటూండగానే టీవీలో వార్త వచ్చింది – కొత్త అధ్యక్షుడు ఇంగ్లండ్‌ పర్యటించడానికి నిశ్చయించుకుంటూ ప్రకటన చేశాడని.  ఇక హంఫ్రీ ఏమీ చేయలేకపోయాడు. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016) 

[email protected]

Click Here For Archives