మే 10వ తేదీ భారతదేశ చరిత్రనే మార్చేసింది. సరిగ్గా 165 ఏళ్ల క్రితం 1857లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. అప్పటి వరకూ మనల్ని పాలించిన ఈస్టిండియా కంపెనీ రద్దై (1874) రాణి పాలనలోకి వెళ్లాం. దీని వల్ల ఆర్థికంగా, సామాజికంగా జరిగిన మేలు ఏమీ లేదు కానీ, మనది ఒక దేశమని, భారతీయులమనే భావన బలపడింది. ఫలితంగా రెండో స్వాతంత్ర పోరాటం జరిగింది. తిరుగుబాటుకి ముందు ఇండియా అంటే అనేక సంస్థానాలు, రాజ్యాలు మాత్రమే.
భారతీయులు మత విశ్వాసాలని చాలా సీరియస్‌గా తీసుకుంటారని బ్రిటీష్ వాళ్లకి తెలిసినా ఒక తప్పు చేశారు. కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్, కాలబర్ రైఫిళ్లలో తూటాలకి ఆవు కొవ్వు, పందికొవ్వు పూశారు. ఇది నిజం కాదని బ్రిటీషర్లు చెప్పినా సైనికులు నమ్మలేదు. తూటాల క్యాప్‌లను నోటితో వలిచి, రైఫిళ్లలో నింపాలి. సైన్యంలో ఉన్నది హిందువులు, ముస్లింలే. అందుకని నిరాకరించారు.
అయితే దీనికి ముందు మార్చి నెలలో మంగళ్‌పాండే అనే సైనికుడు బ్రిటీష్ అధికారిపై తిరుగుబాటు చేస్తే ఏప్రిల్ 7న ఉరి తీశారు. ఇది సైనికుల ఆగ్రహానికి కారణం. మే 31న తిరుగుబాటుకి ముహూర్తం పెట్టారు. అయితే అనుకోకుండా మే 8వ తేదీ ఎన్ఫీల్డ్ తుపాకుల్ని సైనికులకి ఇచ్చారు. వాటి తూటాలు తీసుకోడానికి కొందరు నిరాకరిస్తే బ్రిటీష్ అధికారులు తీవ్రంగా శిక్షించారు. ఇక ఆలస్యం చేస్తే ప్రమాదమని మీరట్‌లోని అధికారుల్ని మే 10న చంపి, మే 11న ఢిల్లీ చేరుకున్నారు.
ఇష్టం లేకపోయినా 80 ఏళ్ల బహుదూర్షా, ఒత్తిడిని తట్టుకోలేక దేశ చక్రవర్తిగా వుండడానికి ఒప్పుకుని తన పేరిట నాణాలు విడుదల చేశారు. తర్వాత బ్రిటీష్ సైన్యం తిరుగుబాటుని అణచివేసింది. అటుఇటు కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు. ఇరువైపుల వారు సాగించిన దుర్మార్గాలకు లెక్కలేదు. ఢిల్లీని మళ్లీ వశం చేసుకున్నప్పుడు ఎంతో మంది అమాయకుల్ని ఫిరంగులకి కట్టి బ్రిటీష్ వాళ్లు చంపేశారు.
200 మంది యూరోపియన్లను తిరుగుబాటుదారులు బీబీఘర్‌లో నరికి చంపారు. కాన్పూర్ సమీపంలో నరమేధం జరిగింది. తప్పించుకున్న బ్రిటీషర్ “ది స్టోరీ ఆఫ్ కాన్ఫూర్” అని పుస్తకం రాశాడు.
కేవలం కొవ్వు తూటాలే తిరుగుబాటుకు కారణమా అంటే కాదు. శతాబ్దాలుగా అణచివేత, అవమానం, వ్యవసాయం, చేతివృత్తులు దెబ్బతినడం. సంస్థానాలన్నింటిని కలుపుకుని రాజులని భిక్షగాళ్లని చేయడం ఇలా ఎన్నో వున్నాయి. 31 డిసెంబర్ 1600లో మొదలైన ఈస్టిండియా కంపెనీ చైనాకి పత్తి, టీ అమ్మడానికి మొగల్ చక్రవర్తుల ముందు మోకరిల్లింది. తర్వాత మన దేశాన్నే అమ్మేసింది.
ఈస్టిండియా కంపెనీ మీద డాల్రింపుల్ ఈ మధ్య ఒక పుస్తకం రాశాడు. దాని పేరు ANARCHY. ఆయన ఏమంటాడంటే భారతదేశ ఆర్థిక శక్తి ప్రపంచంలోనే 23 శాతం (1700 నాటికి). అందుకే అందరి కన్ను దీని మీద పడింది.
వ్యాపారుల కోసమే ప్రభుత్వాలు, ప్రభుత్వాన్ని నడిపే వ్యాపారులు. ఇది గతమే కాదు, వర్తమానం కూడా!
జీఆర్ మహర్షి