మాజీ మంత్రి నారాయణను ఏపీ సర్కార్ వదలనంటోంది. టెన్త్ ప్రశ్నపత్రాల లీకుల వ్యవహారంపై ఏపీ సర్కార్ ఒక్కసారిగా పిడుగుపాటు చర్యకు దిగింది. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రి నారాయణ ఏ ఒక్కరోజు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. తనను ప్రభుత్వం పట్టించుకోదని ఆయన భావించి వుంటారు. అయితే ప్రభుత్వ ఆలోచన ఏంటో ఇవాళ్టి చర్యలతో బయట పడింది.
పక్కా ప్రణాళికతో హైదరాబాద్‌లో ఉన్న నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలించడం టీడీపీని షాక్‌కు గురి చేసింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే నారాయణతో పాటు చంద్రబాబు, లింగమనేని రమేశ్‌లపై ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది.
అమరావతి ల్యాండ్ ఫూలింగ్ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కేసులో భారీ అవినీతికి టీడీపీ తెరలేపిందని విమర్శలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీనిపై జగన్ ప్రభుత్వం విచారణకు సిద్ధపడ్డ వ్యవస్థల పుణ్యమా అని చట్టం చేతులు కట్టేసింది.
ఈ నేపథ్యంలో 2014-19 మధ్య అమరావతిలో చేపట్టిన భూసేకరణలో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదైంది. దీనిపై ఏపీ సీఐడీ సోమవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం మరుసటి రోజు వెలుగు చూసింది.
ఒకేరోజు నారాయణపై రెండు కేసుల అంశం తెరపైకి రావడం విశేషం. ప్రధానంగా మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చారని మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్‌లపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ కేసులు ఎంత వరకూ నిలబడతాయో న్యాయస్థానంలో తేలాల్సి వుంది.
ఇంత వరకూ అమరావతి విషయంలో ఏ ఒక్కటీ ఏపీ ప్రభుత్వానికి అనుకూల తీర్పులు రాని సంగతి తెలిసిందే.