చెడపకురా చెడదువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే క్రమంలో టీడీపీ అత్యుత్సాహం చివరికి ఆ పార్టీకే చుట్టుకుంది. టీడీపీ సీనియర్ నేత, విద్యాసంస్థల అధిపతి నారాయణను అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై కుట్రలు చేసే క్రమంలో చివరికి మాజీ మంత్రి అడ్డంగా బుక్కయ్యారు.
టెన్త్ ప్రశ్నపత్రాల వరుస లీకేజీ అవుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు అనుమానం వచ్చింది. ఒక చోటంటే పొరపాటైందని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయం కోసం అదే పనిగా విద్యార్థుల జీవితాలతో టీడీపీ చెలగాటం చివరికి ఆ పార్టీని దోషిగా నిలబెట్టింది.
నారాయణ అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు చేసిన ప్రయత్నం …వాళ్లకే బెడిసి కొట్టిందన్నారు. పది పరీక్షల్లో అక్రమాలపై ఎప్పుడూ జరగని విషయం అన్నట్లు చంద్రబాబు మాట్లాడారన్నారు. కానీ, ఇవాళ దీనికి ప్రధాన కారణమైన వాళ్ల పార్టీ నాయకుడు నారాయణనే అరెస్ట్ అయ్యారన్నారు.
నారాయణ సంస్థ ప్రమేయంతో లీక్ వ్యవహారం ప్రారంభం అయ్యిందన్నారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు.
రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి వ్యవహారం బద్దలైందని చెప్పుకొచ్చారు. మాస్ కాపీయింగ్, పేపర్లు లీక్ కు స్పెషలిస్టులుగా మారిపోయారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రశ్న పత్రాల లీకుల వ్యవహారం వెనుక ఉన్న తీగలాగితే టీడీపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. కుట్రలో భాగస్వాములైన వారంతా దొరికిపోయారన్నారు.
ఇలాంటి వ్యక్తినా? చంద్రబాబు మంత్రిగా పెట్టుకుందని ప్రశ్నించారు. తాను తీసిన గోతిలో తానే పడాల్సి వచ్చిందని, ఇదే విధి రాతని నారాయణపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.