కొత్త మంత్రుల పదవీకాలం రెండేళ్లా? ముందే ముగుస్తుందా?

ఏపీలో కొత్తగా మంత్రి పదవులు (రెండోసారి పదవులు పొందిన సీనియర్లను లెక్కలోకి తీసుకోవద్దు ) పొందినవారి పదవీకాలం వాస్తవానికి రెండేళ్ళు. పార్టీ అధికారంలోకి రాగానే పదవులు పొందినవారు మూడేళ్ళు పదవులు అనుభవించారు. జగన్ అధికారంలోకి…

ఏపీలో కొత్తగా మంత్రి పదవులు (రెండోసారి పదవులు పొందిన సీనియర్లను లెక్కలోకి తీసుకోవద్దు ) పొందినవారి పదవీకాలం వాస్తవానికి రెండేళ్ళు. పార్టీ అధికారంలోకి రాగానే పదవులు పొందినవారు మూడేళ్ళు పదవులు అనుభవించారు. జగన్ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు రెండున్నరేళ్ళు మాత్రమే ఉంటాయని, ఆ గడువు పూర్తి  కాగానే మొత్తం మంది మంత్రులను మారుస్తానని ముందే చెప్పేశాడు.

తమ పదవులు రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉంటాయని వాళ్ళు ముందే బుర్రలో పెట్టుకున్నారు. ఆ ప్రకారం ఫిక్స్ అయిపోయారు. అయితే వివిధ కారణాలతో రెండున్నరేళ్లకు జరగాల్సిన మంత్రివర్గ ప్రక్షాళన మూడేళ్ళకు పోయింది. జగన్ రరకాల రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు వేసుకొని, కూడికలు, తీసివేతలు చేసుకొని కొంతమంది పాత మంత్రులకు మళ్ళీ అవకాశం ఇచ్చారు.

అంటే వాళ్ళు కంటిన్యూ అయినట్టే లెక్క. వాళ్ళు ఎన్నికల వరకు ఉంటారు.

మొదటి సారి మంత్రి పదవులు పొందినవారు మాత్రం లెక్క ప్రకారం రెండేళ్ళు పదవిలో ఉండాలి. కానీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలు ఈ ప్రచారం చేస్తుండగా అధికార పార్టీ కూడా అలాంటి సంకేతాలు పంపుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రజల్లో తిరుగుతుండగా, ఈ విషయంలో జగన్ కూడా తన పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నాడు.

కొత్త మంత్రులకు రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉండటం, చివరి ఏడాది ఎలాగో ఎన్నికల వాతావరణం ఉండటంతో ఓ అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఏపీలో తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు వారిలో గుబులు మరింత పెంచుతున్నాయి. ఎన్నికల టీమ్ గా పేరు తెచ్చుకున్న ఈ మంత్రులు తక్కువ పదవీకాలంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో వారు వచ్చిందే కట్నం అన్న చందాన రెండేళ్ల పదవీకాలానికి ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికీ కొత్త మంత్రులు తమ శాఖల మీద దృష్టి పెట్టలేదు. కొంత మంది మంత్రులు తమ శాఖల మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. ఎప్పటిమాదిరిగానే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు.

పదవీ కాలం రెండేళ్లే కాబట్టి ఈ కొద్దీ కాలంలో కొత్త మంత్రులు తమ శాఖలకు సంబంధించి ఏం సాధిస్తారో, ప్రజలకు ఏం చెప్పుకుంటారో తెలియదు. ఏం సాధించకపోయినా జగన్ ఇమేజ్ తో విజయం సాధిస్తామన్న ధీమా ఉన్నట్లుంది.

జగన్ కేబినెట్ ప్రక్షాళన తర్వాత ఈ నెల 13న తొలి కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రులతో తొలిసారి భేటీ కాబోతున్న జగన్ ..వారి ప్రాధాన్యతల్ని వివరించబోతున్నారు. అలాగే ఎన్నికల టీమ్ గా వారి బాధ్యతల్ని గుర్తు చేయబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు.

అయితే ఈ కేబినెట్ భేటీకి ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరుగుతోంది. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పొత్తులపై చేస్తున్న హడావిడి, దానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న కౌంటర్లు, ముందస్తు సంకేతాలు ఇప్పుడు కొత్త  మంత్రుల్ని కలవరపెడుతున్నాయి. జగన్ కేబినెట్ లో కొత్తగా చోటు సంపాదించిన మంత్రులు తమకు ఎలాగైనా రెండేళ్ల పదవీకాలం ఉంటుందని ఫిక్స్ అయ్యారు. 

ఈ మేరకు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే వీరికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తాజాగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలు టెన్షన్ రేపుతున్నాయి.

ఏడాది, రెండేళ్లలో ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లలోపే ఎన్నికలు ఖాయమంటూ సజ్జల చెప్పేయడం వారిలో గుబులు రేపుతోంది. అసలే ఆలస్యంగా వచ్చిన పదవులకు ముందస్తు ఎన్నికలు గండంగా మారతాయా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కొత్త మంత్రులు శాఖలపై పట్టు సాధిస్తారో, ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోయడానికి సమయం వినియోగిస్తారో చూడాలి.