తెలంగాణ ప్రభుత్వం 'కోటి' అనగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మూడు కోట్లు' అనేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం 'ఐదు కోట్లు' అనాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో భారత్‌కి రజత పతకాన్ని తీసుకొచ్చిన షట్లర్ సింధుకి పోటీ పడి, తెలుగు రాష్ట్రాలు నజరానా ప్రకటించిన విషయం విదితమే. ఇంతేనా, సన్మానాల విషయంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడ్డాయి. ఓ రకంగా, ఈ పోటీ అభినందనీయమే. అయితే, పోటీ కాస్తా క్రీడాకారుల్ని తయారుచేయడంలో అయితే బావుండేది.!
ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఘనస్వాగతం అందుకుంది సింధు. నిన్న హైద్రాబాద్‌లో ఎలాగైతే తెలంగాణ ప్రభుత్వం సింధుకి ఘన స్వాగతం పలికిందో, అంతకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగత ఏర్పాట్లు చేసింది. అయితే, విజయవాడలో సింధు రాక కోసం చేసిన ఏర్పాట్లలో 'పసుపు రంగు' ఎక్కువగా కన్పించింది. 'సింధు ఆంధ్రప్రదేశ్ బిడ్డ..' అంటూ ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలతో అదరగొట్టేశారు. అయితే, ముందే తెలంగాణ ప్రభుత్వం సింధుని తెలంగాణ బిడ్డగా ఓన్ చేసేసుకుందనుకోండి.. అది వేరే విషయం.
ఆంధ్రనా.? తెలంగాణనా.? అన్న ప్రశ్నకు సింధు కోచ్ గోపీచంద్ సమాధానమిస్తూ, 'సింధు ఇండియన్..' అని తేల్చేశాడు. అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తీరు మారలేదు. 'సింధు తల్లిది మన విజయవాడే.. గోపీచంద్‌ది అచ్చంగా మన ఆంధ్రప్రదేశే..' అంటూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సన్మాన కార్యక్రమంలో వ్యాఖ్యాతగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓ దశలో, బొండా ప్రసంగం 'నాన్సెన్స్' అనిపించేసింది కూడా.
ఇదిలా వుంటే, 'ప్రోటోకాల్‌ని పక్కన పెట్టి, సింధుకి స్వయంగా ఆహ్వానం పలికాను..' అంటూ చంద్రబాబు తెగ అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడితో ఆగితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.? సింధుతో కలిసి సన్మాన వేదికపైనే బ్యాడ్మింటన్ ఆడేశారు. ఎగిరెగిరి చంద్రబాబు ఆడేస్తోంటే అంతా ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఒకసారి, రెండోసారి, మూడోసారి.. ఇలా పలుమార్లు చంద్రబాబు, సింధునీ, గోపీచంద్‌నీ శాలువా కప్పి సత్కరించేయడం మరో విశేషమిక్కడ.
ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం వుంది. సింధు, గోపీచంద్‌లను సన్మానిస్తూ అదే వేదికపై కిదాంబి శ్రీకాంత్, కోనేరు హంపి, మరికొంతమంది క్రీడా రంగ ప్రముఖుల్ని కూడా సత్కరించడం. ఈ విషయంలో మాత్రం చంద్రబాబుకి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
ఎలాగైతేనేం.. ఆంధ్రప్రదేశ్ చేసిన హంగామాకి ఫలితం దక్కింది. మాదీ విజయవాడే.. అన్న అర్థం వచ్చేలా 'మా తాతగారి కోసం ఇక్కడికి వచ్చేదాన్ని.. ఇక్కడే బ్యాడ్మింటన్ ఆడాను చిన్నప్పుడు..' అంటూ సింధు, ఏపీలోని అధికార పార్టీ చేసిన హంగామాకి కాస్త ఊతమిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్న విషయాల్ని పక్కన పెడితే, ఆమె తెలుగు బిడ్డ.. భరతమాత ముద్దుబిడ్డ.. పదే పదే ఆమె స్థానికత విషయంలో ఎవరు హంగామా చేయాలనుకున్నా, అది నాన్సెన్సే అవుతుంది.