పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిందే ఏ రాష్ట్రమైనాసరే. అలాగని, దేబిరిస్తే ఎలా.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌లపై ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి కరెంటు వచ్చేస్తుందన్నారు.. ఇప్పటికీ వచ్చేస్తుంది.. అని చెబుతూనే వున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. గోదావరికి అటు ఓ స్తంభం, ఇటు ఓ స్తంభం పాతితే కరెంటుని లాగేసుకోవచ్చన్నారు. ఏదీ ఎక్కడ.? ఈ ప్రశ్న ఎవరన్నా వేస్తే, వాళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులే.
ఇప్పుడు అసలు టాపిక్ మహారాష్ట్ర గురించి. మహారాష్ట్ర నుంచే గోదావరి నది, తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుంది. గోదావరి మీద ప్రాజెక్టులు కట్టాలంటే, మహారాష్ట్ర సహకారం తప్పనిసరి. ఎగురవ రాష్ట్రం గుస్సా అయితే, తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం కష్టం. ఇదీ కేసీఆర్ లాజిక్. మంచిదే, మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోవడం వరకూ ఎవరూ కాదనలేరు. కానీ, మహారాష్ట్రతో స్నేహం కోసం, ఆంధ్రప్రదేశ్‌ని తూలనాడితే ఎలా.?
ఇప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అడ్డుపడుతోందని కేసీఆర్ వాపోయారు. అంతేనా, పొద్దున్నే తెలంగాణలో పత్రికలు తిరగేసినోళ్ళకి, 'ఆంధ్రోళ్ళు క్రూరులుగా' కన్పించారు. ఆంధ్రోళ్ళని విమర్శించడానికి అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అవసరమా.? అన్నదే ఇక్కడ ప్రశ్న. 'ఆంధ్రప్రదేశ్‌కి అన్ని విధాలా సహకరిస్తాం..' అని అప్పుడప్పుడూ చెప్పే కేసీఆర్, ఇదిగో.. ఇలా ఎందుకు చేస్తున్నారట.!
దీనికీ ఓ సమాధానం వుంది. మహారాష్ట్రతో గతంలో ఆంధ్రప్రదేశ్ పంచాయితీ పెట్టుకుంది. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని మాట. బాబ్లీ ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి టీఆర్ఎస్ మినహా. వాస్తవానికి, బాబ్లీ ప్రాజెక్ట్‌తో నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కాదు, ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతమే. రాజకీయ అవసరాల కోసమే అయినా, టీడీపీ మహారాష్ట్రకి వెళ్ళి మరీ, అక్కడ నానా యాగీ చేసొచ్చింది. అఫ్కోర్స్ బాబ్లీ ప్రాజెక్టు ఆగలేదనుకోండి.. అది వేరే విషయం.
ఆనాటి గొడవల్ని ఎక్కడ మహారాష్ట్ర గుర్తుపెట్టేసుకుని, తమకు సహకరించడం మానేస్తుందోనన్నది కేసీఆర్ భయం. అందుకే, ఆంధ్రప్రదేశ్‌ని తూలనాడారు సమైక్య పాలకుల పేరుతో. 'ఆంధ్రప్రదేశ్ అప్పట్లో పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా వుండలేదు.. మేం అలా కాదు..' అంటూ మహారాష్ట్ర ముఖ్యమత్రి సమక్షంలోనే కేసీఆర్ నోరు పారేసుకున్నారు. కొత్త ప్రాజెక్టులు సరే, బాబ్లీ ప్రాజెక్టు సంగతేంటి.? బాబ్లీ కారణంగా తెలంగాణ ఎడారి అయిపోయింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించి వుంటే, తెలంగాణపై ఆయన చిత్తశుద్ధిని అందరూ హర్షించేవారే. కానీ, అలా చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు.? కేసీఆర్ కుక్కని చూపించి నక్క అంటే, ఎవరైనాసరే.. అది నక్క అని ఒప్పుకుని తీరాల్సిందే. లేదంటే, తెలంగాణ ద్రోహులైపోతారు. ఇప్పుడు మహారాష్ట్రతో ఒప్పందాల వ్యవహారమూ అంతే.
ఒప్పందాల కోసమే ఈ స్థాయిలో పత్రికల్లో ప్రకటనల్ని కేసీఆర్ నింపేయడం కాస్తంత కామెడీగా లేదూ.! అదంతా ఆయన ఇష్టం. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి కదా. ప్రజాధనం ఎలాగైనా దుర్వినియోగం చేసేయొచ్చుగాక. ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు నిర్మితమవ్వాలంటే వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేయాలి. దానికన్నా ముందు, ఆయా ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులుగామారేవారి ప్రయోజనాల్ని చూసుకోవాలి. ఆల్రెడీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదంతో కేసీఆర్ సర్కార్ పదే పదే మొట్టికాయలేయించుకుంటోంది. ఇక, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలు – ఆ ప్రాజెక్టుల మాటేమిటి.?
ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు.. నిద్దట్లోనూ కేసీఆర్, సమైక్య పాలకుల్ని మర్చిపోలేకపోతున్నారు.. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ సమైక్య పాలకులకు పబ్లిసిటీ ఇవ్వడం అవసరమా.? అలా చేస్తే ప్రాజెక్టుల పూర్తయిపోతాయా.? ఇదేం లాజిక్కు కేసీఆర్.!