భారతదేశం గడచిన నాలుగేళ్ళలో ఒలింపిక్స్కి వెళ్ళే ఆటగాళ్ళ కోసం ఖర్చు చేసిన మొత్తం 810 కోట్ల రూపాయలట. ఈ మొత్తంలో అన్నీ కలిసి వున్నాయి. శిక్షణా కేంద్రాల నిర్వహణ, కోచ్ల కోసం వెచ్చించడం, మౌళిక సదుపాయాలు.. ఇలా ఇవన్నీ కలిస్తే, మొత్తం ఖర్చు లెక్క 810 కోట్ల రూపాయలుగా తేలింది. అమ్మో, 810 కోట్లు ఖర్చు చేస్తే బోడి రెండు పతకాలు (ఒకటి వెండి, ఇంకోటి కాంస్యం) వచ్చాయా.? అని చాలామంది నోరెళ్ళబెడుతున్నారు.
నిజమే, 810 కోట్ల రూపాయలంటే చిన్న ఫిగర్ కాదు. అలాగని పతకాలకు డబ్బు కొలమానం.. అని కూడా చెప్పలేం. దేనిదారి దానిదే. ఆ మాటకొస్తే, దేశంలో జరుగుతున్న అవినీతిని పరిగణనలోకి తీసుకుంటే, 810 కోట్లు అనేది ఆఫ్ట్రాల్.. అని చెప్పకతప్పదు. ఎక్కడిదాకానో ఎందుకు, ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికల కోసం జరిగే ఖర్చెంత.? ఓ ఎంపీ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు చేస్తున్న ఖర్చుల మాటేమిటి.? ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
అవన్నీ పక్కన పెడదాం. ప్రధాన మంత్రి తన ప్రచారం కోసం (ప్రభుత్వ పథకాలనే పేరుతో) చేసుకుంటున్న ప్రచారానికి జరిగే ఖర్చు గురించి తలచుకుంటే గుండె బద్దలైపోతుంది. ప్రధానమంత్రి సంగతి తర్వాత, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులో.!
ఇక, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. 810 కోట్లు ఖర్చు చేశారు సరే.. ఇందులో వాస్తవంగా ఖర్చయ్యిందెంత.? ఈ ప్రశ్నకు ముందు సమాధానం వెతకాలి. ఎందుకంటే, ఈసారి ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్ ఓపీ జైసా, మారథాన్ సందర్భంగా తనకు భారత్ తరఫున కనీసం ఎనర్జీ డ్రింక్ కూడా అందలేదనీ, దాంతో తాను ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నానని వాపోయారు. ఇది అత్యంత అవమానకరం. అవినీతికి, నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఒలింపిక్స్ కోసం భారతదేశం గడచిన నాలుగేళ్ళలో 810 కోట్లు ఖర్చుపెట్టిన మాట వాస్తవమే అయితే, ఆ ఖర్చు అంతా ఆటగాళ్ళకోసమే జరిగి వుంటే.. ఒలింపిక్స్లో ఫలితాలు ఇంకోలా వుండేవి. ఎనీ డౌట్స్.?