చిరంజీవి 150 వ సినిమా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఖైదీ నెం 150 అన్న టైటిల్ వచ్చేసింది. తమిళ సినిమా కత్తికి రీమేక్ ఇది. అందుకే కత్తిలాంటోడు అన్న టైటిల్ సూటబుల్ అనుకున్నారంతా. కానీ ఖైదీ నెం 150 అని ఫిక్స్ చేసారు. ఇలా ఫిక్స్ చేయడం వెనుక ఇంకో రీజన్ కూడా వుందని టాక్ వినిపిస్తోంది.
కాంటెంపరరీ రాజకీయ, వర్తమాన సంఘటనలను సినిమాల్లో ఇమడ్చడంలో సిద్ధ హస్తులైన పరుచూరి బ్రదర్స్ కత్తి సినిమా రీమేక్ కోసం పని చేసారు. ముఖ్యంగా పరుచూరి గోపాల కృష్ణ ఈ సినిమా కోసం చాలా వర్క్ చేసారు. ఈ క్రమంలో ఈ సినిమా కథను ఆంధ్ర ప్రదేశ్ రైతుల సమస్యలకు అనుగుణంగాం కొంత మార్చారన్న టాక్ వినిపిస్తోంది.
రైతుల రుణ మాఫీ, భూ సేకరణ, పరిశ్రమలకు వ్యవసాయ భూముల అప్పగింత వంటి సమస్యలను సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలపై పోరును ప్రధానంగా చూపిస్తూ, వర్తమాన రాజకీయాలపై బలమైన డైలాగులు సంధించినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని జనాలు ఈ సినిమా వ్యవహారాలతో పోల్చి చూసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
పరుచూరి బ్రదర్స్ కు ఎన్టీఆర్ అంటే మహా గౌరవం. ఆయన పార్టీ తెలుగుదేశం అన్నా కూడా. మరి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఖైదీ నెం 150 కథను వారే మార్చారంటే ? చిత్రమే.