ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఓడినాసరే, ఎంత గొప్పగా పోరాడామన్నదే ముఖ్యం. ఈ విషయంలో భారత షట్లర్ సింధు బంగారు పతకం కన్నా ఎక్కువే సాధించేసింది. తొలి సెట్‌లో ఆదినుంచీ కరోలినా మారిన్‌దే పై చేయి.. అయినాసరే, కసితో సత్తా చాటింది సింధు. రెండో సెట్‌లో మాత్రం మారిన్‌దే పై చేయి. అయినాసరే, సింధు – మారిన్‌కి చెమటలు పట్టించింది. మూడో సెట్‌లో మరీ ధాటిగా ఆడింది సింధు. విజయం మారిన్ పక్షాన నిలిచినా, మారిన్ – సింధుని గాఢంగా కౌగలించుకున్న తీరు.. సింధు పోరాట పటిమను చెప్పకనే చెప్పింది.
స్వర్ణం సాధించాల్సిన సింధు, రజతంతో సరిపెట్టుకుంది. అయితేనేం, ఇది కూడా ఓ రికార్డే. తొలిసారి ఓ మహిళ, ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రజత పతకాన్ని దక్కించుకుంది. అంతేనా, ఒలింపిక్ పోటీల పట్ల మహిళా లోకంలో ఆశలు రేపింది. భవిష్యత్తులో ఒలింపిక్స్ పట్ల మహిళా క్రీడా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆషామాషీ గెలుపు కాదిది. బంగారు పతకాన్ని మించిన విజయం. దశాబ్దాలుగా ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా భారత మహిళా లోకానికి దక్కినవి కేవలం ఐదంటే ఐదు పతకాలు మాత్రమే. అందులోనూ సింధు సాధించిన రజతమే గొప్ప. బంగారు పతకం దాకా వెళ్ళలేకపోయారెవరూ.!
సింధు మాత్రమే రజత పతకం సాధించింది.. ఆ మాటకొస్తే, ఆమె బంగారు పతకం సాధించినంత స్ఫూర్తి నింపింది భారత క్రీడా లోకంలో. ఇప్పటిదాకా క్రికెట్‌కి ఫాలోయింగ్‌ని చూశాం. ఒలింపిక్స్ పోటీల్ని ఉద్యోగాల్ని మానుకుని ఇండియాలో చూడటం అనేది ఎప్పుడన్నా వుందా.? కేవలం, సింధు కోసమే ఈసారి ఒలింపిక్స్‌ని అలా చూశాం. వీధుల్లోకి వచ్చి సందడి చేశాం, చేస్తూనే వున్నాం.
ప్రభుత్వాలు సింధు సాధించిన విజయాలకు ఉప్పొంగిపోతున్నాయి.. నజరానాలు ప్రకటిస్తున్నాయి. మంచిదే కానీ, ప్రభుత్వాలు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇంకొకటుంది. వచ్చే ఒలింపిక్స్ నాటికి, ఇప్పటి నుంచే ఆటగాళ్ళను తయారు చేయడం. అన్ని ఈవెంట్లలోనూ పోటీ పడేలా ఒకరికి నలుగురు ఆటగాళ్ళను భారత్ తయారు చేయగలిగితేనే, సింధు సాధించిన విజయానికి గౌరవం. అమెరికా ఈసారి వందకు పైగా పతకాల్ని పట్టుకెళ్ళింది. మనమెందుకు ఆ స్థాయిలో రాణించలేం.? క్రికెట్‌కి తప్ప, భారతదేశంలో ఇంకే ఆటకీ ప్రోత్సాహం లేదు. ఇది నిష్టుర సత్యం. సింధుని పొగుడుతున్నవారంతా, క్రీడలకు ప్రోత్సాహమిస్తామని ప్రతిజ్ఞ చెయ్యాలి. అలా చేసినప్పుడే, సింధు గెలుపుకైనా, సాక్షి మాలిక్ గెలుపుకైనా అర్థం వుంటుంది. కాదంటారా.?