రజనీకాంత్‌.. అభిమానిగా మారిన వేళ

'నీ పోరాటం చూసి ఆశ్చర్యపోయా.. నేను నీకు అభిమానిగా మారిపోయా.. దేశం గర్వించదగ్గ క్షణాలివి.. యూ ఆర్‌ సూపర్‌ విమెన్‌..' అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. షట్లర్‌ సింధు, రియో…

'నీ పోరాటం చూసి ఆశ్చర్యపోయా.. నేను నీకు అభిమానిగా మారిపోయా.. దేశం గర్వించదగ్గ క్షణాలివి.. యూ ఆర్‌ సూపర్‌ విమెన్‌..' అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. షట్లర్‌ సింధు, రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పోరాడి ఓడిన తర్వాత, రజత పతకంతో సరిపెట్టుకోవడంపై రజనీకాంత్‌ స్పందించారు. 

ఇప్పటిదాకా భారత్‌ నుంచి ఒలింపిక్స్‌కి ప్రాతినిథ్యం వహించిన మహిళా క్రీడాకారుల్లో (అన్ని విభాగాల్లోనూ) సింధు సాధించిన రజత పతకమే అతి పెద్దది. స్వర్ణ పతకం అనేది మహిళా విభాగంలో ఇప్పటిదాకా కలగానే మిగిలిపోయింది. ఆ కలని సాకారం చేసేలా కనిపించినా, సింధు తృటిలో ఆ ఛాన్స్‌ కోల్పోయింది. అయితేనేం, రజనీకాంత్‌ లాంటి వ్యక్తి తాను సింధుకి వీరాభిమానిగా మారిపోయానన్నారంటే, అంతకన్నా గొప్ప ప్రశంస సింధుకి ఇంకేముంటుంది.? బంగారు పతకం కన్నా ఎక్కువ అది. 

ఇక, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మహిళా లోకంలో వజ్రం నువ్వు.. అంటూ పివి సింధుని అభినందించాడు. ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు.. ఒకరేమిటి.? సింధుని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల నజరానా ప్రకటించింది. వివిధ రాష్ట్రాలూ అదే బాటలో నిలుస్తున్నాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సింధుని అభినందనలతో ముంచెత్తారు. హైద్రాబాద్‌లో సింధుకి ఘనస్వాగతం పలుకుతామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సింధుతోపాటు ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ని అభినందించారు. అన్నిటికీ మించి, భారతదేశమంతా ఈ రోజు కులమతాలకతీతంగా దీపావళి పండుగను జరుపుకుంది.