కోటి ఆశల ‘బంగారం’.. నిజమవుగాక.!

గెలిచినా, ఓడినా పతకం ఖాయం. గెలిస్తే బంగారం, ఓడితే వెండి. ఏదైనా సంచలనమే. కానీ, బంగారమే కావాలి. ఆ ఘనత మన తెలుగమ్మాయి దక్కించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఇప్పుడిదే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో…

గెలిచినా, ఓడినా పతకం ఖాయం. గెలిస్తే బంగారం, ఓడితే వెండి. ఏదైనా సంచలనమే. కానీ, బంగారమే కావాలి. ఆ ఘనత మన తెలుగమ్మాయి దక్కించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఇప్పుడిదే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రత్యేక పూజలు, ప్రత్యేక ప్రార్థనలతో నిన్న రాత్రి నుంచీ పండగ వాతావరణమే కనిపిస్తోంది. 'సింధు తెలుగమ్మాయి మాత్రమే కాదు.. ఆమె భారతావని ముద్దుబిడ్డ..' అంటూ పలు రాష్ట్రాల్లోని క్రీడాభిమానులు, ఆమెను తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

చాలా చాలా చాలా అరుదైన సందర్భమిది. తమ బడ్డను, దేశమంతా తమ సొంత బిడ్డలా భావిస్తోంటే సింధు కుటుంబం చెమర్చిన కళ్ళతో భావోద్వేగానికి గురవుతోంది. గోపీచంద్‌ అకాడమీలో నిన్నటి నుంచీ పండగ వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడినుంచే పీవీ సింధు మెలకువలు నేర్చుకుని, ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. వెండి మాట ఇప్పుడు లేదు, అంతా బంగారం గురించిన ఆలోచనే. ఒకరా? ఇద్దరా? వంద కోట్ల మంది భారతీయులు, సింధుని 'బంగారం'లా చూసుకుంటున్నారిప్పుడు. 

ఆ రంగం ఈ రంగం అన్న తేడాల్లేవు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులూ సింధు సాధించబోయే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాస్సేపట్లో ఫైనల్‌ పోరు మొదలు కానుంది. బంగారం వేటలో సింధు, ప్రత్యర్థిపై ఎలా విరుచుకుపడుతుందో టీవీల్లో తిలకించాలని యావత్‌ భారతావని ఎదురుచూస్తోంది. స్పెషల్‌ స్క్రీన్లు రెడీ అయ్యాయి. ఈ సందడి ఏ రేంజ్‌లో వుందో తెలుసా.? క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని తలపించేలా వుందనడం అతిశయోక్తి కాదేమో.! 

సెమీస్‌లో సింధు గెలిచేదాకా ఒక టెన్షన్‌.. ఇప్పుడు ఇంకో టెన్షన్‌. నిన్న రాత్రి నుంచీ, సింధు అభిమానుల సంఖ్య రెండింతలు కాదు.. పదింతలు కాదు.. ఇంకా ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. దాంతో, ఆమెపై అంచనాలూ పెరిగిపోయాయి. అంచనాలు కాదిక్కడ ముఖ్యం.. ఆటను ఆటలా ఆడటమే ముఖ్యం.. అని నిన్నటి గెలుపు తర్వాత, తనపై అంచనాలు పెరుగుతాయని తెలుసుకుని సింధు వ్యాఖ్యానించింది. 

కోటి ఆశల 'బంగారం' నిజమవ్వాలి.. భారతావని బంగారు పుత్రికలా.. బంగారు పతకంతో స్వదేశంలో సింధు అడుగు పెట్టాలి. వంద కోట్ల మంది ప్రజలు.. రెండొందల కోట్ల కళ్ళతో ఎదురుచూస్తున్నారు సింధు పసిడితో వస్తుందని. సింధుకి మనం కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.