సినిమా రివ్యూ: ఆటాడుకుందాం రా

రివ్యూ: ఆటాడుకుందాం రా రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: శ్రీనాగ్‌ కార్పొరేషన్‌ తారాగణం: సుశాంత్‌, సోనమ్‌ బాజ్వా, మురళి శర్మ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ, ఆనంద్‌, రఘుబాబు, సుధ, రమాప్రభ. ఝాన్సీ…

రివ్యూ: ఆటాడుకుందాం రా
రేటింగ్‌: 1.5/5

బ్యానర్‌: శ్రీనాగ్‌ కార్పొరేషన్‌
తారాగణం: సుశాంత్‌, సోనమ్‌ బాజ్వా, మురళి శర్మ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ, ఆనంద్‌, రఘుబాబు, సుధ, రమాప్రభ. ఝాన్సీ తదితరులు
మాటలు: శ్రీధర్‌ సీపాన
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: గౌతరరాజు
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఏ. నాగ సుశీల
కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: ఆగస్టు 19, 2016

మాస్‌ని ఆకట్టుకునే కామెడీ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్‌ అనిపించుకున్న జి. నాగేశ్వరరెడ్డి ఈసారి తన స్పెషాలిటీ నిలబెట్టుకోలేక పోగా, నవ్వించడానికి అతను చేసిన విశ్వ ప్రయత్నం మనల్ని యమ యాతన పెడుతుంది. 'ఆటాడుకుందాం రా' అంటూ ఇన్వయిటింగ్‌ టైటిల్‌ పెడితే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని ఆశ పడిన వారికి ఇది మనతోనే 'ఆటాడుకుంటుందని' అర్థం కావడానికి ఎక్కువ టైమ్‌ పట్టదు. 

అపార్ధాలతో విడిపోయిన ఇద్దరు స్నేహితులని కలిపి, వారిని విడదీసిన వారికి బుద్ధి చెప్పడానికి వచ్చే కొడుకు కథ. హిమాలయాలంత పాత కథ తీసుకుని కామెడీతో నెట్టుకొచ్చేద్దామని నాగేశ్వరరెడ్డి ఎత్తేసాడు. అయితే కూర్చోబెట్టే కథనం కానీ, నవ్వించగలిగే కామెడీ కానీ లేని 'ఆటాడుకుందాం రా' ఫ్యామిలీ డ్రామాకి,  కామెడీ ట్రాక్స్‌కీ మధ్య సింక్‌ కుదరక, ఒకేసారి స్ల్పిట్‌ స్క్రీన్‌లో రెండు సినిమాలు చూస్తోన్న భావన కలిగిస్తుంది. 

ఒరిజినల్‌ కామెడీ చేయలేనపుడు స్పూఫ్‌లతో కానిచ్చేయడం ఈమధ్య ట్రెండ్‌ అయి కూర్చుంది. నాగేశ్వరరెడ్డి కూడా అలాగే స్పూఫ్‌లతో సేఫ్‌ గేమ్‌ ఆడాలని చూసాడు. మరీ రొటీన్‌ అంటారని అనుకున్నాడేమో… స్పూఫ్‌ సీన్స్‌ పృధ్వీతో చేయించకుండా, వాటిని అతనితో డైరెక్ట్‌ చేయించాడు. బాహుబలి స్పూఫ్‌ కానీ, టైమ్‌ మెషీన్‌తో చేసిన ప్రహసనం కానీ విసుగుని గుణించాయే తప్ప కాసింత వినోదం కూడా అందించలేదు. 

ఈ స్పూఫ్‌ల పేరిట అసలు కథ ఎంత దారి తప్పిందంటే… ఒక్కోసారి సినిమా ఎటో పోతోందనే అనుమానం దర్శకుడికే వచ్చినట్టుగా, మధ్యలో 'మన కథ ఇదీ' అంటూ గుర్తు చేయడానికా అన్నట్టు ఫ్యామిలీ సీన్స్‌ ఇరికించాడు. పోనీ ఫ్యామిలీ డ్రామా అయినా ఎమోషనల్‌గా ఉందా అంటే అదీ లేదు. వేర్వేరు షాట్స్‌ తీసుకోవడం కష్టం కాబట్టి… అందరూ గుంపుగా వచ్చి నిలబడండి అని ఎవరో చెప్పినట్టుగా అనుభవమున్న నటీనటులు కూడా గ్రూప్‌ ఫోటోకి నిలబడ్డట్టు నిలబడిపోయారు. కనీసం విలన్స్‌ వైపు నుంచి అయినా కాస్త ఎక్సయిట్‌మెంట్‌ ఉంటుందని అనుకుంటే, ఎక్కడ్నుంచి తెచ్చారో కానీ మెయిన్‌ విలన్‌ చేసినతని మొహంలో ఫ్లడ్‌లైట్లు వేసి చూసినా ఎక్స్‌ప్రెషన్లు దొరికి చావలేదు. ఇక అతను ఎంత కర్కశంగా చూస్తున్నా, ఎంత విలనీ ప్రదర్శిస్తున్నా ఆ సంగతి మనకెలా తెలిసి చస్తుంది? ఇదంతా వదిలేసి హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ ఏమైనా రిలీఫ్‌ ఇస్తుందేమోనని చూస్తే సోనమ్‌ బాజ్వా పుణ్యమా అని హీరోయిన్‌ సీన్స్‌ రాకపోతేనే కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. 

నిన్న కాక మొన్ననే 'ఈడోరకం ఆడోరకం' సినిమాతో బాగానే నవ్వించిన నాగేశ్వరరెడ్డి సడన్‌గా ఈస్థాయిలో ఫామ్‌ కోల్పోవడం విచిత్రమే మరి. నాలుగేళ్లకో సినిమా చేస్తోన్న సుశాంత్‌ చేయక, చేయక చేస్తోన్న చిత్రాలకి ఇలాంటి కథలు ఎంచుకోవడం వల్ల ఉపయోగమేంటో అతనికే తెలియాలి? స్టయిలింగ్‌ పరంగా కేర్‌ తీసుకున్న సుశాంత్‌ ఆ జాగ్రత్తలేవో కథల ఎంపికలో పాటిస్తే మంచిది. విలన్‌ని బకరా చేసి హీరో రివెంజ్‌ తీర్చుకోవడమనే శ్రీను వైట్ల ఫార్ములాకి కాలం చెల్లిపోయి చాలా కాలమైపోయింది. కనీసం పిప్పి కూడా మిగలకుండా ఈ ఫార్ములా నుంచి మొత్తం జ్యూస్‌ పిండేసిన తర్వాత ఇంకా ఇలాంటివి వర్కవుట్‌ అవుతాయని ఆశించడాన్ని మించిన అమాయకత్వం ఉండదు. 

పృధ్వీ, బ్రహ్మానందం కూడా ఈ నిస్సారమైన ఆటకి ఆసక్తిని జోడించలేకపోయారు. ఇది గెలిచే ఆట కాదని ముందే గ్రహించినట్టుగా ఎవరిలోను సిన్సియారిటీ కనిపించలేదు. దీనిని కాస్తయినా 'ఆడించడానికి' బ్రహ్మాస్త్రం వాడాల్సిందే అన్నట్టు అక్కినేని బ్రదర్స్‌ ఇద్దరితోను క్యామియోస్‌ చేయించారు. అఖిల్‌ చేసిన డాన్స్‌ బిట్‌ అక్కినేని అభిమానులకి మళ్లీ తమ 'సిసింద్రీ'ని తెరపై చూసుకునే అవకాశం కల్పిస్తుంది. మెరుపులాంటి కదలికలతో అఖిల్‌ మెప్పించాడు. అయితే నాగచైతన్యతో ఏం చేయించుకోవాలో కూడా తమకే తెలీదన్నట్టు అతడి గెస్ట్‌ అప్పీయరెన్స్‌ని కూడా వేస్ట్‌ చేసుకున్నారు. సరదాగా సెట్‌కి వచ్చిన చైతన్యని సీన్‌ చేయమని రిక్వెస్ట్‌ చేసి, చేతిలో స్క్రిప్ట్‌ లేక అప్పటికప్పుడు తోచిందేదో తీసేసారా అనే అనుమానం కలగకపోదు. 

అనూప్‌ చేసిన ఏ ఒక్క పాట కానీ, అంతులేని 'అక్కినేని' ఫ్యామిలీ రిఫరెన్సులు కానీ, చివరకు అఖిల్‌-చైతన్యల ఫ్రెండ్లీ అప్పీయరెన్సులు కానీ దీనిని ఆదుకోలేకపోయాయి. నాగేశ్వరరెడ్డి చూపించినట్టుగా నిజంగా 'ఆదిత్య 469' అనే టైమ్‌ మెషీన్‌ అంటూ ఉంటే, దాంట్లో వెనక్కి వెళ్లే అవకాశం అంటూ వస్తే… బహుశా సుశాంత్‌, నాగేశ్వరరెడ్డి ఒక్కసారి కొన్ని నెలలు వెనక్కి వెళ్లి ఈ 'ఆటాడుకుందాం రా' ప్రాజెక్ట్‌ని డిస్కషన్‌ స్టేజ్‌లోనే డ్రాప్‌ అవుతారేమో. అదే టైమ్‌ మెషీన్‌ ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి ఇస్తే మాత్రం కేవలం ఒక రెండు గంటలే వెనక్కెళతారు… ఈ సినిమా థియేటర్ల జోలికి పోకుండా జాగ్రత్త పడతారు!

బోటమ్‌ లైన్‌: ఆడుకున్నారుగా!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri