తెలుగు సినిమాల్లోంచి ఇలియానా ఎందుకు తెరమరుగైపోయింది.? అంటే, దానికి ఓ కారణం వుంది. 'జులాయి' సినిమా టైమ్‌లో దర్శక నిర్మాతల్ని ఇలియానా తెగ ఇబ్బంది పెట్టేసింది. బాలీవుడ్లో అవకాశాలు వస్తుండడంతో సౌత్‌ని పూర్తిగా లైట్ తీసుకున్న ఇలియానా, సౌత్ నుంచే ఎదిగానన్న విషయాన్ని మర్చిపోయి మరీ కాస్తంత 'టెక్కు' చూపించింది. అలా ఆమెను సౌత్ సినీ ఇండస్ట్రీ, వదిలించుకుందనే చెప్పాలి.
ఇటీవల 'రుస్తుం' సినిమాతో ఇలియానాకి కాస్త ఊపు వచ్చింది. పెద్ద పెద్ద అవకాశాలూ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇకనేం, ఇలియానా అక్కడా టెక్కు షురూ చేసింది. తాజాగా 'ఆంఖేన్-2' సినిమా కోసం ఇలియానాని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. సినిమా అనౌన్స్మెంట్ సమయంలో, 'ఈ సినిమాలో ఇలియానా నటిస్తోంది..' అంటూ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఇలియానా డుమ్మా కొట్టేసింది.
అమితాబ్ బచ్చన్, అనీల్‌కపూర్ లాంటి హేమాహేమీలు నటిస్తున్న చిత్రమిది. మన సౌత్ బ్యూటీ రెజినా, బాలీవుడ్లో నటిస్తున్న తొలి చిత్రమిదే. ఇక, ఈ సినిమాలో ఛాన్స్ రావడంతో ముందు పండగ చేసుకున్న ఇలియానా, ఆ తర్వాత 'సారీ' చెప్పేసిందట దర్శక నిర్మాతలకి. ఎలాగోలా ఇలియానాని ఒప్పించేయగలం.. అనుకున్నారో ఏమో, ఇలియానా పేరునీ నటీనటుల లిస్ట్‌లో పెట్టేశారు. అక్కడే ఇలియానాకి ఒళ్ళు మండింది. ఏకంగా, దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేసేందుకు ఇలియానా సమాయత్తమవుతోందట.
ఇలియానా తీరు చూసి బాలీవుడ్లో అంతా షాక్‌కి గురవుతున్నారు. 'రుస్తుం' దెబ్బకి ఇలియానా ఇంతలా రెచ్చిపోతోందా.? అని బాలీవుడ్ సినీ జనం ముక్కున వేలేసుకుంటోంటే, తన అనుమతి లేకుండా తన పేరుని ఎలా ప్రకటిస్తారని ఇలియానా మండిపడ్తోంది. 'నేను ఆ సినిమాలో చెయ్యట్లేదు..' అనేస్తే సరిపోయేదానికి, ఇలియానా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తోందట.!