సింధూ సంచలనం.. ఇక స్వర్ణమే లక్ష్యం

పుశార్ల వెంకట సింధూ.. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో స్వర్ణం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇక ఆమె లక్ష్యం స్వర్ణమే. నిన్నటి వరకూ పతకం.. పతకం.. అంటూ కలవరించిన భారతావణికి ఆ కలను…

పుశార్ల వెంకట సింధూ.. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో స్వర్ణం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇక ఆమె లక్ష్యం స్వర్ణమే. నిన్నటి వరకూ పతకం.. పతకం.. అంటూ కలవరించిన భారతావణికి ఆ కలను తీరుస్తూనే… సంచలనాత్మక స్థాయిలో  స్వర్ణ పతకం దిశగా దూసుకెళ్లింది ఈ అచ్చమైన తెలుగమ్మాయి. జపనీ షట్లర్ తో జరిగిన సెమిస్ మ్యాచ్ లో సింధూ వరస సెట్లలో సంచలన విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్లింది.

 ఈ విజయంతో సింధూ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పతకాన్ని ఖాయం చేయడంతో పాటు.. స్వర్ణాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుని ముందడుగు వేసింది. సింధూ ఆటతీరును చూసినా.. తన కన్నామెరుగైన ర్యాంకర్లను ఆమె  ఓడించి దూసుకెళుతున్న తీరును చూస్తున్నా.. ఫైనల్ లో జయకేతనం ఎగురవేసి స్వర్ణం సాధించడం ఏ మాత్రం  కష్టం కాదనే చెప్పాలి.

సింధూ- జపనీ షట్లర్ ల మ్యాచ్ ఆద్యంతం పోటా పోటీగా జరిగింది. తొలి పాయింట్ ను సాధించిన సింధూ  ఆ తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదు. అయితే జపనీ క్రీడాకారిణి కూడా అంత త్వరగా పట్టు వదల్లేదు. తొలి సెట్ లో సింధును వెంటాడిందామె. అయితే అంతిమంగా సింధూ సెట్ ను సొంతం చేసుకుని 1-0 లీడ్ ను సాధించింది. తద్వారా శతకోటి భారతీయ హృదయ స్పందన వేగాన్ని పెంచింది.

రెండో సెట్ లో సింధూ విజయం కోసం టీవీల ముందే కూర్చుని ప్రార్థనలు మొదలుపెట్టారంతా. ఈ సెట్ లో జపనీ షట్లర్ ఆదిలో వేగం పెంచినా.. ఇరువురి స్కోర్ సమానంగా నడిచినా.. సింధూ దూకుడు ముందు ఆమె  తలలేకపోయింది. వేగవంతమైన సర్వ్ లతో సింధూ లీడ్ లోకి వెళ్లిపోయింది. ఒక దశలో 10-10 గా ఉన్న పాయింట్ల దగ్గర నుంచి సింధూ వేగాన్ని పెంచి 21-10తో సెట్ ను సొంతం చేసుకుని 2-0 తో విజయాన్ని సొంతం చేసుకుంది.