ఒలింపిక్స్ లో ఎట్టకేలకూ భారత్ ఖాతా తెరిచింది. ఆటలు ప్రారంభమై రోజులు గడిచిపోతున్నా… ఇతర దేశాలన్నీ పతకాల వేటలో దూసుకుపోతున్నా.. భారత్ మాత్రం “జీరో’’ గానే మిగిలిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకూ గత ఒలింపిక్స్ లలో భారత్ పరువు నిలబెడుతూ వచ్చిన రెజ్లింగ్ లోనే ఈ సారి కూడా కాంస్యంతో ఖాతా తెరిచింది ఇండియా. ఈ సారి మహిళల విభాగం ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ 58 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. తద్వారా పతకాల పట్టికలో భారత్ కు స్థానం కల్పించింది.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్ లో సాక్షి మాలిక్ రష్యన్ రెజ్లర్ చేతిలో ఓటమిపాలైంది. కానీ సదరు రష్యన్ రెజ్లర్ ఫైనల్ కు చేరడంతో ఆమె చేతిలో ఓడిన సాక్షి కి రేప్ జేజ్ బౌట్ లో కాంస్య పతకానికి పోరాడే అవకాశం వచ్చింది. మంగోలియా రెజ్లర్ తో ఈ పోటీని ఎదుర్కొన్న సాక్షి 12-3 తేడాతో విజయాన్ని సాధించింది. ఇది వరకూ కూడా రెజ్లింగ్ లో భారత అథ్లెట్లు రేప్ చేజ్ ద్వారా పతకాలు సాధించిన దాఖలాలున్నాయి. ఈ సారి కూడా అదృష్టం ఇలా కలిసి వచ్చింది.
మొత్తానికి వంద కోట్ల పై జనాభా ఆశలను అంతో ఇంతో అయినా నిలబెట్టింది సాక్షి మాలిక్. ఆడపిల్లలకు కుస్తీ పోటీలేమిటి? అనే ఆలోచనాత్మక ధోరణితో ఉండే దేశం నుంచి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో పతకం తీసుకురావడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో సాక్షిని ఎంతగా ప్రశంసించినా తక్కువే.
ఇక భారతీయులు పతకం ఆశలను మోస్తున్న మరో మన అమ్మాయి పీవీ సింధు ఈ రోజు సెమిస్ లో జపనీ షట్లర్ తో తలపడనుంది.