''ఇంతకీ యీ డిపార్టుమెంటులో ఎవరెవరున్నారు?'' అని అడిగాడు జిమ్.
''నేను పర్మనెంటు సెక్రటరీని. బెర్నార్డ్ మీ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ. నాక్కూడో ఓ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ వున్నాడు. అతను కాకుండా నా కింద పదిమంది డిప్యూటీ సెక్రటరీలు, 87 మంది అండర్ సెక్రటరీలు, 219 మంది అసిస్టెంటు సెక్రటరీలు వుంటారు. వీళ్లు కాక.. '' అంటూ పెద్ద లిస్టు చదివాడు.
జిమ్‌కు మతిపోయింది. ఇదంతా మార్చిపారేయాలనుకున్నాడు. అదే వాళ్లకు చెప్పాడు – రాజకీయ ఉపన్యాసం యిచ్చే ధోరణిలో..''ఈ పాతచింతకాయ పచ్చడి బ్యూరాక్రసీ తన బూజు పట్టిన తమ పద్ధతులకు స్వస్తి చెప్పాలి, కిటికీలు తెరవాలి, కొత్తగాలి రానివ్వాలి, కొత్త చీపురుతో పాతనంతా తుడిచి పారేయాలి..'' అంటూ మొదలుపెట్టి ''పని చేయకుండా యితరులకు అదనపు పని కల్పించేవారిని తీసిపారేయాలి'' అని ముగించాడు.
''..అంటే ఉద్యోగస్తుల సీట్లను అటూ యిటూ మార్చాలంటారు..'' అన్నాడు హంఫ్రీ. బ్యూరాక్రసీ యిలాగే వ్యవహరిస్తుంది. వాళ్లు వ్యవస్థను మార్చడానికి ససేమిరా ఒప్పుకోరు. రాజకీయనాయకులు ఉత్సాహంలో ఏవేవో కొత్తమార్పులు తెచ్చేద్దామనుకుంటారు. అలా మార్చేస్తే అంతా అస్తవ్యస్తమయిపోతుందని బ్యూరాక్రసీ ప్రగాఢంగా నమ్మి అడ్డు తగులుతూంటుంది. అయితే అడ్డు తగిలినట్టు కనబడకుండా ''మీరు చెప్పినట్టే…'' అంటూనే తమ ఉద్దేశాలను వాళ్ల నోటి ద్వారా అనిపిస్తారు. ''మీరు అనుకుంటున్న మార్పులు అమలు చేస్తే మీకే దెబ్బ చూసుకోండి..'' అని నర్మగర్భంగా హెచ్చరిస్తారు.
ఇప్పుడు అదే జరిగింది. ఉద్యోగాలు పీకేస్తే ఉద్యోగివర్గమంతా తమకు ఎదురుతిరుగుతుందని గ్రహించాడు జిమ్. 'ఏ శాఖలోనైనా స్టాఫ్ అదనంగా వుంటే తగ్గిద్దామంటున్నాను కానీ, ఉద్యోగులను పనిలోంచి పీకేద్దామనటం లేదు' అని తనను తాను సర్దిచెప్పుకున్నాడు. ఉద్యోగాలు పీకేయకుండా ఎలా తగ్గిస్తారు? అయినా తమ శాఖలో స్టాఫ్ అదనంగా వుంటుందని ఏ డిపార్టుమెంటయినా ఒప్పుకుంటుందా? అందుకని అసందర్భంగా ''..కొత్త మార్పులంటే మనం మరింత పారదర్శకంగా వుండాలన్నమాట. మేము ప్రజలను విశ్వాసంలోకి తీసుకుంటామని, అన్నీ ప్రజలకు చెప్పే చేస్తామని ఎన్నికలలో వాగ్దానాలు చేశాం. అవి నిజంగా అమలు చేద్దామనుకుంటున్నాం.'' అని అన్నాడు.
హంఫ్రీ, బెర్నార్డ్ వెంటనే ''తప్పకుండా'' అన్నారు. అడ్డుచెపుతారేమో వాదిద్దామని అనుకుంటున్న జిమ్ తెల్లబోయేట్టు ! అంతేకాదు, జిమ్ యీ అంశంపై పార్లమెంటులో యిచ్చిన ఉపన్యాసాలను హంఫ్రీ ప్రస్తావించి, వాటిని పేపరువాళ్లు ఎలా కవర్ చేశారో కూడా చెప్పి ''మీరు చెప్పిన లేవనెత్తిన అంశాలపై మేము కొంత వర్క్ చేసి ఒక డ్రాఫ్ట్ తయారుచేశాం. పేరు పెట్టలేదు. మీరు 'పాలనలో పారదర్శకత' అని పేరు పెట్టవచ్చు.'' అంటూ అతని ముందు ఓ కాగితాలబొత్తి పెట్టాడు.
జిమ్ ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'నా ఉపన్యాసాలకు వీళ్లు యింత ప్రాధాన్యత యిచ్చి, యింత త్వరగా తయారుచేసి చేతిలో పెడుతున్నారే' అని పొంగిపోతూ ''ఎవరు చేశారిదంతా?'' అని అడిగాడు.
''..పాతచింతకాయపచ్చడి బ్యూరాక్రసీయే'' అన్నాడు హంఫ్రీ జిమ్ మాటలను గుర్తు చేస్తూ.
ఈ ఎత్తిపొడుపుకి ఎలా స్పందించాలో జిమ్‌కు తోచక, వేదాంతిలా నవ్వి ''నిజం చెప్పాలంటే మీరంతా సంస్కరణలకు అడ్డుపడతారేమో అనుకున్నా..'' అన్నాడు నిజాయితీగా.
''బ్యూరాక్రసీ గురించి ప్రజలకు వింత వింత అభిప్రాయాలు లేకపోలేదు'' అన్నాడు హంఫ్రీ విషాదాన్ని అభినయిస్తూ. ''మేం యిక్కడ వున్నది విధానాలను రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో మీకు సహాయపడడానికే!''
ఇలా చెప్పాక హంఫ్రీ ''వివిధ మంత్రిత్వశాఖలు పంపే ప్రతిపాదనల ఆమోదంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించే ప్రతిపాదనలు'' అంటూ ఆరు పెట్టెలను చూపించాడు. ''ఇవాళ శనివారం కదా. మీరు సోమవారం ఉదయాని కల్లా యివన్నీ చదివి మీ అభిప్రాయం చెప్తే మనం ఆలస్యం లేకుండా మీ సంస్కరణలు ఆచరణలో పెట్టవచ్చు'' అన్నాడు. అన్ని పెట్టెలను చూడగానే జిమ్ గుండె పగిలింది.
జిమ్ పాపం చచ్చినట్టు వీకెండంతా ఖర్చుపెట్టి అవన్నీ చదువుకుని సోమవారం నాడు రాగానే హంఫ్రీ ''ఇవాళ యింకో మూడు పెట్టెలున్నాయి'' అన్నాడు. ''అమ్మో యిన్నా?'' అంటూ జిమ్ మొరాయించబోయాడు. వెంటనే హంఫ్రీ ''అందుకే మేమే అన్నీ చూసేసి, మీకు ముఖ్యమైన కాగితాలు మాత్రం చూపిస్తాం'' అని ఆఫర్ చేశాడు. జిమ్‌కు భయం వేసింది, దీనిలో ఏం గోల్మాల్ వుందోనని. ''అలా వద్దు, నేను అన్నీ చూస్తాను..'' అని మొండికేశాడు. నీ పని యిలాగుందా అనుకుని హంఫ్రీ ''నేనింకా మూడని తప్పు చెప్పాను, ఐదున్నాయి'' అంటూ యింకో రెండు యిచ్చి తెల్లవారేకల్లా పూర్తి చేసి పట్టుకు రమ్మన్నాడు.
అసలు అవేళ ఆఫీసులోకి రాగానే జిమ్ ముందు వీళ్లు ఓ డైరీ పెట్టారు. దాన్నిండా వారానికి సరిపడా బోల్డు ఎపాయింట్మెంట్స్ అప్పటికే రాసేసి వున్నాయి. ''నేను యీ శాఖకు వస్తానో లేదో తెలియకుండా అప్పుడే యింతమంది ఎపాయింట్మెంట్స్ ఎలా తీసుకున్నారు!?'' ఆశ్చర్యపడ్డాడు.
''మీరు కాకపోతే యింకోరు… ఎవరో ఒకరు మంత్రిగా వస్తారని తెలుసుగా..'' అని నోరు చప్పరించాడు బెర్నార్డ్.
ఇంకా నయం కోన్కిస్కాయి అనలేదు, నోరెత్తకుండా వుంటే బాగుండేది అనుకుంటూ జిమ్ డైరీ కేసి చూశాడు. వారంలో తొమ్మిది కాబినెట్ మీటింగులు. బ్రిటిష్ కంప్యూటర్ అసోసియేషన్ వారితో రేపుదయం భేటీ, లా ఇన్స్టిట్యూట్లో రేపు రాత్రి ఉపన్యాసం, మర్నాడు యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్లతో లంచ్, గురువారం వుదయం నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయర్స్ వారి సమావేశానికి ప్రారంభ ఉపన్యాసం.. యిలా చాలానే వున్నాయి. అన్నీ పెన్సిల్లో రాసి వున్నాయి.
బెర్నార్డ్ కేసి జిమ్ ఆశగా చూసి ''..పెన్సిల్ గీతలంటే మార్చుకోవచ్చన్నమాట… ఎందుకంటే నాకు కొన్ని వేరే పనులు కూడా వున్నాయి.'' అన్నాడు.
బెర్నార్డ్ కళ్లు చికిలించాడు – ''వేరే పనులా!? అంటే?''
''అదే.. మా పార్టీ పాలసీ కమిటీలు నాల్గింటిలో నేను సభ్యుణ్ని.. అలాటివే..'' అని జిమ్ చెప్పబోతూండగా హంఫ్రీ నిర్ఘాంతపోయినట్టు మొహం పెట్టి ''దేశం కంటె పార్టీకి ప్రాముఖ్యత యిచ్చేవారనుకోలేదు మిమ్మల్ని..'' అంటూ జిమ్‌ను మందలించాడు. దేశద్రోహీ అని తిట్టించుకున్నట్టు ఫీలై, జిమ్ యిక నోరెత్తలేకపోయాడు. వాళ్లిచ్చిన ఐదు పెట్టెలు మోసుకుని యింటికి బయలుదేరాడు.
************
జిమ్‌కి రాజకీయ సలహాదారు ఫ్రాంక్ను పక్కగదిలో కూర్చోబెట్టేసి 'మంత్రిగారు యిదిగో వస్తున్నారు, వెయిట్ చేయండి' అని చెపుతూ రోజంతా అక్కడే కూర్చోబెట్టేశారు. సోమవారమూ అదే తంతు. అతను చూసి చూసి ఓపిక హరించి, చివరకి మంగళవారంనాడు పెద్దగా అరుస్తూ జిమ్ గదిలోకి జొరబడబోయాడు. బెర్నార్డ్ గుమ్మం దగ్గరకి వెళ్లి ''మంత్రిగారు సమావేశంలో వున్నారు. మీరు కాస్త ఓపిక పట్టాలి'' అని చెపుతూ వుండగానే జిమ్ కలగజేసుకుని లోపలకి రానిమ్మని అన్నాడు.
నిజానికి యీ బ్యూరోక్రాట్ల గొడవలో పడి జిమ్ అతని గురించి బొత్తిగా మర్చిపోయాడు. అతన్ని చూడగానే గుర్తుకు వచ్చింది. ''ఇతను నా సలహాదారు కాబట్టి యితనికి మన డిపార్టుమెంటులోనే ఓ రూము యివ్వండి'' అన్నాడు. ''మీకు సలహాలు యివ్వడానికి మా శాఖ మొత్తమంతా వుంది కదా, మళ్లీ యీయనకెందుకు శ్రమ?'' అన్నాడు హంఫ్రీ. కాదు యివ్వాల్సిందే అని పట్టుబట్టాడు జిమ్.
''సరే అలా అయితే'' అని కాస్సేపు ఆలోచించినట్టు నటించి ''బెర్నార్డ్, ఊరికి అవతలవైపు మనకో బిల్డింగు వుంది కదా, అక్కడ యీయనకు ఓ ఆఫీసు ఏర్పాటు చేయి'' అన్నాడు హంఫ్రీ.
ఫ్రాంక్‌కు తిక్కరేగిపోయింది. ''నాకు యిక్కడే.. ఈ బిల్డింగ్‌లోనే.. ఆఫీసు కావాలి'' అని అరవనారంభించాడు. జిమ్ కూడా అవునవును అన్నాడు. హంఫ్రీ వెంటనే ''బెర్నార్డ్, మరి యిక్కడే చూడు'' అని దిగి వచ్చాడు.
''అంతేకాదు, నాకిచ్చిన కాగితాల కాపీలన్నీ ఫ్రాంక్‌కు కూడా యివ్వాలి'' అన్నాడు జిమ్ దృఢంగా.
''అన్నీనా!?'' అని ఆశ్చర్యపడ్డాడు హంఫ్రీ.
''అవును, అన్న్నీ..''అని నొక్కి చెప్పాడు జిమ్.
''ఓకే, ఓకే.. యివ్వదగిన పేపర్లు అన్నీ.. యిస్తాం.'' అన్నాడు హంఫ్రీ మధ్యలో ఓ మాట జారవిడుస్తూ. దాన్ని గుర్తించని జిమ్ తనకు విజయం సిద్ధించినట్టు ఆనందించాడు. (మొదటి కథ సమాప్తం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)