కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పూజాదికాలలో ఉపయోగించే పసుపు విశాఖ ఏజెన్సీ నుంచి ఇక మీదట పెద్ద ఎత్తున సరఫరా కానుంది. ఇంతకు ముందు అరకు తేనె ఇక్కడ నుంచే స్వామి వారికి సరఫరా చేశారు. ఇపుడు పసుపు సహా ఇతర గిరిజన ఉత్పత్తులతో స్వామి నిత్యావసరాలు ఇతర పూజలకు వాడుతారని చెబుతున్నారు.
టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఆయన విశాఖ ఏజెన్సీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి గిరిజన ఉత్పత్తులకు టీటీడీలో అవకాశం కల్పించాలని ఆయన్ని కోరారు. దాంతో వెంటనే వైవీ సుబ్బారెడ్డి ఓకే చెప్పేయడంతో గిరిపుత్రులు అంతా సంతోషిస్తున్నారు.
ఇక మీదట 5000 కేజీల పసుపు అలాగే ఇతర గిరిజన ఉత్పత్తులు వేంకటేశ్వరస్వామి వారి పూజకు నిత్య అవసరాలకు పంపిణీకి ఉపయోగిస్తారు అన్న మాట. ఈ మేరకు టీటీడీ ఉన్నతాధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉపయోగించే అన్ని గిరిజన ఉత్పత్తులు తీసుకోవలసిందిగా అక్కడికక్కడే వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో తయారుచేసే గిరిజన ఉత్పత్తులను తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవకు ఉపయోగించే అవకాశం కల్పించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డికి గిరిజనుల తరుపున జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.