1919లో ఫ్రాంజ్ కాఫ్కా “ఇన్ ది పినల్ కాలనీ” అని ఒక కథ రాశాడు. మనిషిని సులభంగా చంపడానికి ప్రత్యేక యంత్రాన్ని వాడడం సారాంశం. అయితే ఒక మనిషి గూడుని లాక్కొని రోడ్డు మీదకి విసిరేయడానికి 1909లోనే ఒక యంత్రాన్ని కనిపెట్టారు. దాని పేరు బుల్‌డోజర్. మొదట్లో దాన్ని వ్యవసాయానికే వాడారు. తర్వాత నిర్మాణ రంగంలోకి దించారు. అయితే దీన్ని జనం మీద వాడడం మొదలు పెట్టింది హిట్లర్.
1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. పవర్‌లోకి వచ్చిన వాళ్లకి ఏదో ఒకటి కూలగొట్టకపోతే నిద్రరాదు. బెర్లిన్‌ని కూల్చేసి జెర్మానియా అనే కొత్త రాజధానిని నిర్మించాలని అనుకున్నాడు. మొదట ఆయనకి కనిపించింది యూదుల భవనాలు. బుల్‌డోజర్‌లు రంగంలోకి దిగాయి. 1936 నుంచి వేల ఇళ్లు కూల్చేశారు. యూదుల్ని ఊరి బయటికి, తర్వాత క్యాంప్‌లకి తరలించారు. 1942 నాటికే నాజీలు కూల్చిన అపార్ట్‌మెంట్‌లు ఎన్నో తెలుసా? 23,765. అంటే కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. రియల్ ఎస్టేట్ వాల్యూ వున్న ప్రతి చోట అక్రమాల పేరుతో బుల్‌డోజర్‌లని దించారు.
ఇదే సూత్రాన్ని 1948 నుంచి పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ అమలు చేసింది. 2004 నాటికి ఇది ఎంత తీవ్రమైందంటే అమెరికాలో తయారైన D 9 బుల్‌డోజర్‌లని ఇజ్రాయిల్‌కి అమ్మకూడదని అవి చేస్తున్న విధ్వంసం అంతాఇంతా కాదని ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు నిరసన తెలిపాయి.
1992 నుంచి ఇజ్రాయిల్‌తో మనకి మంచి సంబంధాలున్నాయి. దేశం నుంచే కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా పోలీస్ అధికారులు అక్కడ శిక్షణ పొంది వచ్చారు. బుల్‌డోజర్ మీద జరిగిన అధ్యయనం ఇప్పుడు అమల్లోకి వచ్చినట్టుంది.
(ఇజ్రాయిల్ వ్యవసాయం అంటూ మన చంద్రబాబు కూడా గతంలో హడావుడి చేశాడు. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం)
జీఆర్ మహర్షి