మాజీ మంత్రి నారాయణను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ గొంతులు పెద్ద సౌండ్ చేసుకుంటూ బయటకు రావడం కామన్. టీడీపీ అనుకూల మీడియా దాన్ని రీసౌండ్ వచ్చేలా టెలికాస్ట్ చేయడం ఇంకా కామన్. కానీ ఇక్కడ సంబంధం లేని ఓ గొంతు విరుచుకుపడుతోంది.
నారాయణ అనుచరులకు జాగ్రత్త చెబుతోంది. ఇంతకీ ఆ గొంతు ఎవరిదనుకుంటున్నారా..? స్వపక్షంలో విపక్షంలా రెచ్చిపోయే ఎంపీ రఘురామకృష్ణంరాజుది.
ఆ నొప్పి నాకు తెలుసు.. నాకు మాత్రమే తెలుసు..
రఘురామ కృష్ణంరాజు చెప్పిన జాగ్రత్తల్లా ఒకటే.. “బాబ్బాబు ఆ సీఐడీ పోలీసులు నారాయణని కుమ్మేస్తారు, ఆయన ఫిజికల్ ఫిట్ నెస్ ఎలా ఉందో తెలియదు, పోనీ పూర్తి పర్ఫెక్ట్ అనుకున్నా కూడా ఆ ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చు. దయచేసి నారాయణ అనుచరులు కోర్టుని ఆశ్రయించండి.”
ఇదీ రఘురామ ఉపదేశం. రఘురామ ఇంతలా ఎందుకు ఇదవుతున్నారంటే సీఐడీ పోలీసుల ట్రీట్మెంట్ ని ఆయన బాగా రుచి చూశారు కాబట్టి అని అర్థం చేసుకోవచ్చు. ఆమధ్య రాజద్రోహం కేసులో సీఐడీ పోలీసులు రఘురామని అరెస్ట్ చేశారు. నన్ను కుళ్లబొడిచారు బాబోయ్ అంటూ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆయన గగ్గోలు పెట్టి బెయిల్ పై బయటకొచ్చారు.
ఆలోగా ఆయన కాళ్లు బొబ్బలెక్కాయని చూపించడం, చెప్పుకోలేని చోట్ల కొట్టారని తన సహచరులకు చెప్పుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టే.. ఆయన ఇప్పుడిలా నారాయణకి ముందు జాగ్రత్తలు చెబుతున్నారు.
ట్రీట్మెంట్ విధానంబెట్టిదనియ..
“సీఐడీ పోలీసులు లోపలికి తీసుకెళ్లి విచారణ చేసే క్రమంలో ముందుగా గదుల్లో సీసీ కెమెరాలు తీసేస్తారు. వ్యక్తిగత సిబ్బందిని బయటకు పంపిస్తారు. ఆ తర్వాత బాదుడు మొదలు పెడతారు. వారిలోని క్రూర మృగాలన్నీ అప్పుడు బయటకొస్తాయి. చితకబాది ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఉంటారు. కేవలం కొట్టడం కోసమే తీసుకెళ్తారు, ఆ తర్వాత పచ్చి అబద్ధాలు ఆడతారు.” ఇవన్నీ సీఐడీ పోలీసులపై రఘురామ చేస్తున్న ఆరోపణలు. ఈ ఎక్స్ పీరియన్స్ తనకి ఉందని, అందుకే నారాయణ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారాయన.
మొత్తమ్మీద గతంలో రఘురామకి గట్టి చికిత్స ఇవ్వడం వల్లే ఆ తర్వాత ఆ స్థాయిలో ఆయనెప్పుడూ నోరు తెరవలేదు. ఇప్పుడిలా నారాయణకు ఉచిత సలహాలిస్తున్నారు. రోగాన్నిబట్టి చికిత్స ఉంటుందనే విషయం ఆయనకి తెలియదేమో.