ఉన్మాదమెవరిది చంద్రబాబూ.?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పుష్కరాల నేపథ్యంలో చంద్రబాబు తనకు ఎక్కడ వ్యతిరేకంగా కథనాలు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. పుష్కరాలకు సంబంధించి తొలి రోజు, చంద్రబాబుకి చుక్కెదురయ్యింది కాదనలేని వాస్తవం. అందుకు…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పుష్కరాల నేపథ్యంలో చంద్రబాబు తనకు ఎక్కడ వ్యతిరేకంగా కథనాలు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. పుష్కరాలకు సంబంధించి తొలి రోజు, చంద్రబాబుకి చుక్కెదురయ్యింది కాదనలేని వాస్తవం. అందుకు కారణాలు చాలానే వున్నాయి. 

తొలి రోజు వరలక్ష్మీవ్రతం కావడంతో, కృష్ణా జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఇతర జిల్లాల్లోనూ 'పుష్కరస్నానం చేయకూడదు' అన్న ప్రచారం పండితుల నోట జరిగింది. దాంతో, తొలి రోజు పుష్కర స్నానాలకి జనం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇదొక్కటే కారణం కాదు, లక్షల సంఖ్యలో పుష్కర యాత్రీకులు వచ్చేస్తారన్న అంచనాలతో, జరిగిన 'అతి' ఏర్పాట్లు, అతి ప్రచారం కూడా ఇంకో కారణం. ఈ కారణంగానే, అసలు విజయవాడలో పుష్కరస్నానం చెయ్యగలమా.? అన్న అనుమానం చాలామందిలో కలిగింది. 

విజయవాడ చాలా ఇరుకైన నగరంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. మామూలు రోజుల్లోనే బయట నుంచి విజయవాడలోకిగానీ, విజయవాడలోంచి బయటకిగానీ రావడం కనాకష్టమైపోతోంది. పుష్కరాలంటే పరిస్థితి ఇంకా దారుణంగా వుంటుంది. దాంతో, పుష్కర యాత్రీకులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యామ్నాయ పుష్కరఘాట్లు (తెలంగాణ వైపు) మొగ్గు చూపారు. మరీ సాక్షి దినపత్రికలో కన్పించినంత పల్చగా కాకపోయినా, చంద్రబాబు అంచనాలకు భిన్నంగా పుష్కర యాత్రీకులు తక్కువగా కన్పించారు. దాంతో, చంద్రబాబుకి సహజంగానే అసహనం పీక్స్‌కి వెళ్లిపోయింది. 

అయినా, గోదావరి పుష్కరాలు వేరు – కృష్ణా పుష్కరాలు వేరు. మొదటినుంచీ గోదావరి పుష్కరాలకున్నంత ప్రాధాన్యత కృష్ణా పుష్కరాలకు లేదన్నది అందరికీ తెల్సిన విషయమే. కానీ, ఇక్కడ జరిగింది పుష్కరం పేరుతో పబ్లిసిటీ. పుష్కరం కన్నా 'నదుల అనుసంధానం' గురించి చంద్రబాబు ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నారు. అదీ కొంపముంచేసిందనే చెప్పాలి. 

ఇంకోపక్క, 300 కిలోమీటర్ల దూరంలో హైద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తారనుకున్న పుష్కర యాత్రీకులు.. 200 కిలోమీటర్ల దూరంలోపలే తెలంగాణ పుష్కర ఘాట్లు ఆకర్షిస్తుండడం, ఇక్కడ నీరు కూడా ఎక్కువగా కృష్ణా నదిలో లభ్యమవడంతో, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణ పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. పరిస్థితుల్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేం కాదు కదా చంద్రబాబునాయుడుగారు. అందుకే, పుష్కర ఏర్పాట్లలో రెండో రోజుకే 'అతి' తగ్గించేశారు. దాంతోపాటుగా సెలవులు కలిసిరావాడంతో, రెండో రోజు, మూడో రోజు పుష్కరయాత్రీకుల సందడి బాగానే కన్పించింది ఆంధ్రప్రదేశ్‌లో. 

అంచనాలు తల్లకిందులవడంతో, మీడియాపై ఏకంగా 'ఉన్మాదం' అనే మాట ప్రయోగంచేశారు చంద్రబాబు. ఉన్మాదం ఎవరిది.? భక్తి భావంతో జనం మునిగి తేలాల్సి వుంటే, 'నేనే దేవుణ్ని..' అన్నట్లుగా ప్రచారం జనం సొమ్ములతో చేసుకుంటున్న చంద్రబాబుది కాదా పబ్లిసిటీ ఉన్మాదం.?