పాలకులకు ప్రజలెప్పుడూ వెర్రి వెంగళప్పల్లానే కనిపిస్తారు. పైకి మాత్రం 'ప్రజలే దేవుళ్ళు..' అని చెబుతుంటారు. రిజర్వేషన్ల విషయంలో ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఓ పక్క రిజర్వేషన్లకు అవకాశం వుండదు, ఇంకోపక్క నేతల రిజర్వేషన్ల ప్రకటనలకు హద్దూ అదుపూ వుండదు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, 'కాపులకు రిజర్వేషన్లు' అనే అంశంతో ఎలా ఆటలాడుతున్నారో చూస్తూనే వున్నాం. చంద్రబాబేనా.. నేనెందుకు రిజర్వేషన్ల పేరుతో జనంతో ఆటలాడుకోకూడదు.? అనుకున్నారో ఏమో, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా రిజర్వేషన్లతో 'ఆట' షురూ చేసేశారు. ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేస్తారట కేసీఆర్. అది సాధ్యమేనా.? అని కాస్త 'బుర్రపెట్టి' ఆలోచిస్తే, 'సాధ్యం కాదు' అనే విషయం ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటే, ఒక్క ముస్లింలకేం ఖర్మ, సమాజంలోని అన్ని వర్గాలకీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. ఏం, సమాజంలో ఒక్కో పౌరుడిని ఒక్కోలా ఎందుకు చూడాలి.? 'మనది సమానత్వ భారతం' అని చెప్పుకుంటున్నప్పుడు, కొందరికి మాత్రమే ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి.? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ఈ ప్రశ్న, ఉన్నత వర్గాలుగా పిలవబడ్తోన్నవారి నుంచి ఈ మధ్య బాగా విన్పిస్తోంది. దానికి కేసీఆర్ సహా ఎవరైనా సమాధానం చెప్పగలరా.? ఛాన్సే లేదు.
ప్రజల జీవితాలతో చెలగాటమాడటం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల ఎర వేసింది చంద్రబాబే. వారిలో ఆశలు కలిపించిందీ ఆయనే. ఆశలు కలిపించి, రిజర్వేషన్లను అటకెక్కించిందీ చంద్రబాబే. మాట తప్పిన చంద్రబాబు, తమ హామీల కోసం రోడ్డెక్కిన కాపు సామాజిక వర్గంపై కేసులు బనాయించారు. 'అల్లర్లు చేసి, విధ్వంసాలకు పాల్పడితే కేసులు పెట్టమా?' అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇదే చంద్రబాబు. 'అబ్బే, గోదావరి జిల్లాలకి చెందినోళ్ళు మంచోళ్ళు..' అని మళ్ళీ ఇదే చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తారు.
ఇప్పుడు ముస్లింల వంతు. రెండేళ్ళు గడిచిపోయింది. ఇంకా, చంద్రశేఖర్‌రావుగారు పాత పాటే పాడుతున్నారు. అంటే, ఇప్పుడు ముస్లింలు తమ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కాలి. రిజర్వేషన్ల కోసం వారి ఆందోళనలు విధ్వంసాలకు కారణమైతే, ఇప్పుడు మళ్ళీ ఇదే కేసీఆర్, 'అబ్బే వాళ్ళు అలాంటోళ్ళు కాదు..' అని చెప్పాలి, మళ్ళీ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వాళ్ళ మీదనే కేసులు బనాయించాలి. ఇదీ ముందు ముందు జరిగే కథ.
ఈ పొలిటికల్ కథలు వినీ వినీ జనం అలసిపోయారు. ఎన్నికల వేళ జనం నమ్ముతున్నారు రాజకీయ పార్టీల్ని. తప్పదు, వేరే ఆప్షన్ కన్పించడంలేదు. ఎవడో ఒకడ్ని నమ్మి తీరాల్సిందే.. ఎవర్నీ నమ్మలేం.. అని ఓట్ల పండక్కి దూరమైతే, తక్కువ ఓట్లతోనైనాసరే, కొందరు గద్దెనెక్కేస్తున్నారు. వ్యవస్థ ఇంత భ్రష్టుపట్టిపోయింది మరి.! అందుకే, కథలు చెప్పేటోళ్ళే గద్దెనెక్కుతున్నారు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ చంద్రశేఖర్‌రావు. ఇద్దరూ చంద్రులే.. ఇదీ చంద్ర ప్రొడక్షన్స్ రిజర్వేషన్ల కథ.