పీవోకే.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇది. మామూలుగా మనం నిత్యం చూసే ఇండియా మ్యాప్ వేరు. అసలు ప్రస్తుతం ఉన్న ఇండియా మ్యాప్ వేరు. గూగుల్‌లోనో, ఇంకెక్కడో మ్యాప్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా, దాన్ని తీవ్రంగా ఖండించేస్తాం. కానీ, మన దేశం నుంచి కొంత భాగాన్ని పాకిస్తాన్, ఇంకొంత భాగం చైనా ఆక్రమించేసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇండియా వున్న యధాతథ స్థితిని మ్యాప్ రూపంలో విడుదల చేసేందుకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ సాహసం చేయలేదు. ఎందుకంటే, దేశ ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటాయ్.
కానీ, ఇప్పుడు నరేంద్రమోడీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) మనదేనంటున్నారు. పనిలో పనిగా, చైనా ఆక్రమిత కాశ్మీర్‌ని కూడా మనదే.. అని ఆయన అంటే బావుండేదేమో.! మాటలదేముంది.? ఎన్నయినా అనుకోవచ్చు. కానీ, వాస్తవాలంటూ వుంటాయి కదా. వాటిని ప్రజలకు చెప్పేందుకే పాలకులకు ధైర్యంతోపాటు, చిత్తశుద్ధి కూడా కావాలి.
కాశ్మీర్ ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో రావణకాష్టంగా రగులుతూనే వుంది. కానీ, ఏం చేస్తాం.. అది మనది. వ్యూహాత్మకంగా భారత రక్షణావసరాలకు కాశ్మీర్ ఎంతో కీలకం. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్‌ని కాపాడుకోవాలి. ఇక్కడ కాశ్మీర్ అంటే ప్రస్తుతం భారత్‌లో వున్న కాశ్మీర్ మాత్రమే. అంతర్జాతీయ న్యాయస్థానాలు సరిగ్గా వ్యవహరిస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడో భారత్‌లో చేరిపోవాలి. కానీ, ఆ అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్యసమితి వంటివి వున్నాయంటే.. వున్నాయంతే, వాటి వల్ల ఉపయోగముండదు.
ఇంతకీ, ఇప్పుడు కొత్తగా నరేంద్రమోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు.? ఇదే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధాని పదవిలో రెండేళ్ళు పండగ చేసుకున్నాక, నరేంద్రమోడీకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుర్తుకు రావడం ఆశ్చర్యకరమే మరి. కాశ్మీర్ గత కొన్నాళ్ళుగా ఆందోళనలతో దద్దరిల్లుతోంది గనుక, ఆ వైఫల్యం ఎక్కడ తమ ప్రభుత్వం మీద పడుతుందో, తద్వారా విపక్షాలు తమను ఎక్కడ ఇరకాటంలో పడేస్తాయోననే భయంతో కొత్తగా ఇప్పుడు నరేంద్రమోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదేనంటూ కొత్త పల్లవిని అందుకున్నారు.
నిజానికి పీవోకే మనది. కానీ, పాకిస్తాన్ ఆధీనంలో వుంది. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అది పాకిస్తాన్‌కి చెందిన భూమి కూడా కాదు. అక్కడ వేరే ప్రభుత్వం వుంటుంది. కానీ, అక్కడ పరిపాలన అంతా పాకిస్తాన్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లోనే నడుస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, మన ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే, ఆ మధ్య స్వదేశంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, ఆకస్మికంగా పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చారు నరేంద్రమోడీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై మోడీకి చిత్తశుద్ధి వుండి వుంటే, అప్పుడే ఆ అంశాన్ని ప్రస్తావించేవారు.
ఏదిఏమైనా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి నరేంద్రమోడీ ఎలాంటి తొందరపాటు చర్యలకు దిగినా, పాకిస్తాన్‌తో మరో యుద్ధం చేయాల్సి వస్తుంది. బీజేపీ హయాంలోనే కార్గిల్ యుద్ధం జరిగింది.. మళ్ళీ ఆనాటి పరిస్థితులు పునరావృతమవుతాయా.? వేచి చూడాల్సిందే.