కోట్లు తగలేసింది.. బాబు భజనకే.!

అటు తిరుగు, ఎటైనా తిరుగు.. చివరికి కథ అక్కడికే వచ్చి ఆగుతుంది. భూమి గుండ్రంగా వుంటుంది.. ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చయ్యే ప్రతి పైసా, చంద్రబాబు పబ్లిసిటీ యావ అనే ఖాతాలోకి వెళుతుంది. దటీజ్‌ చంద్రబాబు. అది…

అటు తిరుగు, ఎటైనా తిరుగు.. చివరికి కథ అక్కడికే వచ్చి ఆగుతుంది. భూమి గుండ్రంగా వుంటుంది.. ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చయ్యే ప్రతి పైసా, చంద్రబాబు పబ్లిసిటీ యావ అనే ఖాతాలోకి వెళుతుంది. దటీజ్‌ చంద్రబాబు. అది పుష్కరాలు కావొచ్చు, ఇంకేదన్నా కావొచ్చు. అక్కడంతా చంద్రబాబు భజనే జరగాలి. 

కోట్లు ఖర్చు చేసి కృష్ణా పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఈ ఏర్పాట్లను ఎవరూ తప్పు పట్టలేరు. అంగరంగ వైభవంగా కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేయించిన చంద్రబాబు సర్కార్‌, అందులో తన భజనకే ఎక్కువ మొత్తం కేటాయించినట్లుంది. ఈ రోజు సాయంత్రం (పుష్కరాలకు ఒక రోజు ముందు) గోదావరి, కృష్ణా నదుల సంగమ క్షేత్రం వద్ద బీభత్సమైన 'పబ్లిసిటీ క్యాంపెయిన్‌' నిర్వహించేశారు చంద్రబాబు. 

ఇప్పటికే నదుల అను సంధానం గురించి చంద్రబాబు అనేక పబ్లిసిటీ స్టంట్లు చేసేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసేశారు.. ఒక్క మోటారు పెట్టి, దాన్ని ప్రారంభించడానికి ఓ కార్యక్రమం చేపట్టారు. ఓ సారి ఇదే సంగమ క్షేత్రం వద్ద బహిరంగ సభ నిర్వహించారు.. మళ్ళీ ప్రత్యేక పూజలంటూ హంగామా చేశారు. అవన్నీ చాలలేదు, ఇప్పుడు పుష్కరాల పేరుతో ఇంకో ఈవెంట్‌ చేపట్టారు.. అదీ, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో. 

అద్బుతం.. అనే స్థాయిలో ఈ ఈవెంట్‌ జరిగింది. కానీ, ఏం లాభం.? అంతా చంద్రబాబు భజన కోసమే అన్నట్లుగా తయారయ్యింది. చంద్రబాబు భజన కోసమే అయితే, బహిరంగ సభ నిర్వహించుకోవచ్చుగాక. దాని కోసం, విలువైన ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చెయ్యాలి.? చంద్రబాబు, ఆయన పక్కనే బాలకృష్ణ, మరోపక్క బోయపాటి శ్రీను.. వాయిస్‌ ఓవర్‌ విషయంలో తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఝాన్సీ.. పోటీ పడ్డారు.. ఇక్కడా చంద్రబాబు భజనే. 

దేవుడా, ఈ పుష్కరాల్ని సృష్టించింది చంద్రబాబు పబ్లిసిటీ కోసమేనా.? అని జనం నెత్తీనోరూ బాదుకునేలా చేసేశారు. ఈవెంట్‌ అద్భుతంగా జరిగినా, ఆ ఫీల్‌ లేకుండా పోయింది కేవలం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ కారణంగానే. తప్పదు, అంతా ఆయనిష్టం.!