బోయపాటి శ్రీను.. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఈయనా ఒకడు. భారీ కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంల దిట్ట. ఇటీవలే 'సరైనోడు' సినిమాతో వసూళ్ళ పరంగా మంచి విజయాన్ని అందుకున్నాడు. 'సినిమాకి మించి' అన్నట్లుగా పుష్కరాల పుణ్యమా అని బోయపాటి పేరు మార్మోగిపోతోంది. గోదావరి పుష్కరాలకు డైరెక్షన్ అంతా బోయపాటిదే. చంద్రబాబుకి అత్యంత నమ్మస్తుడిగా, గోదావరి పుష్కరాల నిర్వహణపై తనదైన ముద్రవేశాడు బోయపాటి.
ఆగండాగండీ, ఇదంతా చంద్రబాబు పబ్లిసిటీ కోసమే. గోదావరి పుష్కరాల్లో 29 మంది తన పబ్లిసిటీ యావ కారణంగా చనిపోయినా, మరోసారి చంద్రబాబు పుష్కరాల బాధ్యతల్ని సినీ దర్శకుడు బోయపాటిపైనే పెట్టాలనుకున్నారు.. పెట్టేశారు కూడా. కృష్ణా పుష్కరాలకు సంబంధించి, నిన్న కృష్ణా – గోదావరి నదుల సంగమ ప్రాంతం వద్ద భారీ ఈవెంట్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో జరిగింది.
ఇక, నిన్నటి ఈవెంట్ సక్సెస్ అవడం పట్ల బోయపాటి స్పందిస్తూ, ఇది దైవ కార్యమనీ, 'దేవుడి దయ వుంటే' తప్ప ఇలాంటి అవకాశాలు రావనీ సెలవిచ్చాడు. దేవుడి దయ మాటెలా వున్నా, చంద్రబాబు దయా దాక్షిణ్యాలు మాత్రం బోయపాటిపై పుష్కలంగా వున్నాయి. దేవుడి దయ అని చెప్పి, బోయపాటి రెమ్యునరేషన్ తీసుకోకుండా వుండరు కదా. అసలే అక్కడున్నది చంద్రబాబు. దాదాపు ఐదు కోట్ల దాకా బోయపాటికి చెల్లించారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆ మాత్రం చెల్లించకపోతే స్టార్ డైరెక్టర్ బోయపాటి రంగంలోకి దిగుతాడా.? అంతకన్నా ఎక్కువే ఆఫర్ చేయకుండా చంద్రబాబు వుంటారా.?