అటు బూతు సైట్లు, ఇటు పైరసీ సినిమాల వెబ్ సైట్లు.. ఇండియన్ ఇంటర్నేట్ స్పేస్ లో వీటికి బ్రేక్ పడింది. వీటి విషయంలో సంవత్సరాలుగా వస్తున్న అభ్యంతరాలకు, ఆందోళనలకు చివరికి పరిష్కారం దొరికినట్టుగా ఉంది. ఉన్నట్టుండి ఈ వెబ్ సైట్లు పని చేయకుండా పోయాయి! సైబర్ నేరాల నిరోధక అధికారులు కానీ.. ప్రభుత్వం కానీ.. దీని గురించి పెద్దగా హడావుడి చేయడం లేదు కానీ, ఈ తరహా వెబ్ సైట్లలో కొన్నింటికి బ్రేక్ పడింది. ఇండియా వరకూ అయినా ఆ పేజ్ లను బ్లాక్ చేశారు.
బ్లూ ఫిల్మ్ లను విరివిగా అందుబాటులోకి తెచ్చిన పోర్నోగ్రఫీ వెబ్ సైట్ల విషయంలో చాలా పిటిషన్లు ఇన్ని రోజులూ కోర్టుల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కట్టడి చేయాలని పలు మార్లు కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తమ అసహాయతను తెలియజేస్తూ వచ్చింది. వాటి నిరోధం సాధ్యం కాదన్నట్టుగా వ్యవహరించింది. దీంతో ఇండియన్ నెటిజన్స్ కు పోర్నోగ్రఫీ ఒక క్లిక్ దూరంలోనే నిలిచింది. అలాగే సినిమాల పైరేటెడ్ కాపీలను ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచే వెబ్ సైట్లు కూడా దేశంలో వర్ధిళ్లుతూనే ఉంది. సినీ పరిశ్రమను ఈ వెబ్ సైట్లు దారుణంగా దెబ్బతీస్తూ వచ్చాయి.
ఈ రెండు రకాల వెబ్ సైట్ల కూ సాధారణ నెటిజన్ల నుంచి బోలెడంత ఆదరణ ఉంది. వాటిని క్లిక్ చేయడం చెడ్డపని, నేరం అని తెలిసి కూడా ఎవరికీ అడ్డంకులు లేకపోవడంతో రెండు రకాల సైట్లూ ఎంచక్కా కొనసాగాయి. ఈ నేపథ్యంలో కొన్ని సైట్ల ను గుర్తించి.. ఇండియా వరకూ వాటిని బ్లాక్ చేశారు.
ఈ చట్టవ్యతిరేకమైన కంటెంట్ ను అందించడంలో ముందున్న టాప్ రేటెడ్ వెబ్ సైట్ల ను ప్రధానంగా బ్యాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. కొన్ని సైట్ల ను నిరోధించిన మాత్రానా.. ఈ సమస్య కు సమూలమైన పరిష్కారం దొరికినట్టు కాదు. పైరసీ, పోర్న్.. సైట్లు తామరతంపరల్లా విస్తరించి ఉన్నాయి. వీటన్నింటినీ కట్టడి చేయడం అంటే చాలా కష్టమైన పనే. ప్రస్తుతానికి కొంత వరకూ విజయవంతం అయిన ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి విజయం సాధించగలుగుతుందేమో చూడాలి.