వాళ్లిద్దరూ ప్రపంచానికి పరిచయం కాకముందే ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్లు! ఇద్దరూ కలిసి అవకాశాల కోసం తిరిగే వారట. ఒకరికొరు ఆల్ ద బెస్ట్ చెప్పుకొంటూ.. ఒకరికి అవకాశం దక్కితే మరొకరు ఆనందించేవాళ్లట. మరి ఈ స్నేహితురాళ్లు ఇద్దరూ తాము కోరుకున్న ఫీల్డ్ లో ఇప్పుడు దూసుకపోతున్నారు! కలిసి అవకాశాల వేట సాగించిన ఈ ఇద్దరికీ కలిసి వచ్చింది. తామిద్దరం ఇప్పుడు ఒకరి సక్సెస్ పట్ల మరొకరు హ్యాపీగా ఉన్నామని అంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా, బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ ల గురించి ఇదంతా.
ఈ నార్తిండియన్ ముద్దుగుమ్మలు ఇప్పుడు క్రేజీహీరోయిన్లు అనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు. యశ్ రాజ్ పిక్చర్స్ వారి ఆస్థాన హీరోయిన్ గా వాణీ దూసుకపోతోంది. ఇక దక్షిణాదిన రాశీ చాలా బిజీగా ఉంది. ఒకప్పుడు ఈ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్సంట. మోడలింగ్ పరిశ్రమలో అవకాశాల కోసం వేట సాగిస్తున్న సమయంలో వాణీ, తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని రాశీ వివరించింది.
వివిధ యాడ్ ఫిల్మ్స్ లో తమకు అవకాశాలు వచ్చాయని, వివిధ బ్రాండ్ల కు తాము ఇద్దరం మోడల్స్ గా వ్యవహరించామని రాశీ వివరించింది. ఆ సమయంలో తాము కష్టసుఖాలను పంచుకునే వాళ్లమని.. ఇద్దరికీ దాదాపు ఒకే సారి సినిమా అవకాశాలు వచ్చాయని రాశి చెప్పింది. ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ గా ఉండటం, వాణీ హిందీలో ఉనికి చాటుతూ ఉండటం ఆనందాన్ని ఇచ్చే అంశమని.. తమ సాన్నిహిత్యం గురించి చెప్పింది రాశీ ఖన్నా.