అణు విధ్వంసం – మానవాళికి గుణపాఠం

చేతిలో అణుబాంబు వుంది కదా.. పేల్చేద్దాం.. అనే పరిస్థితి లేదిప్పుడు. ఒకటి, రెండు.. అంతే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా అణుబాంబు దాడులు జరిగినవి కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే. ఆ రెండు దెబ్బలు తిన్నదీ…

చేతిలో అణుబాంబు వుంది కదా.. పేల్చేద్దాం.. అనే పరిస్థితి లేదిప్పుడు. ఒకటి, రెండు.. అంతే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా అణుబాంబు దాడులు జరిగినవి కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే. ఆ రెండు దెబ్బలు తిన్నదీ జపాన్‌ దేశమే. నేటితో జపాన్‌లో జరిగిన రెండో అణుదాడికి 71 ఏళ్ళు. తొలి బాంబు దాడి జరిగిన నాలుగు రోజులకి ఈ రెండో బాంబుపేలింది. ఒకటి, తక్కువ.. ఇంకోటి ఎక్కువ అనడానికి వీల్లేదు. 

అణుబాంబు పేల్చడమంటే మానవాళిని సర్వనాశనం చేసెయ్యడమే.. అన్న వాస్తవాన్ని ప్రపంచం చాలా తొందరగా గుర్తించింది. కానీ, ఏం లాభం.? ఇంకోడ్ని బెదిరించాలంటే అణుబాంబు వుండాల్సిందేనన్న కోణంలో.. చాలా దేశాలు అణు ప్రయోగాలు చేపట్టాయి.. అణుబాంబుల్ని తయారుచేసి పెట్టుకున్నాయి. వందలాది, వేలాది అణుబాంబులున్నాయిప్పుడు ప్రపంచంలోని పలు దేశాల్లో. భారత్‌, పాకిస్తాన్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. 

'తొలిసారిగా మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబు ప్రయోగించం..' అనే స్వీయ నియంత్రణ విధించుకున్న ఒకే ఒక్క అణుశక్తి దేశం అంటే భారతదేశమే. మిగతా దేశాలకి అలాంటి స్వీయ నియంత్రణలేవీ లేవు. అంతర్జాతీయంగా అణుబాంబుల విషయమై అనేక ఒప్పందాలు, వేదికలు వున్నా.. 'విర్రవీగుతున్న అహంకారం' ముందు అవన్నీ ఉత్తమాటలే. అయినాసరే, ప్రపంచంలో అణుశక్తి కలిగిన ఏ దేశమూ అణుబాంబుల్ని ప్రయోగించేందుకు అత్యుత్సాహం చూపే అవకాశమే లేదు. 

ఎందుకు.? అంటే, ఎప్పుడో 71 ఏళ్ళ క్రితం అణుబాంబు సృష్టించిన విలయం గురించి అందరికీ తెలుసు గనుక. అప్పుడంటే రెండే రెండు బాంబులు. ఇప్పుడు వేల సంఖ్యలో బాంబులు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల వద్దనున్న అణుబాంబుల లెక్కలు తీస్తే, కళ్లు పేలిపోతాయ్‌. ఆ బాంబుల్ని అలాగే పేల్చేస్తే, భూమిని ఒకసారి కాదు.. వందసార్లు, వెయ్యిసార్లు నామరూపాల్లేకుండా చేసెయ్యవచ్చు. 

అప్పట్లా కాదు ఇప్పటి పరిస్థితి. ఒక్కటి పేలితే, అక్కడితో సినిమా అయిపోదు. దాని వెంట ఇంకోటి, ఆ తర్వాత మరోటి.. ఇదో ఛెయిన్‌ రియాక్షన్‌. వెరసి, డైనోసార్లు భూమ్మీదనుంచి అంతరించిపోయినట్లు, మానవజాతి అంతరించిపోతుందంతే. అందుకే, 'మా దగ్గర అణుబాంబు వుంది..' అనే బెదిరింపులు తప్ప, ఏ దేశమూ అణుబాంబుల్ని ఇంకో దేశంపై ప్రయోగించే ఛాన్సే లేదు. కానీ, ఐసిస్‌ లాంటి తీవ్రవాద సంస్థల చేతుల్లో ఈ అణుబాంబులు పడితే మాత్రం, పరిస్థితిని ఊహించుకోలేం.

ఐసిస్‌ వరకూ ఎందుకు.? మన పొరుగు దేశం పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న తీవ్రవాద సంస్థలు, భారత్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. భారత్‌పై అణుదాడి చేస్తామని. సో, మానవాళి తక్షణ కర్తవ్యం.. అణుబాంబుల్ని, తీవ్రవాదుల చేతుల్లో పడకుండా చూడటం. ఇప్పటికైతే, పరిస్థితి బాగానే వున్నా.. ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేం. 

71 ఏళ్ళ క్రితం, ప్రయోగం పేరుతో పేల్చిన రెండు బాంబులు సృష్టించిన విలయమే ప్రపంచాన్ని వణికిస్తే, అందకు వంద రెట్లు, వెయ్యి రెట్లు శక్తి గల బాంబులు ఇప్పుడు చాలా దేశాల అమ్ములపొదిలో వున్నాయి గనుక, వాటి ద్వారా సంభవించే ప్రళయం.. ఆ ఆలోచనే అత్యంత భయానకం.