రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంతో దేశంలో హాకీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయం ఒక్కటే కదా.. అన్న పెదవి విరుపులు ఇంకా అక్కడక్కడా విన్పిస్తున్నాయంటే కారణం హాకీలో ఇటీవలి కాలంలో భారత జట్టు చవిచూస్తున్న వైఫల్యాలే. కారణాలేవైతేనేం, రియో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియాపై ఓ మోస్తరు అంచనాలు వున్నాయన్నది నిర్వివాదాంశం.
ఆరంభంలోనే ఒలింపిక్స్‌లో తొలి విజయాన్ని హాకీ ఇండియా జట్టు అందుకుని కూడా చాలాకాలమయ్యింది. ఎప్పుడో 2000 సంవత్సరంలో ఈ ఘనతను సాధించిన టీమిండియా ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకోవడం గమనార్హం. ఆ రకంగా కూడా ఈ విజయం ప్రత్యేకమైదే. జట్టు చిన్నదే అయినా ప్రతి విజయమూ ముఖ్యమైనదే కదా. ప్రస్తుతానికి ఐర్లాండ్ జట్టుని 3-2 తేడాతో ఓడించి, హాకీ ఇండియా ముందడుగు వేసింది.
ఇక, తదుపరి మ్యాచ్ మాత్రం హాకీ ఇండియాకి అగ్ని పరీక్షే. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీతో మెన్ ఇన్ బ్లూ తలపడాల్సి వుంటుంది. ఆ మ్యాచ్‌కి ముందు ఐర్లాండ్‌తో విజయం మెన్ ఇన్ బ్లూలో కొత్త ఉత్సాహాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం.
మరోపక్క, పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో భారత ద్వయం పేస్, బోపన్న నిరాశపర్చారు. పోలాండ్ జోడీ చేతిలో భారత జోడీ పరాజయం పాలయ్యింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత మహిళా షూటర్లు అపూర్వి చండీలా, అయోనికా పాల్ కూడా నిరాశపరిచారు.
ఇదిలా వుంటే రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం అమెరికా వశమయ్యింది. పది మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అమెరికాకి చెందిన 19 ఏళ్ళ జినీ థ్రాషర్ స్వర్ణం కైవసం చేసుకుంది.