బాబుపై ఆద‌ర‌ణ‌.. వైసీపీ మేల్కోక‌పోతే!

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబునాయుడు ఎట్ట‌కేల‌కు 50 రోజుల త‌ర్వాత బ‌య‌టికొచ్చారు. వైద్యావ‌స‌రాల రీత్యా ఆయ‌న‌కు నాలుగు వారాల మ‌ధ్యంత‌ర బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి మంగ‌ళ‌వారం…

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబునాయుడు ఎట్ట‌కేల‌కు 50 రోజుల త‌ర్వాత బ‌య‌టికొచ్చారు. వైద్యావ‌స‌రాల రీత్యా ఆయ‌న‌కు నాలుగు వారాల మ‌ధ్యంత‌ర బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న విడుద‌ల‌య్యారు. అక్క‌డి నుంచి ఆయ‌న విజ‌య‌వాడ‌లోని త‌న ఇంటికి కాన్వాయ్‌గా బ‌య‌ల్దేరారు. అడుగ‌డుగునా ఆయ‌న‌కు టీడీపీ శ్రేణులు నీరాజ‌నం ప‌ట్టాయి.

మూడు గంట‌ల్లో విజ‌య‌వాడ‌లోని త‌న ఇంటికి చేరుకోవాల్సిన చంద్ర‌బాబుకు, దారి పొడ‌వునా ప్ర‌జ‌ల ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డంతో 14 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. అలాగే ఆయ‌న హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి వెళుతున్న క్ర‌మంలో కూడా ఇదే ర‌క‌మైన స్వాగ‌తం ల‌భించింది. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లే క్ర‌మంలో దారి పొడ‌వునా ఆయ‌న‌పై పూలు చ‌ల్లుతూ స్వాగ‌తం ప‌ల‌క‌డం విశేషం.  

బాబుకు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను ముఖ్యంగా వైసీపీ సీరియ‌స్‌గా తీసుకోవాలి. ఎన్నిక‌ల ముంగిట ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన చంద్ర‌బాబుకు ప్ర‌జాద‌ర‌ణ వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిజానికి చంద్ర‌బాబునాయుడు ప్ర‌జానాయ‌కుడు కాదు. ఆయ‌న‌లో మేనేజ్‌మెంట్ స్కిల్స్ మెండు. ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా అలిపిరిలో న‌క్స‌లైట్లు మందుపాత‌ర్లు పేల్చిన‌ప్పుడు కూడా జ‌నం ప‌ట్టించుకోలేదు. త‌న‌పై హ‌త్యాయ‌త్నాన్ని సానుభూతిగా మ‌లుచుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, ప్ర‌జావ్య‌తిరేక‌త ముందు ఈ గిమ్మిక్కులేవీ ప‌ని చేయ‌లేదు. అందుకే 2004లో ఆయ‌న ఓడిపోయారు.

కానీ తాజా ప‌రిణామాలను గ‌మ‌నిస్తే వైసీపీ మేల్కోవాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేస్తున్నాయి. చంద్ర‌బాబు అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాల‌పై కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది టీడీపీకి సానుభూతిగా మారుతుందా? లేదా? అనే  చ‌ర్చ‌కు తెర‌లేచింది. దీనిపై ఎవ‌రి వాద‌న‌లు వారివి. చంద్ర‌బాబుకు సంఘీభావంగా ఇటీవ‌ల త‌ల‌పెట్టిన స‌భ‌ల‌న్నీ స‌క్సెస్ కావ‌డం టీడీపీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగించేవే. ఇటీవ‌ల గ‌చ్చిబౌలిలో నిర్వ‌హించిన స‌భ స‌క్సెస్ కావ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

గ‌చ్చిబౌలి స‌భ‌కు హాజ‌రైన జ‌నం, అలాగే రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి అడుగ‌డుగునా చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన వారంతా కేవ‌లం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే అని వైసీపీ స‌ర్దిచెప్పుకుంటే, ఆ పార్టీ త‌న‌ను తాను మోస‌గించుకోవ‌డ‌మే అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. సామాన్య ప్ర‌జానీకంలో కూడా మునుపెన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబుపై సానుభూతి క‌నిపిస్తోంద‌నే అభిప్రాయం కొంత మంది వైసీపీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇది కేవ‌లం చంద్ర‌బాబుపై ప్ర‌జాద‌ర‌ణగా చూడ‌లేమ‌ని, ఇదే సంద‌ర్భంలో వైసీపీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త అనే కోణంలో ఆత్మ ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు ఐదారు నెల‌ల స‌మ‌యం వుంది. క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలుసుకోవాలి. చంద్ర‌బాబు అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాలు టీడీపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌వ‌నే భ్ర‌మ‌లో వుంటే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. రాజ‌కీయాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ప్ర‌జాభిప్రాయం ఎప్పుడూ ఒకేలా వుండ‌దు. అధికారంలో వున్న వాళ్లు స‌హ‌జంగా మ‌త్తులో వుంటారు.

ప్ర‌తిప‌క్షంలోకి వ‌స్తే త‌ప్ప ఆ మ‌త్తు దిగ‌దు. గ‌తంలో టీడీపీ కూడా ఇట్లే మ‌త్తులో వుండి, చివ‌రికి ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది. టీడీపీ ఓట‌మి నుంచి వైసీపీ గుణ‌పాఠాలు నేర్చుకోవాలి. చంద్ర‌బాబుపై జ‌నంలో వ‌చ్చిన మార్పును వైసీపీ మొట్ట‌మొద‌ట గుర్తించాలి. ఆ మార్పు త‌మ‌పై ఎంత వ‌ర‌కు వ్య‌తిరేకంగా వుందో తెలుసుకోవాలి. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి ఏ మేర‌కు పాజిటివ్ గ్రాఫ్ పెంచుతుందో ప‌సిగ‌ట్టాలి. ఈ రెండు ప‌నులు త‌క్ష‌ణం చేయ‌క‌పోతే మాత్రం అధికారంపై ఆశ‌లు వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.