సరదాకి: మోడీని నిలదీసిన వెంకయ్య.!

ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిలదీశారట. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ముందు కేంద్ర మంత్రి సుజనా చౌదరి నిరసన గళం విన్పించారట. దాంతో అటు నరేంద్రమోడీ, ఇటు అరుణ్‌ జైట్లీ బెంబేలెత్తిపోయారట.…

ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిలదీశారట. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ముందు కేంద్ర మంత్రి సుజనా చౌదరి నిరసన గళం విన్పించారట. దాంతో అటు నరేంద్రమోడీ, ఇటు అరుణ్‌ జైట్లీ బెంబేలెత్తిపోయారట. చంద్రబాబుతో సమావేశమవ్వాల్సిందిగా అరుణ్‌జైట్లీకి నరేంద్రమోడీ ఆదేశాలు జారీ చేశారట. ప్రత్యేక హోదాతోపాటు, ప్రత్యేక ప్యాకేజీపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా అరుణ్‌ జైట్లీకి మోడీ స్పష్టంగా చెప్పారట. 

ఏంటీ, ఇవన్నీ నిజమేనా.? కామెడీకి కూడా ఓ హద్దుండాలి. కానీ, 'పచ్చ' మీడియాకి కామెడీకి హద్దూ అదుపూ వుండదు. సీరియస్‌గా కామెడీ స్కిట్స్‌ని ప్రచారంలోకి తెచ్చేస్తుంటారంతే. రేపు ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. బీజేపీ, టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించేశాయి. అంతేనా, వ్యాపారవర్గాలు కూడా స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహిస్తామని ప్రకటించేశాయి. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌కి ఈ స్థాయిలో మద్దతు రావడంతో టీడీపీ అలర్ట్‌ అయ్యింది. 

ఓ పక్క ఢిల్లీ వేదికగా ఆందోళనల నాటకం, ఇంకోపక్క.. వైఎస్సార్సీపీ తలపెట్టిన బంద్‌ని నిర్వీర్యం చేసే కుట్రలు.. వీటితోపాటుగా, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకునే దిశగా కసరత్తులు ప్రారంభించిందనే కామెడీ స్కిట్స్‌.. ఇదీ పరిస్థితి. నవ్విపోదురుగాక మనకేటి.. అన్న చందాన తయారయ్యింది టీడీపీ, బీజేపీ పరిస్థితి.. వాటితోపాటుగా ఆ పార్టీలకు మద్దతిస్తోన్న సోకాల్డ్‌ 'పచ్చ'మీడియా సంస్థలదీ. 

ఫస్ట్‌ అండ్‌ ఇంపార్టెంట్‌ థింగ్‌.. వెంకయ్యనాయుడికి, నరేంద్రమోడీని నిలదీసేంత సీన్‌ లేదు. కనీసం, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితుల్ని నరేంద్రమోడీకి వివరించే ఛాన్స్‌ కూడా వెంకయ్యకు లేదు. ఒకవేళ నరేంద్రమోడీ దగ్గరా, బీజేపీలోనూ వెంకయ్యకు అంత సీన్‌ వుండి వుంటే, 'ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రత్యేక హోదాపై మాట్లాడాం.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం.. వాటన్నిటికీ మించి, రాజ్యసభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనేది హక్కుగా సంక్రమించింది..' అని ఈపాటికే వెంకయ్య కేంద్రంతో అమీతుమీకి సిద్ధపడేవారు. 

ఇక, అరుణ్‌ జైట్లీ వద్ద సుజనా చౌదరి ఓవరాక్షన్‌ విషయానికొస్తే, తన కంపెనీలు అడ్డంగా బుక్కయిపోవడంతో అసలంటూ సుజనా చౌదరిని కేంద్ర మంత్రి పదవిలోంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయంలో అరుణ్‌ జైట్లీనే, చంద్రబాబుకి తెగేసి చెప్పారు. దాంతో, చంద్రబాబు ఇటు అరుణ్‌ జైట్లీనీ అటు నరేంద్రమోడీనీ బతిమాలుకుని సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి నిలబెట్టారు.. ఇంకోసారి సుజనా చౌదరికి రాజ్యసభ పదవి ఇచ్చారు చంద్రబాబు. 

వాస్తవాలు ఇలా తగలడితే, టీడీపీ నేతల్ని వీరులు.. శూరులూ.. అన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియా ప్రొజెక్ట్‌ చేస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? కామెడీకి కూడా హద్దుంటుంది.. అర్థం పర్థంలేని కామెడీ అయినా అట్టర్‌ఫ్లాప్‌ అవ్వాల్సిందే. ప్రత్యేక హోదా సీరియస్‌ అంశం. ఇందులో ఇంత కామెడీ ఏంటి ఛండాలంగా.?