హేట్సాఫ్‌ టు చిరంజీవి.!

రాజకీయాల్లో విలువలు ముఖ్యం. కానీ, ఆ విలువలే మృగ్యమైపోతున్నాయిప్పుడు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ రకంగా విభజన ప్రక్రియలో ఆయనకీ భాగం వుంది. రాజ్యసభలో,…

రాజకీయాల్లో విలువలు ముఖ్యం. కానీ, ఆ విలువలే మృగ్యమైపోతున్నాయిప్పుడు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ రకంగా విభజన ప్రక్రియలో ఆయనకీ భాగం వుంది. రాజ్యసభలో, చిరంజీవి సమక్షంలోనే, ఆయన కేంద్రమంత్రిగా వున్నప్పుడే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ లెక్కన, ఆనాటి ఘటనకు చిరంజీవి కేంద్రమంత్రి హోదాలో ప్రత్యక్ష సాక్షి కూడా. 

కానీ, ఇప్పుడు చిరంజీవి ఎక్కడ.? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చిరంజీవి ప్రస్తుత పాత్ర ఏంటి.? ఏపీ కాంగ్రెస్‌ నేతలు పబ్లిసిటీ కోసమే అయినా, ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని వీధి పోరాటాలు షురూ చేశారు. కానీ, చిరంజీవి నుంచి ఆ పోరాటాలకు మద్దతు కన్పించడంలేదు. చిరంజీవి ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడే. ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు 'ఆనాటి ఆ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని..' అని చెప్పలేకపోయారు చిరంజీవి. అసలు ఆ చర్చ సందర్భంగా చిరంజీవి, రాజ్యసభకు హాజరు కాలేదు కూడా.! 

ఇంకోపక్క చిరంజీవి, సినిమా ఫంక్షన్‌లో కనిపించి.. పబ్లిసిటీ ఊదరగొట్టేస్తున్నారు. సినీ రంగంలో తిరిగి తన ప్రాభవాన్ని నిలబెట్టుకునేందుకు చిరంజీవి పడ్తున్న తంటాల గురించి ఇక్కడ చర్చ అనవసరం. ప్రత్యేక హోదా అనేది ప్రజలకు సంబంధించిన అంశం. తెలుగు రాజకీయాల్లో సత్తా చాటేస్తానంటూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న చిరంజీవి, మరీ నాసిరకంగా కాకపోయినా, కాస్తో కూస్తో ఓట్లు సీట్లు దక్కించుకున్నమాట వాస్తవం. అది ప్రజారాజ్యం నాటి పరిస్థితి. 

తనను రాజకీయ నాయకుడిగా ఆదరించిన ప్రజలకోసం చిరంజీవి, తన రాజకీయ జీవితాన్ని కాస్తయినా ఉపయోగించాలి కదా.? తెలంగాణలో ఆయనకు అంత సీన్‌ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి సేమ్‌ టు సేమ్‌. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం పోరుబాట పడితే, అందులో ఓటు బ్యాంకుని చూసుకున్న చిరంజీవి.. ఆ సందర్భంలో కాస్తంత ఓవరాక్షనే చేసినా, స్పందించడాన్ని తప్పు పట్టలేం. 

మరిప్పుడు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ప్రత్యేక హోదా అడుగుతున్నారు. 'మీరు కేంద్రమంత్రిగా పనిచేసినప్పుడే మీరు కొలువుదీరిన రాజ్యసభలోనే మీ సమక్షంలోనే ప్రత్యేక హోదా హామీ మీ ప్రభుత్వం నుంచి వచ్చింది.. దాని అమలుపై మీరు చేస్తున్న పోరాటమేంటి?.' అని జనం ప్రశ్నిస్తున్నారు. తమ్ముడికి తమ్ముడు.. రాజకీయాలంటే టైమ్‌పాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుకుని, అన్నయ్యకు అన్నయ్య పదవులకోసమే రాజకీయాలనుకుని.. ఇద్దరూ కలిసి నమ్మినోళ్ళని నట్టేట్లో ముంచెయ్యడాన్ని ఏమనుకోవాలి.? 

మొన్నామధ్య, కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశముందంటూ కాంగ్రెస్‌ అధిష్టానం విప్‌ జారీ చేస్తే, ఓ బ్యాగ్‌ భుజాన వేసుకుని పార్లమెంటులో ప్రెస్‌ ఫొటోలకి పోజులిచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత ఆ అంశం గురించి మాట్లాడకపోవడం గమనార్హం. హేట్సాఫ్‌ టు చిరంజీవి.. అనాలా.? తప్పదు మరి, విలువల్లేని ప్రస్తుత రాజకీయాల్లో, ఆ విలువల్ని ఇంకా ఇంకా దిగజార్చేయడంలో తనవంతు పాత్ర పోషించినందుకు హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.!