గడిచిన 10 దశాబ్దాలలో (100 ఏళ్లు) అత్యుత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసింది టైమ్ మ్యాగజైన్. క్రిటిక్ స్టెఫానీ జచారెక్ ఈ జాబితాను తయారుచేశారు. 1920 నుంచి ప్రారంభించి, 2019 వరకు ప్రతి దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ 100 చిత్రాలతో జాబితా తయారుచేశారు.
ది క్యాబినెట్ ఆఫ్ డాక్టర్ కాలిగారి (1920) అనే సినిమాతో ప్రారంభమై.. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ (2019)తో ఈ వంద అత్యుత్తమ చిత్రాల జాబితా ముగిసింది. ఈ వంద చిత్రాల్లో భారత్ నుంచి ఒకే ఒక్క చిత్రానికి ప్రాతినిధ్యం దక్కింది. 1955లో వచ్చిన పథేరా పాంచాలి సినిమాకు టాప్-100 లిస్ట్ లో చోటు దక్కింది.
సత్యజిత్ రే తీసిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. టైమ్స్ ఆల్ టైమ్ క్లాసిక్స్ జాబితాలో కూడా దీనికి చోటు దక్కింది. ఇప్పుడు “10 దశాబ్దాల 100 అత్యుత్తమ చిత్రాల” లిస్ట్ లో కూడా ఈ సినిమా స్థానం దక్కించుకుంది.
ఆస్కార్ అవార్డులు అందుకున్న చాలా చిత్రాలకు లిస్టులో చోటు దక్కింది. వీటితో పాటు మిడిల్ ఈస్ట్ కు చెందిన చిత్రాలు లిస్ట్ లో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన బెస్ట్ క్లాసిక్స్ అన్నింటికీ లిస్ట్ లో చోటు దక్కింది.
కళను మరింత ముందుకు తీసుకెళ్తూ, సమాజానికి స్ఫూర్తిని ఇచ్చే చిత్రాలతో పాటు.. జాతి, మత, కుల, లింగ విచక్షణ లేకుండా అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్ని ఈ లిస్ట్ లో ఉంటారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో, ఈ చిత్రాలకు ఎలాంటి ర్యాంకింగ్స్ ఇవ్వలేదు 'టైమ్'. కేవలం ఆ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ సినిమాలుగా మాత్రమే వాటిని చెప్పుకొచ్చింది.