బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కోలీవుడ్ పై పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు, టెక్నీషియన్స్ ను మాత్రమే తీసుకోవాలని, పరభాషా నటీనటులు టెక్నీషియన్స్ ను తీసుకోవద్దంటూ సెల్వమణి చేసిన వ్యాఖ్యల్ని పవన్ తప్పుపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చిత్ర పరిశ్రమ ఎదగదన్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలు రావాలంటే, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు.
ఈ మొత్తం వ్యవహారంపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు నాజర్. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి కొన్ని సూచనలు మాత్రమే చేశారని, తమిళ్ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లను పెట్టుకోమన్నారు తప్ప, ఇతర భాషల వ్యక్తులని నిషేధించాలని ఆయన చెప్పలేదని నాజర్ అన్నారు. అయినా సెల్వమణి చేసిన వ్యాఖ్యలు కేవలం సూచనలు మాత్రమేనని, అవి నిబంధనలు కావని అన్నారు.
తమిళ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన వ్యక్తులు పనిచేయకూడదనే నిబంధన పెట్టారనే ప్రచారాన్ని నాజర్ ఖండించారు. అలాంటి నిబంధన తీసుకొస్తే, దాన్ని ఖండించే వ్యక్తుల్లో ముందు తనే ఉంటానని అన్నారు. సినిమాకు, కళాకారులకు హద్దులు-సరిహద్దులు ఉండకూడదన్న నాజర్.. పూర్తి సమాచారం లేకుండా పవన్ మాట్లాడారని అన్నారు.
ఎస్వీ రంగారావు, సావిత్రి, వాణిశ్రీ, శారద లాంటి నటీనటుల్ని కోలీవుడ్ అక్కున చేర్చుకుందని.. వాళ్లు తెలుగు వ్యక్తులనే విషయం చాన్నాళ్ల వరకు తనకు తెలియదన్నారు నాజర్. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ప్రచారంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించిన ఈ సీనియర్ నటుడు.. కోలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్, బాహుబలిని మించిన సినిమాలు వస్తాయన్నారు.