పవన్ కల్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బుక్ మై షోలో ఇలా తెరవగానే, క్షణాల్లో టిక్కెట్లన్నీ అమ్ముడుపోతాయి. కేవలం మార్నింగ్ షో మాత్రమే కాదు.. ఫస్ట్ వీకెండ్ మొత్తం దాదాపు 70శాతం టిక్కెట్లు బుక్ అయిపోతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
బ్రో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై దాదాపు 24 గంటలు గడిచినా, ఇంకా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మెయిన్ థియేటర్లలో కూడా అక్కడక్కడ టిక్కెట్లు దొరుకున్నాయి. మరీ ముఖ్యంగా కీలకమైన నైజాంలో చాలా థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి కారణం, పవన్ పై క్రేజ్ తగ్గడం కాదు, తెలంగాణలో వర్షాలు కురవడం.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాలతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, రేపు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. దీంతో నైజాంలో బ్రో సినిమా వసూళ్లపై వర్ష ప్రభావం గట్టిగా పడేలా ఉంది.
నిజానికి బ్రో సినిమా కమర్షియల్ మూవీ కాదు. ఇదొక సందేశాత్మక చిత్రం. సినిమాలో పవన్ దేవుడు. అతడికి హీరోయిన్ లేదు, డ్యూయట్స్ లేవు. అయినప్పటికీ రచయిత త్రివిక్రమ్ ఉన్నంతలో మేజిక్ చేసే ప్రయత్నం చేశాడు. దేవుడితో లుంగీ కట్టించాడు, కొన్ని మాస్ స్టెప్పులు వేయించాడు, చేతికి బీడీ కూడా అందించాడు.
సినిమాకు ఇంత కమర్షియల్ టచ్ ఇచ్చినప్పటికీ, ఊహించని విధంగా వచ్చిన వర్షాలు బ్రో సినిమా ఓపెనింగ్స్ ను దెబ్బకొట్టేలా ఉన్నాయి. ఉన్నంతలో ఏపీలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి, నైజాంలో మాత్రం పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు.
ఓవైపు టికెట్ రేట్లు పెంచలేదు, మరోవైపు జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బ్రో సినిమాకు ఓపెనింగ్స్ తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు.