వైసీపీకి చెందిన విశాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ తో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం భేటీ కావడం రాజకీయంగా వైరల్ అవుతోంది. ముద్రగడ గత నెలలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేసిన ఆరోపణలకు బదులిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కి ఆయన సవాల్ కూడా చేశారు. నాతో పోటీకి పిఠాపురంలో దిగు అంటూ పిలుపే ఇచ్చారు.
ఆ సమయంలో ముద్రగడకు బాహాటంగానే వైసీపీ నుంచి ఎనలేని మద్దతు లభించింది. ముద్రగడతో వైసీపీ ప్రధాన నాయకులు పలు మార్లు భేటీ వేసి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడకు చంద్రబాబుతో గిట్టదని అంటారు.
అందువల్ల ఆయనకు వైసీపీ సరైన రాజకీయ వేదిక అవుతుంది అని ఆ పార్టీ భావిస్తోంది. ముద్రగడ ఇటీవల కాలంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తన నివాసంలో కలుసుకుంటున్నారు. అంతా ముద్రగడ ఉంటున్న కిర్లంపూడి నివాసానికి వచ్చి రాజకీయ చర్చలు జరిపాయని వార్తలు వెలువడ్డాయి.
ఇపుడు ముద్రగడ స్వయంగా విశాఖ వచ్చి మంత్రి గుడివాడ ఇంటికి రావడం అంటే రాజకీయంగా ఏదో జరుగుతోంది అని అంటున్నారు. అయితే ఇది జస్ట్ కర్టెసీ కాల్ అనే అంటున్నా లోపాయికారీగా ముద్రగడను వైసీపీలోకి చేర్చేందుకు జరిగే మరో ప్రయత్నం అంటున్నారు.
ముద్రగడకు గట్టి మద్దతుదారుడిగా మంత్రి గుడివాడ అమరనాధ్ ఇటీవల కాలంలో చాలా ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇపుడు ఈ ఇద్దరు భేటీలో ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి అన్నది అన్ని పార్టీలలోనూ ఆసక్తిని రేపుతోంది. వైసీపీ తన అస్త్రాలను రానున్న ఎన్నికల కోసం వాడుతోందా అన్నదే ఆలోచించాల్సి ఉంది.