తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిజాయితీకి పరీక్షా సమయం ఇది. ఎంసెట్ లీకేజీ ఆషామాషీ వ్యవహారం కాదు. కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో దాగుంది. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ఈ కుంభకోణం కారణంగా అయోమయంలో పడిపోయింది. ఏముందిలే, మళ్ళీ పరీక్ష రాసేస్తారని తేలిగ్గా చెప్పేయొచ్చుగాక. పరీక్ష రద్దు, మళ్ళీ పరీక్ష అంటే.. అది విద్యార్థుల జీవితాలతో చెలగాటమే. అయినా తప్పదు, రద్దు చేసి పరీక్ష నిర్వహించాల్సిందే. గత అనుభవాలు అలాంటివి మరి.
అయితే, ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఈ కేసులో దోషులకు ఎలాంటి శిక్ష పడుతుంది.? అని. లీకు వీరులకు ఇదే తొలి వ్యవహారం కాదు. గతంలో చాలా చాలా చేసేసి వున్నారు. ఇప్పుడు చేశారు, ఇకపైనా చేస్తారు, చేస్తూనే వుంటారు. గతంలో అరెస్టులు జరిగాయి, లీకు వీరులు జైలుకు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు.. తమ పని తాము చేసుకుపోయారు. మరి, ఇప్పుడూ అదే జరుగుతుందా.? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.
'మా జీవితాలతో చెలగాటమాడినోళ్ళను వదలొద్దు..' అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. మామూలుగా అయితే వున్న చట్టాల ప్రకారం జరీమానా, జైలు శిక్ష లాంటివాటితో సరిపెట్టడం మినహా, అంతకు మించి చేయడానికి ఏమీ వుండదు. మన దేశంలో చట్టాలు అలా వున్నాయి మరి. ఉరిశిక్ష పడాల్సిన కేసుల్ని యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చేసి, చివరికి 'క్షమాభిక్ష' కింద దోషులకు స్వేచ్ఛ కల్పించిన గొప్ప న్యాయవ్యవస్థ మనది.
సల్మాన్‌ఖాన్ విషయంలో ఏం జరిగిందో చూశాం. జయలలిత కేసులో జరిగిందీ తిలకించాం. సంజయ్‌దత్ సంగతేంటో చూసేశాం. అంత పెద్ద నేరాల్లోనే కొందరికి శిక్ష పడితే, కొందరు దోషులుగా తొలుత తేలి, ఆ తర్వాత నిర్దోషులయ్యారు. సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తీసుకుంటే, ఆ కేసులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతటి తీవ్రమైన కేసులే తుస్సుమన్నాయి. సో, ఎంసెట్ లీక్ అనేది పాలకుల దృష్టిలోనో, న్యాయస్థానం దృష్టిలోనో చాలా చాలా చిన్న విషయాలుగా మారిపోవచ్చుగాక.!
ఇప్పుడు జరిగింది, ఇకపై జరగకూడదు.. అంటే వ్యవస్థలో ప్రక్షాళన జరగాల్సిందే. 'పెద్ద తలకాయలు లేకుండా లీకేజీ అసాధ్యం..' అన్నది సర్వత్రా విన్పిస్తోన్న మాట. ఆ తలకాయలు ప్రభుత్వంలో వుండొచ్చు, అధికారులూ కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు. వాళ్ళందరి పేర్లూ తెరపైకి వస్తాయా.? రావడం కాస్త కష్టమే. ఎందుకంటే, ఓటుకు నోటు కేసు చూశాం. అదిప్పుడు న్యాయస్థానంలో వుంది గనుక, చట్టం గురించీ న్యాయం గురించీ మాట్లాడ్డానికేమీ లేదు. కానీ, 'చంద్రబాబు ఎలా తప్పించుకుంటారో చూస్తాం..' అని అప్పట్లో తొడగొట్టిన కేసీఆర్, ఆ తర్వాత సైలెంటయిపోయారు.
సో.. ఎంసెట్ బాధితులు (విద్యార్థులు) ప్రభుత్వం నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అద్భుతాల్ని ఆశించడం అనవసరం. కానీ, కొత్త రాష్ట్రంలో ఇలాంటి ఘటన.. ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఘటన, ప్రభుత్వానికి మచ్చ తెచ్చిన ఘటన.. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో, కేసీఆర్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తారా.? కొన్నాళ్ళకు జనం మర్చిపోతార్లే.. అనుకుని లైట్ తీసుకుంటారా.? వేచి చూడాల్సిందే.