విశాఖలో అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఓ కీలక ప్రాంతాన్ని డెవలప్ చేసింది. దాన్ని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మాదిరిగా అభివృద్ధి చేయాలన్నది సంకల్పం. మొత్తం ఐటి జోన్ కు అత్యంత సమీపంలో వుండడం, ప్రశాంతవాతావరణంలో వుండడంతో ఈ స్థలాలకు మంచి గిరాకీ వుంటుందని విశాఖ నగరాభివృధ్ధి సంస్థ భావిస్తోంది. వచ్చేనెల తొలి వారంలో ఈ ప్లాట్ల వేలం జరగబోతోంది.
ఫార్ట్యూన్ హిల్స్ అని పేరు పెట్టిన ఈ ఏరియాలో స్థలాలు ఎలా వుంటాయో చూడమని పలువురు టాలీవుడ్ జనాలు అక్కడి తమ సన్నిహితులకు అప్పుడే కబురు చేసారట. ఒక ప్రైస్ సెట్ చేసి, ఆ రేంజ్ లో వస్తే ప్లాట్లు కొనుగోలు చేయమని పలువురు సినిమా ప్రముఖులు తమ తమ సన్నిహితులకు చెబుతున్నారట. అయితే ఇలా చెబుతున్నవారిలో టాలీవుడ్ లోని బడా జనాల కన్నా, మీడియం రేంజ్ జనాలే ఎక్కువగా వున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ టాప్ జనాలు అందరికీ ఇప్పటికే విశాఖలో స్థలాలు వున్నాయి. పైగా వారి దృష్టి ఈ గజాల మీద వుండదు..ఎకరాల మీద తప్ప. కానీ ఇప్పుడిప్పుడే రోజుకు లక్ష, లక్షన్నర వంతున తీసుకుంటున్న మీడియం రేంజ్ జనాలు, కమెడియన్లు, క్యారెక్టర ఆర్టిస్టులు మాత్రం విశాఖ స్థలాల వంక చూస్తున్నారట.
వీరందరు విశాఖలో స్థలం పై దృష్టి పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఎప్పటికైనా విశాఖకు ఇండస్ట్రీ తరలి వెళ్తుందేమో అన్న అనుమానమే తప్ప వేరు కాదని తెలుస్తోంది. ఎందుకయినా మంచిది వుంటే, అని స్థలాల రేట్లు ఆచూకీ తీస్తున్నారట. అదీ సంగతి.