సైనైడ్‌ వెనుక కథ.!

మద్యం సేవిస్తే ప్రాణాలు పోతాయ్‌. ఇది అందరికీ తెల్సిన విషయమే. మద్యం ఆరోగ్యానికి హానికరం.. అని సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఆ మద్యం అమ్మకాల మీదనే ప్రభుత్వాలు నడుస్తాయి. మద్యం సేవించి వాహనం నడిపితే…

మద్యం సేవిస్తే ప్రాణాలు పోతాయ్‌. ఇది అందరికీ తెల్సిన విషయమే. మద్యం ఆరోగ్యానికి హానికరం.. అని సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఆ మద్యం అమ్మకాల మీదనే ప్రభుత్వాలు నడుస్తాయి. మద్యం సేవించి వాహనం నడిపితే క్రిమినల్‌ కేసు.. బహిరంగంగా మద్యం సేవించినా అంతే. నాలుగ్గోడల మధ్య తాగి తందనాలాడితే సమస్య ఏమీ లేదు. తాగండి, తాగి చావండి.. ఖజానా మాత్రం నింపండి.. ఇదీ పాలకుల నినాదం. పైకి మాత్రం మద్య నియంత్రణకు తాము కట్టుబడి వున్నామనే పాలకులు చెబుతుంటారు. 

ఇక, అసలు విషయానికి వస్తే, విజయవాడలో ఏడుగురి మరణానికి కారణమయ్యింది మద్యపానం. స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ బార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతది కావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. చిత్రమేంటంటే, ఈ బార్‌లో ఓ టీడీపీ నేత కూడా భాగస్వామి. అయితే అధికారికంగా కాదు, అనధికారికంగా. వివాదం వెలుగు చూశాక ఆ టీడీపీ నేత సైడయిపోతే, కాంగ్రెస్‌ నేత బుక్కయిపోయారు. 

విచారణ తాపీగా జరిగింది, ఇప్పుడు కొత్తగా మరణాలకు కారణం సైనైడ్‌ అని తేలింది. వాట్‌ యాన్‌ ఇన్వెన్షన్‌.. అన్పిస్తోంది కదూ.! సైనైడ్‌ ఎవరు కలిపారు.? అన్నది తేలాలిక్కడ. ఓ సైకోగాడు సైనేడ్‌ కలిపాడు.. ప్రత్యర్థులెవరో కలిపారు.. ఇంతకన్నా బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇంకేముంటాయి, కేసు నుంచి తప్పించుకోడానికి, తప్పించడానికి. రానున్న రోజుల్లో అదే జరుగుతుంది. నో డౌట్‌. 

సైనైడ్‌ కథ వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరున్నారన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. విచారణలో తేలింది.. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో తేలింది.. అన్న వాదనల్నీ కొట్టి పారేయలేం. కానీ, కలిపిన వ్యక్తి.. అంటే ఓ అనామకుడ్ని కేసులో ఇరికించి, వివాదాన్ని 'క్లోజ్‌' చేయించే ప్రయత్నాలైతే ఖచ్చితంగా జరుగుతాయి. సో, ఆ కాంగ్రెస్‌ నేత సేఫ్‌.. ఇప్పటికే సేఫ్‌ జోన్‌లో వున్న ఆ టీడీపీ నేత కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. 

కొన్నేళ్ళ క్రితం విజయవాడలో, విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో ఇలాంటి ట్విస్ట్‌లో చోటు చేసుకున్నాయి. అనామకుడ్ని తీసుకొచ్చి కేసులో ఇరికించారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేత పుత్రరత్నం ఈ కేసులోంచి తేలిగ్గా తప్పించుకున్నాడు. రాజకీయ దుమారం రేగిందిగానీ, జనంలో నెలకొన్న అనుమానాలు మాత్రం నివృత్తి కాలేదు, కావు కూడా. ఎందుకంటే, చట్టం తన పని తాను చేసుకుపోవడం కాదు.. చట్టం నాయకులకు తగ్గట్టుగా పనిచేసుకుపోతుందంతే.!