అబ్జర్వేషన్‌: ఏమిటీ ‘పచ్చ’ కామెర్లు.?

పాలకులకు 'పచ్చ'కామెర్లుగానీ వచ్చేయలేదు కదా.! ఎందుకంటే, పచ్చదనం.. పచ్చదనం.. అంటూ తెగ కలవరించేస్తున్నారు. అధికారుల్ని పరుగులు పెట్టేస్తున్నారు. పనులన్నీ పక్కన పెట్టేసి, పచ్చదనం మీద ఫోకస్‌ పెట్టాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసేస్తుండడంతో పాలన పడకేసేస్తోంది.…

పాలకులకు 'పచ్చ'కామెర్లుగానీ వచ్చేయలేదు కదా.! ఎందుకంటే, పచ్చదనం.. పచ్చదనం.. అంటూ తెగ కలవరించేస్తున్నారు. అధికారుల్ని పరుగులు పెట్టేస్తున్నారు. పనులన్నీ పక్కన పెట్టేసి, పచ్చదనం మీద ఫోకస్‌ పెట్టాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసేస్తుండడంతో పాలన పడకేసేస్తోంది. జనజీవనం స్తంభించిపోతోంది. 

అదొక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌.. ముఖ్యమైన అధికారులంతా మొక్కలు నాటడానికి వెళ్ళారు. కేసుల కోసం వచ్చిన జనం సాయంత్రం వరకూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. చిన్న చిన్న కేసుల నుంచి, ఓ మోస్తరు కేసులదాకా.. వున్నాయి వచ్చినవారికి సంబంధించి. 'అయ్యవార్లంతా' మొక్కలు నాటడానికి వెళితే మా బతుకులేం కానూ.? అంటూ నిట్టూర్చారు బాధితులు. ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితీ ఇంతే. 

మంత్రిగారొస్తున్నారోచ్‌.. అనగానే, మొక్కలు నాటడానికి ఓ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేశారు. ఈ క్రమంలో కొన్ని మొక్కల్ని పీకి అవతల పారేశారు. కొన్ని చెట్ల కొమ్మలు విరిచేశారు. ఇది ఇంకో సంఘటన. మరో సందర్భంలో, అమాత్యులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ, ఏం లాభం.? ఆయనగారు అలా వెళ్ళగానే అందులో చాలా మొక్కలు మాయమైపోయాయి.. కొన్ని వాడిపోయాయి. 

సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైద్రాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్షల సంఖ్యలో మొక్కలు నాటారట. తీరా, ఆ మొక్కల పరిస్థితేంటో తెలుసా.? ఎండిపోయి, చచ్చిపోయాయి. గవర్నర్‌గారేమో, మొక్కలు పాతేసి ఊరుకోవడం కాదు, వాటిని పెంచాల్సిందే.. నేనే స్వయంగా రివ్యూ చేస్తానని చెప్పారు. ఏదీ ఎక్కడ ఆ రివ్యూ.? 

ఇప్పుడు వంతు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగారిది. ఈయన లెక్క కూడా కోట్లలోనే వుంది. 29వ తేదీన ఒకే రోజు ఏకంగా కోటి మొక్కలు నాటేయాలన్నది చంద్రబాబుగారి 'సంకల్పం'. సంకల్పం అనగానే, అమరావతి గుర్తుకొస్తుంది. ఆ సంకల్పం ఎప్పుడో అటకెక్కింది. ఇప్పుడీ పచ్చ సంకల్పం కూడా అంతే కావొచ్చు. తెలంగాణలోని అనుభవాల్ని చూస్తున్నాం కదా.! 

మొక్కల నుంచి ముఖ్యమంత్రులకో మనవి. అదేంటంటే, మొక్కల్ని పెంచుతారో లేదో ఆ సంగతి దేవుడెరుగు, వున్న మొక్కల్ని పాడు చెయ్యకండి.! రాజకీయ నాయకులు దేంతో అయినా పబ్లిసిటీ చేసేసుకోగలరు. ఇది ఇప్పుడు 'పచ్చ' పబ్లిసిటీ అన్నమాట. కోటి మొక్కలంటే, మొక్కకి కనీసం పది రూపాయల లెక్కేసుకున్నా పది కోట్లు. ఏకంగా 25 కోట్ల మొక్కలంటున్నారు. దాంతోపాటు, ముఖ్యమంత్రుల హెలికాప్టర్‌ టూర్లు, మంత్రుల పర్యటనలు, అధికారుల హంగామా.. ఇదంతా లెక్కేస్తే మొక్కల పేరుతో ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు తగలేస్తున్నట్లు.? మొక్కలు పాతడం.. వాటిని తొక్కి చంపేయడం.. పైగా, దీనికో పబ్లిసిటీ.. సిగ్గు సిగ్గు ఈ 'పచ్చ' రాజకీయం.!