వరుసపెట్టి సినిమాలు తీస్తాడు, కానీ హిట్స్ మాత్రం అప్పుడప్పుడు ఇస్తుంటాడు. అయితే అలా హిట్ వచ్చిన ప్రతిసారి తన రెమ్యూనరేషన్ పెంచేస్తుంటాడు ఆ హీరో. గతేడాది ఓ హిట్టొచ్చింది. వెంటనే రేటు పెంచేశాడు. తాజాగా ఓ అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ రేటు పెంచేశాడు. అదే పెద్ద ఆశ్చర్యం.
ప్రస్తుతం ఆ హీరో ప్రతి సినిమాకు అటుఇటుగా 17 నుంచి 19 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. తాజాగా సవరించిన పారితోషికం ఇది. ఇప్పుడీ రేటును సదరు హీరో రౌండ్ ఫిగర్ చేశాడు. తన తాజా చిత్రానికి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
అతడు తన రేటు పెంచుకోవడంలో తప్పు లేదు, అది అతడి ఇష్టం. నచ్చితే నిర్మాతలు సినిమాలు తీసుకుంటారు లేదంటే తప్పుకుంటారు. కానీ ఈసారి అతడు రేటు పెంచిన విధానం మాత్రం సహేతుకంగా లేదు. దానికో కారణం ఉంది.
సినిమా ఒప్పుకున్నాడు, కానీ అగ్రిమెంట్ మీద సంతకాలు ఇంకా పూర్తికాలేదంట. పారితోషికం గురించి మాట మాత్రం అనుకున్నారు. ఓ 20 శాతం అడ్వాన్స్ కూడా హీరోగారికి అందింది. తీరా అగ్రిమెంట్ కు వచ్చేసరికి, పైన చెప్పుకున్నట్టు రౌండ్ ఫిగర్ చేయమని డిమాండ్ చేశాడట హీరో. దీంతో వెనక్కి వెళ్లలేక, కోటి అదనంగా ఇచ్చుకోవడానికి మేకర్స్ సిద్ధపడ్డారు.
అసలే భారీ బడ్జెట్ సినిమా. ఓవైపు సెట్ వర్క్ కూడా మొదలైంది. ఇలాంటి టైమ్ లో నిర్మాతలకు మరో కోటి ఎక్స్ ట్రా ఖర్చు.
ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఆ హీరో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని తూచ తప్పకుండా ఫాలో అవుతున్నాడు. అందుకే కథ కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ.. పారితోషికం ఎక్కువగా ఇచ్చే బ్యానర్లకు కాల్షీట్లు ఇస్తున్నాడు. ఆ హీరో హవా ఇంకెన్నాళ్లిలా సాగుతుందో చూడాలి.